Income Tax Saving Tips:


ఆదాయం పెరగ్గానే పన్నుల మోత పెరుగుతుందని చాలా మంది ఆందోళన పడతారు. పన్ను భారం ఎలా తగ్గించుకోవాలా అని ఆలోచిస్తుంటారు. సెక్షన్‌ 80సీ ఏతర మినహాయింపుల గురించి వెతుకుతుంటారు. మీరూ ఈ కోవకే చెందితే మీ తల్లిదండ్రుల సాయం తీసుకోండి. పన్నుల్ని తగ్గించుకోండి!


ఆదాయపన్ను చట్టంలోని కొన్ని సెక్షన్లు మీ పన్ను భారం తగ్గించుకొనేందుకు ఉపయోగపడతాయి. ఇందుకు మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పేర్లతో పెట్టుబడుల్ని ప్లాన్‌ చేసుకుంటే చాలు! అలాగే వారి ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చుల్ని మినహాయించుకోవచ్చు. గతేడాది కన్నా తక్కువగా పన్ను చెల్లించొచ్చు. ఎలాగంటే?


తల్లిదండ్రులకు గిఫ్ట్‌ ఇవ్వండి!


మీ తల్లిదండ్రులకు మీరు గిఫ్ట్‌ ఇచ్చినా లేదా వారు మీకు బహుమతి ఇచ్చినా ఎలాంటి పన్ను భారం ఉండదు. ఒకవేళ మీరు వారికి నగదు బదిలీ చేసినా, దానిపై వారు ఆదాయం పొందినా మీ ఆదాయ పన్ను పరిధిలోకి రావు. ఉదాహరణకు మీ తల్లిదండ్రుల పేరుతో మీరే బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్‌ చేయొచ్చు. వారు తక్కువ పన్ను పరిధిలో ఉంటే మీకు పన్ను ఆదా అవుతుంది. వారసలు పన్ను పరిధిలోకే రాకుంటే మరింత ప్రయోజనం చేకూరుతుంది.


బ్యాంకు డిపాజిట్లపై నో టాక్స్‌!


బ్యాంకులు, పోస్టాఫీసు డిపాజిట్లపై పొందే వడ్డీకి సెక్షన్‌ 80టీటీబీ కింద రూ.50,000 వరకు మినహాయింపు లభిస్తుంది. పైగా ఇతరులతో పోలిస్తే వృద్ధులకు మరింత వడ్డీ వస్తుంది. అలాగే మీ తల్లిదండ్రులు ఈఎల్‌ఎస్‌ఎస్‌, చిన్న తరహా పొదుపు పథకాల్లో  పెట్టుబడి పెడితే సెక్షన్‌ 80సీ కింద వారికీ మినహాయింపు ఉంటుంది. అలాగే వారి డీమ్యాట్‌ ఖాతాల ద్వారా షేర్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేస్తే ఒక లక్ష రూపాయల వరకు దీర్ఘకాల మూలధన రాబడికి పన్ను ఉండదు.


అద్దె చెల్లించండి!


మీరు మీ తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటూ వారికి అద్దె చెల్లించొచ్చు. దానిని సెక్షన్‌ 10(3A) ద్వారా హెచ్‌ఆర్‌ఏ రూపంలో మినహాయించుకోవచ్చు. మీ కన్నా మీ తల్లిదండ్రులు తక్కువ పన్ను శ్లాబులో ఉంటే ఈ ట్రిక్‌ బాగా పనిచేస్తుంది. పైగా వారు సీనియర్‌ సిటిజన్లు అయితే, పన్ను పరిధిలోకి రాకుంటే మరీ మంచిది. అయితే ఆ ఇల్లు వారి పేరుతోనే ఉండాలి. హెచ్‌ఆర్‌ఏను క్లెయిమ్‌ చేసుకొనేందుకు బ్యాంకు ఖాతా లేదా చెక్‌ రూపంలో వారికి అద్దె చెల్లించి రసీదు పొందాలి.


బీమా తీసుకోండి!


మీ తల్లిదండ్రుల కోసం ఆరోగ్య బీమా కొనుగోలు చేస్తే మరికొంత పన్నుభారం తగ్గుతుంది. పైగా వారి ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చుల్నీ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. సెక్షన్‌ 80డీ, 80డీడీ, 80డీడీబీ కింద వేర్వేరు మొత్తాలకు మినహాయింపు లభిస్తుంది. 80డీ కింద రూ.25వేల నుంచి రూ.50,000 వరకు గరిష్ఠ మినహాయింపు పొందొచ్చు. 80 డీడీబీ కింద రూ.40,000 నుంచి రూ.1,00,000 వరకు పొందొచ్చు.


వీటిని మరవొద్దు!


పన్నులు తగ్గించుకొనేందుకు మీ తల్లిదండ్రుల సాయం తీసుకున్నప్పుడు మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ప్రతి లావాదేవీని జాగ్రత్తగా దాచుకోవాలి. ఆదాయ పన్ను రిటర్ను దాఖలు చేసేటప్పుడు వాటిని సమర్పించాల్సి రావొచ్చు. బహుమతి లావాదేవీలనూ రిపోర్టు చేయడం మర్చిపోవద్దు.