Income Tax Saving Schemes: 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్నును (Income Tax) ఈ మధ్యే కట్టినట్లు అనిపిస్తోంది, మరోవైపు 2022-23 ఆర్థిక సంవత్సరానికి పన్ను కట్టాల్సిన తరుణం అప్పుడే తరుముకొస్తోంది. పన్ను బాధల్ని తగ్గించుకునే కొత్త పెట్టుబడుల కోసం ప్లాన్ చేయాల్సిన సరైన సమయం ఇది. టాక్స్‌ సేవింగ్‌ స్కీమ్స్‌లో ఇప్పుడు పెట్టుబడి పెడితేనే, రిటర్న్స్‌ ఫైల్‌ చేసే సమయానికి మీరు ఒడ్డున పడతారు. అందుకే, టాక్స్‌ సేవింగ్‌ పథకాల కోసం వేతన జీవులు ఇప్పట్నుంచే వెదుకులాట మొదలు పెట్టారు. 


ఒకే సమయంలో ఆదాయ పన్ను ఆదాతో పాటు మంచి లాభాలను కూడా మీరు పొందాలనుకుంటే, మీ కోసం ఇక్కడ కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఇవి ప్రభుత్వ పథకాలు. ఈ పథకాల్లో మీరు పెట్టుబడి పెడితే, ఆ మేరకు పన్ను మినహాయింపుతో పాటు లాభాన్ని అందిస్తాయి ఇవి అందిస్తాయి.


ఆదాయాన్ని అందిస్తూ, పన్ను భారాన్ని తగ్గించే పథకాలు:


పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టడానికి PPF ఒక మంచి ప్లాన్. ఈ పథకంలో మీరు పెట్టే పెట్టుబడికి ఆదాయపు పన్ను సెక్షన్ 80 C కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఇందులో ప్రతి సంవత్సరం రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. సెక్షన్ 80 C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు అందుతుంది. అంటే, ఈ పథకం పన్ను రహితం. ఈ పథకం మీద మీకు 7.1 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది.


ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్‌
ఇవి పన్ను ఆదా చేసే మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇవి. వీటిని ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్‌గా (ELSS) పిలుస్తారు. పెట్టుబడిదారులకు అధిక రాబడి + పన్ను మినహాయింపును అందించే ఆకర్షణీయమైన ఫండ్స్‌ ఇవి. స్టాక్‌ మార్కెట్‌తో అనుసంధానించే ఈ ఫండ్స్‌లో మీరు పెట్టే పెట్టుబడులకు సెక్షన్ 80 C కింద ఆదాయ పన్ను మినహాయింపును పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్‌ అని కూడా అంటారు. అటువంటి మ్యూచువల్ ఫండ్లలో రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.


నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)
ప్రభుత్వం నిర్వహించే పన్ను ఆదా పథకం ఇది. రిస్క్ వద్దు అనుకున్న పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుంది. సెక్షన్ 80 CCD కింద గరిష్టంగా రూ. 2 లక్షల వరకు ఈ పథకంలో పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఇది సెక్షన్ CCD(1) కింద రూ. 1.5 లక్షల వరకు, సెక్షన్ CCD(1B) కింద అదనంగా రూ. 50 వేల వరకు మినహాయింపును అందిస్తుంది.


బీమా పథకం
జీవిత, ఆరోగ్య బీమా పథకాల్లో పెట్టుబడి పెట్టడం మరో సురక్షితమైన మార్గం. ఊహించని ప్రమాదాల నుంచి ఇవి మీ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఆస్తులను రక్షిస్తాయి. మీరు అప్పులపాలు కాకుండా కాపాడతాయి. దీంతోపాటు, ఈ పాలసీల కోసం మీరు చెల్లించే ప్రీమియంలకు ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపు ఉంటుంది.