SIP Mutual Funds Investment: క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక (SIP) అనేది మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడికి చాలా సులభమైన పద్ధతి. దీనిని ఎంచుకున్న పెట్టుబడిదారు బ్యాంక్ ఖాతా నుంచి ప్రతి నెలా నిర్ణీత మొత్తం డెబిట్ అవుతుంది. పెట్టుబడిదారులు SIPలో తక్కువ రిస్క్‌తో మెరుగైన రాబడి పొందుతారు కాబట్టి, ఇది భారతదేశంలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. 'అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా' (AMFI) గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మంత్లీ 'సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్' (SIP)లు 2024 డిసెంబర్‌లో రికార్డ్ స్థాయికి చేరాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులపై చిన్న పెట్టుబడిదారుల ఆసక్తికి ఇది నిదర్శనం.
డిసెంబర్‌లో సిప్‌లో ఇన్వెస్టర్ల సహకారం
2024 డిసెంబర్‌లో, సిప్ పెట్టుబడులు మొదటిసారిగా రూ.26,000 కోట్ల మార్కును దాటాయి, రూ.26,459 కోట్లకు చేరాయి. ఇది, నవంబర్ 2024లో రూ.25,320 కోట్లు. డిసెంబర్‌లో మ్యూచువల్ ఫండ్ (MF) ఫోలియోలు 22.50 కోట్లకు పెరిగాయి, ఇది నవంబర్ నెలలో 22.02 కోట్లుగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా కొన్ని భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఈక్విటీ మార్కెట్‌లను సవాలు చేస్తున్నప్పటికీ, డిసెంబర్ 2024లో నెలవారీ SIP కంట్రిబ్యూషన్‌లు సంవత్సరం ప్రాతిపదికన 50% పెరిగాయి.
ప్రతి నెలా రూ. 1,000, రూ. 2,000, రూ. 3,000 & రూ. 5,000 మంత్లీ SIP కాంట్రిబ్యూషన్‌తో రూ. 1 కోటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో చూద్దాం. సిప్ పెట్టుబడులపై 12% వార్షిక రాబడి, ప్రతి సంవత్సరం SIP ఇన్వెస్ట్‌మెంట్‌లో 10% పెరుగుదలపై ఈ గణన ఆధారపడి ఉంటుంది.
నెలవారీ రూ. 1,000 SIP
ప్రతి నెలా రూ.1,000 ఇన్వెస్ట్ చేసి, ఏటా 10 శాతం చొప్పున పెంచుకుంటూ (స్టెప్-అప్), ప్రతి సంవత్సరం 12 శాతం రాబడిని సాధించినట్లయితే, మీరు 31 సంవత్సరాలలో దాదాపు రూ. 1.02 కోట్లు జమ చేయవచ్చు.
నెలవారీ రూ. 2,000 SIP
సంవత్సరానికి 10% స్టెప్-అప్‌తో, నెలవారీ రూ. 2,000తో SIP స్టార్ట్ చేస్తే, ప్రతి సంవత్సరం 12% రాబడితో మీరు 27 సంవత్సరాలలో రూ. 1.15 కోట్ల వరకు సంపాదిస్తారు.
నెలవారీ రూ. 3,000 SIP
సంవత్సరానికి 10% చొప్పున పెంచుకుంటూ, నెలకు రూ. 3,000 SIPపై 12% వార్షిక రాబడి సాధిస్తే, మీరు 24 సంవత్సరాలలో రూ. 1.10 కోట్లకు చేరుకుంటారు. ఈ కాలంలో మీ పెట్టుబడి మొత్తం రూ. 31.86 లక్షలు & రిటర్న్ రూ. 78.61 లక్షలు.
నెలవారీ రూ. 5,000 SIP
మీరు ప్రతి నెలా రూ. 5,000 SIPను ఏటా 10% స్టెప్-అప్ చేస్తూ వెళితే, 12% వార్షిక రాబడితో 21 సంవత్సరాలలో రూ. 1.16 కోట్ల లక్ష్యాన్ని సాధిస్తారు. ఈ కాలంలో మీ మొత్తం పెట్టుబడి రూ. 38.4 లక్షలు & రాబడి దాదాపు రూ. 78 లక్షలు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఈ 3 బ్యాంకుల్లో కొత్త సంవత్సరం నుంచి FD రేట్లు మార్పు - మీకు మరింత ఎక్కువ రాబడి