Indian Railways Rules: భారతీయ రైల్వేలను దేశానికి లైఫ్ లైన్ అంటారు. భారతదేశంలో ప్రతిరోజు కోట్ల మంది ప్రజలు వందలాది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఎక్కువ దూరం ప్రయాణించవలసి వచ్చినప్పుడు, చాలా మంది ప్రజలు ట్రైన్ జర్నీని ఇష్టపడతారు. రైలులో ప్రయాణించడం హాబీగా ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. ప్రతిరోజూ కోట్ల మంది రైళ్లు ఎక్కి దిగుతుంటారు కాబట్టి, తోటి ప్రయాణీకులకు & రైల్వేకు ఇబ్బందులు/ నష్టం వంటి కలగకుండా ఉండేందుకు భారతీయ రైల్వే కొన్ని నియమాలను ఏర్పాటు చేసింది. ఈ నియమాల్లో ఒకటి "తప్పనిసరిగా టిక్కెట్ కొనుగోలు".
రైళ్లలో పెళ్లిళ్ల సీజన్ రద్దీ
టికెట్ లేకుండా ఏ రైలులోనూ ఎవరూ ప్రయాణించలేరు. ప్రస్తుతం, భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ (Wedding season 2024) ప్రారంభమైంది. మరికొన్నాళ్ల పాటు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో సహజంగానే రైలు ప్రయాణాలు, రైళ్లలో రద్దీ, టిక్కెట్లకు డిమాండ్ పెరిగాయి. ప్రయాణ తేదీ దగ్గర పడుతున్నా చాలా మంది ప్రజలకు టిక్కెట్లు కన్ఫర్మ్ కావడం లేదు. ఈ నేపథ్యంలో, కొంతమంది టిక్కెట్టు కొనుక్కోకుండా, స్టేషన్‌లో ఉన్న TTE (Travelling Ticket Examiner)తో మాట్లాడి రైలు ఎక్కుతుంటారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు.. టిక్కెట్ కోసం అనవసరంగా హైరానా పడ్డాం, టీటీఈతో మాట్లాడి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోయేది కదా అని మనకు కూడా అనిపిస్తుంది. అయితే... స్టేషన్‌లో ఉన్న టీటీఈతో మాట్లాడితే, టిక్కెట్ కొనకుండానే రైలు ఎక్కొచ్చా, ఈ విషయంలో రైల్వే నిబంధనలు ఏం చెబుతున్నాయి?.
టీటీఈతో మాట్లాడి టికెట్ లేకుండా ప్రయాణిస్తే...
అనుకోకుండా ప్రయాణాలు చేసేవాళ్లు, క్యూ లైన్‌లో నిలబడి టిక్కెట్ తీసుకునేంత సమయం లేని వాళ్లు లేదా బద్ధకించే వాళ్లు టికెట్ కొనకుండానే రైలు ఎక్కుతుంటారు. మన కళ్ల ముందే టీటీఈతో మాట్లాడి దర్జాగా రైలు ఎక్కి కూర్చుంటారు. రైల్వే రూల్ ప్రకారం అలాంటి ప్రయాణీకులకు జరిమానా కట్టాలి. టీటీఈతో మాట్లాడినప్పటికీ టిక్కెట్టు కొనుక్కోకుండా రైలులో ప్రయాణిస్తున్నారు కాబట్టి, టిక్కెట్ ధరతో పాటు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. రైల్వే చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం. టీటీఈతో మాట్లాడినప్పటికీ, ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రదేశం నుంచి రైలు గమ్యస్థానం వరకు పూర్తి ఛార్జీని చెల్లించాలి. దీనికి అదనంగా జరిమానా కోసం రూ. 250 కట్టాలి.
సీటు సంపాదించొచ్చు
టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేసే సమయంలో టీటీఈకి టిక్కెట్ ధర + జరిమానా కట్టిన తర్వాత మీరు మీ ప్రయాణాన్ని ఎలాంటి టెన్షన్ లేకుండా కొనసాగించవచ్చు. దీంతో పాటు, రైలులో ఎక్కడైనా సీటు ఖాళీగా ఉంటే, టీటీఈ మీకు ఆ సీటు కేటాయించవచ్చు. ఒకవేళ టీటీఈ మీకు సీటు ఇవ్వకపోతే, సీటు గురించి అతనిని అడగవచ్చు.
మరో ఆసక్తికర కథనం: డాలర్‌తో రూపాయి మారకం విలువ అంటే ఏంటి, విలువను ఎలా నిర్ణయిస్తారు?