Income Tax Return 2024-25: మదింపు సంవత్సరం 2024-25 (Assessment Year 2024-25 లేదా AY 2024-25) కోసం ఆదాయ పన్ను పత్రాలు (Income Tax Return) సమర్పించిన వారికి, ఆదాయ పన్ను విభాగం ఓ హెచ్చరిక జారీ చేసింది. పన్ను చెల్లింపుదారు, తనకు విదేశాల్లో ఉన్న ఆస్తులు, విదేశాల్లో ఆర్జించిన ఆదాయాన్ని ITRలో వెల్లడించకుంటే రూ.10 లక్షల జరిమానా విధిస్తామని వార్నింగ్‌ ఇచ్చింది. నల్లధన నిరోధక చట్టం ప్రకారం రూ.10 లక్షల జరిమానా విధించవచ్చు. ఆలస్యంగా & సవరించిన ఐటీఆర్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31 అని కూడా గుర్తు చేసింది.



కంప్లయన్స్-కమ్-అవేర్‌నెస్ క్యాంపెయిన్ కింద, పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయ పన్ను విభాగం శనివారం పబ్లిక్ కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసింది. ఇందులో, పన్ను చెల్లింపుదారులు ఈ సంవత్సరం 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి తమ ఆదాయ పన్ను రిటర్న్‌లో (ITR) విదేశీ ఆస్తులు & ఆర్జన సమాచారాన్ని నమోదు చేయాలని, ఎలాంటి వివరాలను దాచకూడదని స్పష్టంగా చెప్పింది.


కన్సల్టేషన్ పేపర్‌లో ఇంకా ఏం ఉంది?
భారతదేశ నివాసులైన పన్ను చెల్లింపుదార్లు (India Resident Taxpayers) గత ఆర్థిక సంవత్సరంలో జరిపిన లావాదేవీలకు సంబంధించి కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం అని కన్సల్టేషన్ పేపర్‌లో ఆదాయ పన్ను విభాగం స్పష్టం చేసింది. కొన్ని నిర్దిష్ట పన్ను సంబంధిత కార్యకలాపాల్లో వారి భాగస్వామ్యం ఉంటే, దానిపై భారతదేశంలో పన్ను బాధ్యత (Tax liability) ఉంటుంది. అలాంటి లావాదేవీలను తప్పనిసరిగా ITRలో చేర్చాలి. 


విదేశీ ఆస్తులు, ఆదాయాల లిస్ట్‌
విదేశీ ఆస్తుల్లో బ్యాంక్ ఖాతాలు, నగదు విలువతో బీమా ఒప్పందాలు లేదా వార్షిక ఒప్పందాలు, ఒక సంస్థ లేదా వ్యాపారంలో ఆర్థిక వాటా, రియల్ ఎస్టేట్, ఈక్విటీ & డెట్‌ ఇంట్రెస్ట్‌లు, ధర్మకర్తగా ఉన్న ట్రస్ట్‌లు, సెటిలర్ లబ్ధి, సంతకం చేసే అధికారం కలిగిన ఖాతాలు, సంరక్షక ఖాతాలు, విదేశాలలో మూలధన లాభం వచ్చే ఆస్తులు వంటివి ఈ లిస్ట్‌లో ఉన్నాయి.



కంప్లయన్స్-కమ్-అవేర్‌నెస్ క్యాంపెయిన్ కింద, 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఇప్పటికే ITR దాఖలు చేసిన భారతదేశ నివాసిత పన్ను చెల్లింపుదారులకు మొదట SMS & ఇ-మెయిల్‌ రూపంలో సమాచారం పంపుతామని CBDT తెలిపింది. విదేశీ ద్వైపాక్షిక, బహుపాక్షిక ఒప్పందాల కింద అందుకున్న సమాచారం ద్వారా గుర్తించిన పన్ను చెల్లింపుదారులకు ఈ కమ్యూనికేషన్‌ను పంపుతారు.



విదేశీ ఆస్తులు, ఆదాయాల సమాచారాన్ని దాచడం నేరం
పైన చెప్పిన ప్రమాణాల పరిధిలోకి వచ్చే పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌లో విదేశీ ఆస్తులు (Foreign Assets - FA) లేదా ఫారిన్ సోర్స్ ఇన్‌కమ్ (Foreign Source Income - FSI) షెడ్యూల్‌ను తప్పనిసరిగా పూరించాలని ఆదాయ పన్ను విభాగం తెలిపింది. పన్ను పరిధిలోకి వచ్చే పరిమితి కంటే తక్కువ విదేశీ ఆదాయం ఉన్నప్పటికీ ఆ వివరాలను వెల్లడించాల్సిందే. ఐటీఆర్‌లో విదేశీ ఆస్తులు/ఆదాయాన్ని వెల్లడించకపోతే, "బ్లాక్ మనీ అండ్ ట్యాక్స్ ఇంపోజిషన్ యాక్ట్ 2015" కింద రూ. 10 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.


మరో ఆసక్తికర కథనం: టీటీఈతో మాట్లాడి టికెట్ లేకుండా రైలు ఎక్కితే జరిమానా ఉండదా?