UPI Lite Feature In WhatsApp: భారతదేశంలో ప్రతి స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్ యాప్ ఉంటుంది. అంటే, భారత్‌లో కోట్ల మంది WhatsApp యూజర్లు ఉన్నారు. ఇంత భారీ యూజర్ బేస్‌ను ఇంకా సమర్థంగా ఉపయోగించుకోవడానికి, UPI లైట్ ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెడుతోంది. UPI లైట్‌తో చిన్నపాటి లావాదేవీలను సజావుగా & ఈజీగా చేయొచ్చు.
మనకు తెలిసిన సమాచారం ప్రకారం, మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ ప్రస్తుతం ఈ ప్లాన్‌ను పరీక్షిస్తోంది. అంటే, బీటా వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది, అందరికీ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆసక్తి ఉన్న వాళ్లు బీటా వెర్షన్‌తో వాట్సాప్‌లో UPI లైట్ ఫీచర్‌ను టెస్ట్ చేయవచ్చు. బీటా వెర్షన్ విజయవంతమైతే, వాట్సాప్ యూజర్లు అందరికీ యూపీఐ లైట్ అందుబాటులోకి వస్తుంది. ఇది, డిజిటల్ పేమెంట్స్ రంగంలో గేమ్ ఛేంజర్ కావచ్చు. వాట్సాప్ యూపీఐ లైట్ ఫోన్‌పే (PhonePe), గూగుల్ పే (GPay), పేటీఎం (Paytm) వంటి యూపీఐ యాప్స్‌కు చాలా గట్టి పోటీ ఇస్తుంది.
వాట్సాప్ బీటా వెర్షన్ v2.25.5.17
ఇటీవల లాంచ్ అయిన WhatsApp బీటా వెర్షన్ v2.25.5.17, UPI లైట్ గురించి సిగ్నల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలోనే ఉంది, బీటా వెర్షన్ యూజర్ల నుంచి సలహాలు & సూచనలు తీసుకుని మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుతుంది. ఆ తర్వాత వాట్సాప్ యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుంది. కాబట్టి, యూపీఐ లైట్‌ను అధికారికంగా ఎప్పుడు లాంచ్ చేస్తారన్న విషయంపై స్పష్టత లేదు.
UPI లైట్ అంటే ఏంటి, ఎలా పని చేస్తుంది?
చెల్లింపుల చరిత్రలో యూపీఐ (Unified Payments Interface) ఒక సంచలనం, చాలా సులువుగా డబ్బు పంపవచ్చు. యూపీఐ లైట్, తన పేరుకు తగ్గట్లే మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. చాలా తక్కువ విలువైన లావాదేవీల కోసం దీనిని రూపొందించారు. యూపీఐ తరహాలో దీనికి రియల్ టైమ్ అథెంటికేషన్ గానీ, బ్యాంక్ ప్రమేయం గానీ అవసరం లేదు. యూజర్లు UPI లైట్ వాలెట్‌లోకి చిన్న మొత్తాన్ని లోడ్ చేయవచ్చు. పదేపదే PIN ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే ఈ బ్యాలెన్స్‌ను పేమెంట్ల కోసం ఉపయోగించవచ్చు.
డిజిటల్ చెల్లింపులలో పోటీ
భారతదేశంలో, WhatsApp ఇప్పటికే UPI లావాదేవీలను సపోర్ట్ చేస్తోంది. వాట్సాప్‌కు దాదాపు 50 కోట్ల యూజర్ బేస్ ఉంది. UPI లైట్‌ను పరిచయం చేయడం వల్ల, వీళ్లందరికీ మరింత ఈజీగా డిజిటల్ చెల్లింపుల అనుభవాన్ని అందుబాటులోకి తెస్తుంది. ప్రస్తుతం, Google Pay, PhonePe, Samsung Wallet లాగా WhatsApp అధికారిక UPI లైట్ భాగస్వాముల లిస్ట్‌లో లేదు. కానీ త్వరలోనే ఈ లిస్ట్‌లో చేరే అవకాశం ఉంది.
యూపీఐ లైట్‌తో పాటు.. యుటిలిటీస్, మొబైల్ రీఛార్జ్ వంటి బిల్లుల చెల్లింపు ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తేవడానికి కూడా WhatsApp గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ మెసేజింగ్ యాప్‌నకు ఇవన్నీ తోడయితే, వాట్సాప్ కూడా ఒక సమగ్ర చెల్లింపుల కేంద్రంగా మారుతుంది.
మరో ఆసక్తికర కథనం: రూ.5,400 పతనమైన పసిడి రేటు - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ