Fixed Deposit Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పెట్టుబడిదారులకు ఒక గొప్ప పెట్టుబడి ఎంపిక. దీనిలో తక్కువ రిస్క్ ఉంటుంది, ముందుగా హామీ ఇచ్చిన రాబడి కచ్చితంగా వస్తుంది. అయితే, ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే పరిమిత రాబడులు, ఎఫ్‌డీ వడ్డీపై ఆదాయ పన్ను చెల్లించాల్సి రావడం, అత్యవసర సమయంలో ఎఫ్‌డీని బ్రేక్‌ చేస్తే విధించే జరిమానా, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి కారణాలతో ఎఫ్‌డీలపై ప్రజల ఆసక్తి కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. పెట్టుబడిదారులన ఆకర్షించి కొత్త డిపాజిట్లు రాబట్టుకోవడానికి, దేశంలోని మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. రూ. 3 కోట్ల కంటే తక్కువ విలువైన ఎఫ్‌డీలకు కొత్త రేట్లు వర్తిస్తాయి. ఇవి, 01 జనవరి 2025 నుంచి అమలులోకి వచ్చాయి.


యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank Of India FD Interest Rates)
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI), రూ. 3 కోట్ల కంటే తక్కువ విలువైన FDలపై వడ్డీ రేట్లను జనవరి 01, 2025 నుంచి పెంచింది. ఇప్పుడు, బ్యాంక్‌ 7-45 రోజులకు 3.50 శాతం వడ్డీని; 6-90 రోజులకు 4.50 శాతం వడ్డీని అందిస్తోంది. ఇండియా 91-120 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 4.80 శాతం వడ్డీని; 121-180 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 5 శాతం వడ్డీ ఆదాయాన్ని ఆఫర్‌ చేస్తోంది.


181 రోజులు-1 సంవత్సరం మధ్య మెచ్యూర్ అయ్యే దేశీయ టర్మ్ డిపాజిట్లపై బ్యాంక్ 6.35 శాతం వడ్డీని ఇస్తుంది. 1 సంవత్సరం - 398 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.80 శాతం వడ్డీ చెల్లిస్తుంది. వడ్డీ రేట్లకు సంబంధించిన మరింత సమాచారం కోసం బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా మీ దగ్గరలోని బ్యాంక్‌ శాఖకు వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.


పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank FD Interest Rates)
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కూడా రూ. 3 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఈ మార్పు తర్వాత, ఇప్పుడు, బ్యాంకు 7-45 రోజుల కాల వ్యవధిపై 3.50 శాతం వడ్డీని; 46-90 రోజుల కాల వ్యవధిపై 4.50 శాతం వడ్డీని ఇస్తోంది. 91 నుంచి 179 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే FDలపై 5.50 శాతం వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తోంది. 180 నుంచి 270 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ ఆదాయం చెల్లిస్తుంది. 271 నుంచి 299 రోజులు & 300 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వరుసగా 6.50 & 7.05 శాతం వడ్డీ ఇస్తుంది. మరింత సమాచారం కోసం, బ్యాంక్‌ వెబ్‌సైట్‌ https://www.pnbindia.in/ ను లేదా మీకు సమీపంలోని బ్యాంక్‌ శాఖను సందర్శించవచ్చు.


పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్  (Punjab and Sindh Bank FD Interest Rates)
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (PSB), 01 జనవరి 2025 నుంచి, రూ. 3 కోట్ల కంటే తక్కువ FDలపై వడ్డీ రేట్లను మార్చింది. కొత్త రేట్ల ప్రకారం, బ్యాంక్ 555 రోజుల కాల వ్యవధి డిపాజిట్లపై 7.50 శాతం వరకు రిటర్న్‌ ఇస్తోంది. 180 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తోంది. సాధారణ పౌరుల కంటే సీనియర్ సిటిజన్లు 0.50 శాతం అదనపు వడ్డీ రేటు పొందుతారు. దీనికి సంబంధించిన సవివర సమాచారం బ్యాంకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. 


మరో ఆసక్తికర కథనం: రైళ్లలో పిల్లలు ఫ్రీగా జర్నీ చేయొచ్చు!, తొందరపడి టిక్కెట్‌ కొనకండి