Financial Tasks To Complete in March 2022: ఆర్థిక ఏడాది (Financial Year) ముగింపునకు వచ్చేసింది. డబ్బుకు (Money)  సంబంధించి కొన్ని డెడ్‌లైన్లు మార్చితోనే ముగిసిపోతున్నాయి. సవరించిన లేదా బిలేటెడ్‌ ఐటీఆర్‌ను దాఖలు చేయడం, పాన్‌తో ఆధార్‌ను అనుసంధానించడం, బ్యాంకు ఖాతా కేవైసీ పూర్తి చేయడం వంటివి ఉన్నాయి. ఆయా అంశాల తుది గడువులను ముందుగానే తెలుసుకొని పూర్తి చేయడం ముఖ్యం. లేదంటే జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. పన్ను మినహాయింపులు కోల్పోవాల్సి వస్తుంది.


Check 5 important financial tasks to complete in March


Aadhaar-PAN link । పాన్‌తో ఆధార్‌ అనుసంధానం


మనం చేసే ప్రతి లావాదేవీకి పాన్‌ కార్డు ఎంతో అవసరం. పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు 2022, మార్చి 31 చివరి తేదీ. ఇప్పటి వరకు పాన్‌తో ఆధార్‌ను లింక్‌ చేయని వాళ్లు గడువులోగా ఆ పని చేయాలి. ఒకవేళ మీరు పాన్‌, ఆధార్‌ను అనుసంధానించకపోతే ఏప్రిల్‌ నుంచి పాన్‌ కార్డు చెల్లుబాటు కాదు. డబ్బు పరంగా లావాదేవీలు చేపట్టాల్సినప్పుడు పెనాల్టీలు కట్టాల్సి ఉంటుంది. ఇన్‌వాలిడ్‌ పాన్ కార్డును తీసుకెళ్తే సెక్షన్‌ 272B కింద రూ.10,000 వరకు పెనాల్టీ విధిస్తారు.


Bank account KYC update । బ్యాంకు కేవైసీ అప్‌డేట్‌


వాస్తవంగా బ్యాంకు కేవైసీ పూర్తి చేసేందుకు 2021, డిసెంబర్‌ 31 తుది గడువు. ఒమిక్రాన్‌ వేరియెంట్‌ వ్యాపించడంతో భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) దీనిని 2022, మార్చి 31 వరకు పొడగించింది. ఒకవేళ మీరు కేవైసీ వివరాలు ఇవ్వకపోతే మీ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్‌ చేస్తారు.


Advance tax installment । అడ్వాన్స్‌ టాక్స్‌ చెల్లింపు 


ముందుగా అంచనా వేసిన పన్ను రూ.10,000 కన్నా ఎక్కువగా ఉంటే ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 208 ప్రకారం వారు అడ్వాన్స్‌ టాక్స్‌ చెల్లించాలి. దీనిని నాలుగు వాయిదాల్లో కట్టొచ్చు. మొదటి వాయిదాకు జూన్‌ 15, రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌కు సెప్టెంబర్‌ 15, మూడో వాయిదాకు డిసెంబర్‌ 15, నాలుగో వాయిదాకు మార్చి 15 చివరి తేదీలుగా ఉంటాయి. గత త్రైమాసికాల్లో అడ్వాన్స్‌ టాక్స్‌ వాయిదాలు చెల్లిస్తే ఈ నెల 15లోపు ఆఖరి వాయిదా చెల్లించాలి.


Tax saving investments । పన్ను ఆదా చేసే పెట్టుబడులు


పన్ను చెల్లింపు దారులు తమ పన్ను మినహాయింపు ప్రక్రియను ఇప్పట్నుంచే ప్రారంభించాలి. పెట్టుబడులను సమీక్షించుకోవాలి. పన్ను మినహాయింపు లభించే పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF), ఈఎల్‌ఎస్‌ఎస్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ (ELSS Mutual Funds), జాతీయ పింఛను పథకం (NPS) వంటివి అసెస్‌ చేసుకోవాలి.


Belated or revised ITR । బిలేటెడ్‌ ఐటీఆర్‌


సవరించిన లేదా బిలేటెడ్‌ ఐటీఆర్‌ను దాఖలు చేసేందుకు 2022, మార్చి 31 చివరి తేదీ. ఆలస్యంగా ఐటీఆర్‌ను ఈ-ఫైల్‌ చేసిన వ్యక్తులు దానిని ఎడిట్‌ చేసేందుకు మార్చి 31 వరకు అవకాశం ఉంది.