Indian Railway Going To Change General Ticket Rules: భారతదేశంలో ప్రతిరోజూ కోట్లాది మంది వందలాది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణీకుల్లో కొందరు రిజర్వ్‌ చేసిన కోచ్‌లలో ప్రయాణిస్తుంటారు & మరికొందరు రిజర్వ్ చేయని కోచ్‌లలో ప్రయాణిస్తారు. రిజర్వ్‌డ్‌ కోచ్‌లో జర్నీ చేయాలంటే ముందుగానే సీట్‌/ టిక్కెట్‌ బుక్ చేసుకోవాలి. అన్‌ రిజర్వ్‌డ్‌ లేదా జనరల్‌ బోగీలోకి ఎక్కడానికి ఏ వ్యక్తీ ముందుగానే టిక్కెట్‌ బుక్ చేసుకోవలసిన అవసరం లేదు. రైల్వే స్టేషన్‌కు వచ్చిన తర్వాత టిక్కెట్‌ కౌంటర్‌లో జనరల్‌ టిక్కెట్‌ తీసుకోవచ్చు లేదా టిక్కెట్‌ వెండింగ్‌ మెషీన్‌ నుంచి తీసుకోవచ్చు. జనరల్‌ టిక్కెట్‌ తీసుకున్న వ్యక్తి, ఛార్జీకి తగ్గట్లుగా, ఏ రైలులోనైనా ప్రయాణించవచ్చు. ప్రతిరోజు కోట్లాది మంది ప్రయాణికులు జనరల్ కోచ్‌లలో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు, జనరల్ టిక్కెట్లపై ప్రయాణించే ప్రయాణీకుల విషయంలో భారతీయ రైల్వే నిబంధనలు మార్చే ఆలోచనలో ఉంది. ఇది అమలులోకి వస్తే, జనరల్ టిక్కెట్‌తో ప్రయాణించే వ్యక్తులపై గట్టి ఎఫెక్ట్‌ పడుతుంది.

జనరల్ టిక్కెట్‌ రూల్స్‌లో ఎలాంటి మార్పులు ఉంటాయి?కొన్ని రోజుల క్రితం, మహా కుంభమేళాకు వచ్చిన ప్రయాణీకుల రద్దీ కారణంగా న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. ఆ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకూడదన్న ఆలోచనతో రైల్వే శాఖ కొన్ని రూల్స్‌ మారుస్తోంది. జనరల్ టిక్కెట్‌ రూల్స్‌ వాటిలో ఒకటి. రైల్వే మంత్రిత్వ శాఖ, సాధారణ టికెట్ బుకింగ్ ప్రమాణాలను మార్చే ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే, ఇకపై, సాధారణ టిక్కెట్‌/ జనరల్‌ టిక్కెట్‌పై రైలు పేర్లను కూడా ముద్రించవచ్చు. అంటే, జనరల్‌ టిక్కెట్‌ తీసుకుని ఏ రైలులోనైనా ఎక్కే వెసులుబాటు ఇకపై ఉండకపోవచ్చు. టికెట్‌పై రైలు పేరును ముద్రిస్తే, ఒక విధంగా దానిని కూడా రిజర్వ్‌డ్‌ టిక్కెట్‌లాగే చూడాలి. ప్రయాణీకుడు ఆ రైలులో తప్ప మరో రైలులో ప్రయాణించలేడు.

మరో ఆసక్తికర కథనం: వాట్సాప్‌లో గేమ్‌ ఛేంజింగ్‌ ఫీచర్‌ - ఫోన్‌పే, గూగుల్‌పేకి దబిడిదిబిడే!  

జనరల్ టికెట్ ఎంతకాలం చెల్లుబాటు అవుతుంది? (How long is a general ticket valid for?)రైల్వే జారీ చేసే అన్‌ రిజర్వ్‌డ్‌ టిక్కెట్‌ లేదా జనరల్ టికెట్‌కు చెల్లుబాటు గడువు ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న రైల్వే రూల్స్‌ ప్రకారం, జనరల్‌ టిక్కెట్‌ కాల పరిమితి 3 గంటలు. అంటే, ఓ వ్యక్తి జనరల్ టికెట్ తీసుకున్న సమయం నుంచి 3 గంటల లోపు ప్రయాణాన్ని ప్రారంభించాలి. 3 గంటలు దాటితే ఆ టికెట్ చెల్లదు. దీనర్ధం.. జనరల్‌ టిక్కెట్‌ తీసుకున్న వ్యక్తి, టిక్కెట్‌ తీసుకున్న సమయం నుంచి 3 గంటల తర్వాత ఏ రైలులోనూ ప్రయాణించలేడు, రిఫండ్‌ కూడా ఉండదు. . 3 గంటలు దాటిన తర్వాత ప్రయాణించాలంటే మళ్లీ కొత్తగా టిక్కెట్‌ తీసుకోవాలి.

మరో ఆసక్తికర కథనం: గ్యాస్‌ బండ నుంచి మ్యూచువల్‌ ఫండ్‌ వరకు - మార్చి 01 నుంచి కీలక మార్పులు, మీ జేబు జాగ్రత్త!