Tax Saving Investments 2024: ఈ నెలతో 2024 సంవత్సరం ముగుస్తుంది. అంటే, మీ ఆదాయ పన్ను మినహాయింపు పెట్టుబడులను ఖరారు చేసి, మీ కంపెనీ యాజమాన్యానికి సమర్పించాల్సిన సమయం ఆసన్నమైంది. దీని గడువు సాధారణంగా డిసెంబర్ 31కి సెట్ చేస్తారు. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో హడావిడి పడకుండా మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను ఎంచుకోవడానికి తగినంత సమయం ఇచ్చేందుకే, ముందస్తుగా డిసెంబర్‌ నెలను సెట్‌ చేస్తారు. ఆదాయ పన్నును ఆదా చేసే పెట్టుబడులు మీ ఆర్థిక ప్రయాణంలో చాలా కీలకమైన మైలురాళ్లు. అవి మీ డబ్బును ఆదా చేస్తాయి, దీర్ఘకాలంలో ప్రయోజనాలను అందిస్తాయి. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) మీరు పన్ను ఆదా చేసే పెట్టుబడుల కోసం వెతుకుతుంటే, మీరు ఆలోచించదగిన కొన్ని ఆప్షన్లు ఇవి:


1. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్‌ (ELSS)
ELSSలు పన్ను ఆదా చేసే మ్యూచువల్ ఫండ్‌లు. ఇవి స్టాక్ మార్కెట్‌లలో ఎక్కువగా పెట్టుబడి పెడతాయి & ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపులను అందిస్తాయి. ఇవి మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో ఉంటాయి కాబట్టి రాబడి కూడా అవకాశం ఉంటుంది. వీటిని దీర్ఘకాలం పొడిగించుకుంటే ఇంకా మంచి మొత్తంలో రాబడి కళ్లజూసే అవకాశం ఉంది.


2. పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్ (Tax Saving FD)
తక్కువ రిస్క్‌ & పన్ను ఆదా ప్రయోజనాలను కలిపే ఏకైక పెట్టుబడి 'టాక్స్‌ సేవింగ్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌'. ఈ FDలు మార్కెట్ మార్పులకు ప్రభావితం కావు, హామీతో కూడిన రాబడిని అందిస్తాయి. అంతేకాకుండా, సెక్షన్ 80C కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపునకు అర్హత కల్పిస్తాయి. ఈ తరహా డిపాజిట్‌లకు ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది, సంపాదించిన వడ్డీపై పన్ను కట్టాలి.


3. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
వివిధ పన్ను ఆదా పెట్టుబడులలో, అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాల్లో 'పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్' (PPF) ఒకటి. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి/పొదుపు మార్గం. పీపీఎఫ్‌ కాల వ్యవధి 15 సంవత్సరాలు. ప్రస్తుతం 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి సెక్షన్ 80C కింద పన్ను రహితం. అంతేకాదు, దీనిపై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ అమౌంట్‌ కూడా పూర్తిగా పన్ను రహితం.


4. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)
ప్రధానంగా, చిన్న & మధ్య ఆదాయ పెట్టుబడిదారుల కోసం తీసుకొచ్చిన దీర్ఘకాలిక, ప్రభుత్వ మద్దతు గల పొదుపు పథకం ఇది. సంవత్సరానికి రూ.1.50 లక్షల వరకు ఎన్‌ఎస్‌సీలో పెట్టుబడులకు సెక్షన్ 80సి కింద పన్ను ఉండదు. సంపాదించిన వడ్డీ ఇప్పటికీ పన్ను పరిధిలోకి వస్తుంది. ఈ పథకం ఐదు సంవత్సరాల కాలవ్యవధితో ఉంటుంది, ప్రస్తుతం సంవత్సరానికి 7.70 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సింగిల్‌, జాయింట్‌ లేదా మైనర్ తరపున కూడా అకౌంట్‌ తీసుకోవచ్చు.


5. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)
60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని అందించడానికి రూపొందించిన ప్రభుత్వ మద్దతు గల పొదుపు పథకం ఇది. NSC లాగానే, SCSS పెట్టుబడులు కూడా సెక్షన్ 80C కింద రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపునకు అర్హత పొందుతాయి. 8.20 శాతం వడ్డీ రేటుతో, ఈ పథకం 5 సంవత్సరాల కాల వ్యవధిని కలిగి ఉంటుంది, దీనిని మరో 3 సంవత్సరాలు పొడిగించవచ్చు.


6. జాతీయ పెన్షన్ పథకం (NPS)
NPS అనేది రిటైర్మెంట్‌ను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన పొదుపు పథకం. ఇది వివిధ రకాల ఆస్తి వర్గాల్లో పెట్టుబడి పెడుతుంది, కొద్దిగా రిస్క్‌తో కూడుకున్నది. NPS కంట్రిబ్యూషన్‌లకు ఆదాయ పన్ను చట్టంలోని 80CCD (1) కింద రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు దొరుకుతుంది. సెక్షన్ 80CCD (1B) కింద మరో రూ. 50,000 వరకు తగ్గింపును కూడా క్లెయిమ్ చేయవచ్చు. మొత్తం కలిపి రూ. 2,00,000  పన్ను మినహాయింపునకు అర్హత ఉంటుంది.


పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) ఎంచుకున్న వాళ్లకు మాత్రమే ఆదాయ పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపులు లభిస్తాయని గుర్తుంచుకోండి.


మరో ఆసక్తికర కథనం: ఐఏఎస్, ఐపీఎస్‌లు రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదా, రూల్స్‌ అలా ఉన్నాయా?