Financial Rules To Change From March 01, 2025: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి, అంటే మార్చి 01, 2025 నుంచి మన దేశంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మారబోతున్నాయి, అవి మీ జేబును & దైనందిన జీవితాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి, కొత్తగా వస్తున్న మార్పుల గురించి తెలుసుకోవడం ఆర్థిక ఆరోగ్యానికి మంచిది.
మార్చి 01, 2025 నుంచి రానున్న మార్పులలో... LPG సిలిండర్ ధరలు, మ్యూచువల్ ఫండ్ రూల్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లు, బ్యాంకు సెలవులు, UPI పేమెంట్స్ వంటివి ఉన్నాయి.
LPG సిలిండర్ రేట్లు
మన దేశంలో, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ప్రతి నెలా ఒకటో తారీఖున ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి, కొత్త రేట్లు ఆ నెలంతా అమల్లో ఉంటాయి. కాబట్టి, గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలు మార్చి 01, 2025న మారవచ్చు. ఒకటో తేదీ నుంచి వంట గ్యాస్ సిలిండర్ రేటు తగ్గవచ్చు లేదా పెరగవచచ్చు. ఈ మార్పు మీ ఇంటి బడ్జెట్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. LPG సిలిండర్ రేటు పెరిగితే వంటింటి బడ్జెట్ పెరుగుతుంది & అదే విధంగా గ్యాస్ రేటు తగ్గితే మీకు కాస్త ఉపశమనం లభిస్తుంది. ఫిబ్రవరి 01న, 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది & ఇళ్లలో ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేటు తగ్గలేదు.
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు
ఫిబ్రవరిలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్ తగ్గించింది. దానికి అనుగుణంగా కొన్ని బ్యాంకులు కూడా FDలపై వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి, ఇది మీ పెట్టుబడిపై రాబడిని ప్రభావితం చేయవచ్చు. మారిన ఎఫ్‌డీ రేట్లు మార్చి 01 నుంచి అమలులోకి రానున్నాయి. టాక్స్‌లు, విత్‌డ్రా రూల్స్ కూడా మారవచ్చు. మీరు FDలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, కొత్తగా వచ్చే మార్పులను అర్థం చేసుకోవడం బెటర్.
మ్యూచువల్ ఫండ్ నియమం
మ్యూచువల్ ఫండ్స్ & డీమ్యాట్ ఖాతాల్లో నామినేషన్ రూల్స్‌కు సంబంధించి, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) మార్పులు చేసింది. ఈ మార్పులు మార్చి 01, 2025 నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, పెట్టుబడిదారులు తమ డీమ్యాట్ ఖాతా లేదా మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో 10 మందిని నామినేట్ చేయవచ్చు.
UPI చెల్లింపు వ్యవస్థ
UPI చెల్లింపు వ్యవస్థలో కూడా మార్పులు జరగబోతున్నాయి. నూతన నియమం ప్రకారం, బీమా-ASB సర్వీస్‌ను UPI వ్యవస్థలో విలీనం చేస్తున్నారు. దీనివల్ల, జీవిత బీమా & ఆరోగ్య బీమా పాలసీదారులు ప్రీమియం మొత్తాన్ని ముందుగానే బీమా కంపెనీకి చెల్లించకుండా బ్యాంక్ ఖాతాలో బ్లాక్ చేయడానికి వీలవుతుంది. ఈ మార్పు పాలసీదార్లకు ప్రయోజనకరంగా ఉంటుంది, ప్రీమియం చెల్లింపులు మరింత సులభం అవుతాయి.
బ్యాంకు సెలవులు
2025 మార్చి నెలలో బ్యాంకులు 14 రోజులు సెలవులు తీసుకుంటాయి. మార్చి నెలలో మీకు బ్యాంక్‌లో ఏదైనా పని ఉంటే, బ్యాంక్ హాలిడేస్‌కు అనుగుణంగా మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అయితే, ఈ 14 రోజుల హాలిడేస్ అనేవి దేశవ్యాప్తంగా ఉండే హాలిడేస్. రాష్ట్రాన్ని బట్టి వీటిలో మార్పులు ఉండవచ్చు.
మరో ఆసక్తికర కథనం: వాట్సాప్‌లో గేమ్ ఛేంజింగ్ ఫీచర్ - ఫోన్‌పే, గూగుల్‌పేకి దబిడిదిబిడే!