Health Insurance Ombudsman: వాన రాకడ - ప్రాణం పోకడ గురించే కాదు, అనారోగ్యం రాకడ - ఆసుపత్రి బిల్లుల ఆగడాల గురించి కూడా ఎవరూ ఊహించలేరు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా హఠాత్తుగా కుప్పకూలుతున్న సంఘటనలు మనం అప్పుడప్పుడు చూస్తున్నాం. వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిన ప్రస్తుత కాలంలో, ఆర్థిక కష్టాల నుంచి కాపాడే రక్షణ కవచంలా ఆరోగ్య బీమా పని చేస్తుంది. మార్కెట్‌లో చాలా కంపెనీలు ఆరోగ్య బీమా పథకాలను అమ్ముతున్నాయి. ఆరోగ్య బీమా పథకాన్ని మీకు విక్రయిస్తున్నప్పుడు, ఆ కంపెనీలు (కంపెనీ ఏజెంట్‌లు) మీకు పెద్ద వాగ్దానాలు చేస్తాయి. మీరు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తే అండగా మేం ఉంటాం అంటూ హామీలు గుప్పిస్తాయి. నియమాలు & నిబంధనల పేరిట పెద్ద పుస్తకం సైజ్‌లో ఉన్న డాక్యుమెంట్స్ మీద సంతకాలు తీసుకుంటాయి. చివరకు, ఇన్సూరెన్స్ డబ్బు కోసం క్లెయిమ్ చేస్తే తిరస్కరిస్తాయి. డబ్బు సెటిల్ చేయడానికి చాలా కొర్రీలు పెడుతుంటాయి. అసలే అనారోగ్యంతో బాధ పడుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితి కూడా ఎదురైతే, ఆ పాలసీహోల్డర్ విసిగి, నిరాశలో కూరుకుపోతాడు.
ప్రతి పాలసీ హోల్డర్ ఒక విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. బీమా కంపెనీ చెప్పిందే తుది తీర్పు కాదు. దాని కంటే పైవాడు ఉన్నాడు. మీ క్లెయిమ్‌ను బీమా కంపెనీ తిరస్కరిస్తే అంబుడ్స్‌మన్‌కు అంటే లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేయవచ్చు. అక్కడ మీకు న్యాయం జరిగే అవకాశం ఉంది.
50 శాతం బీమా క్లెయిమ్‌లు పూర్తిగా లేదా పెద్ద మొత్తంలో తిరస్కరణ
లోకల్ సర్కిల్ అనే వెబ్‌సైట్ ఇటీవలి రిపోర్ట్ ప్రకారం, 50 శాతానికి పైగా ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను కంపెనీలు పూర్తిగా లేదా మొత్తం అమౌంట్ ఇవ్వకుండా తిరస్కరించబడ్డాయి. ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో 95 శాతం బీమా క్లెయిమ్‌ల పూర్తి తిరస్కరణ లేదా తక్కువ చెల్లింపునకు సంబంధించినవి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ వార్షిక నివేదిక నుంచి ఇది వెలుగులోకి వచ్చింది. 2024 నవంబర్ నుంచి, ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల అధిక స్థాయి తిరస్కరణ వార్తల్లో హెడ్‌లైన్స్‌గా మారింది. మీ ఆరోగ్య బీమా క్లెయిమ్‌ను కంపెనీ అర్ధం చేసుకోకుండా లేదా తప్పు అర్ధం చేసుకుని తిరస్కరించిందని మీరు భావిస్తే, రిజల్యూషన్ కోసం ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్‌ని సంప్రదించవచ్చు. 'ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా', ఇటీవల జనరల్, హెల్త్ & లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ ట్రాక్‌కు సంబంధించిన డేటాను విడుదల చేసింది.
క్లెయిమ్ తిరస్కరణకు ఛార్జీలే అతి పెద్ద సాకు
పాలసీహోల్డర్ పెట్టుకున్న క్లెయిమ్ అప్లికేషన్‌ను తిరస్కరించడానికి ఆరోగ్య బీమా కంపెనీలు కొన్ని కారణాలను ఎత్తి చూపుతుంటాయి. వాటిలో అతి పెద్ద సాకు.. అసమంజసమైన ఆసుపత్రి ఛార్జీలు. హాస్పిటల్ బిల్లులు చాలా ఎక్కువగా ఉన్నాయన్న కారణంతో క్లెయిమ్‌లను రిజెక్ట్ చేస్తున్నాయి.
బీమా కంపెనీలు, తమ నియమ, నిబంధనల్లో ప్రతి విషయాన్ని స్పష్టంగా రాయాలని, తద్వారా కస్టమర్ మోసపోకుండా చూడాలని బీమా అంబుడ్స్‌మన్ వార్షిక నివేదికలో నివేదించారు.
మరో ఆసక్తికర కథనం: స్టాక్ మార్కెట్లలో HMPV కేస్ భయం - సెన్సెక్స్ 1200, నిఫ్టీ 400 పాయింట్లు క్రాష్