ICICI Securities: 


దేశంలోనే అతిపెద్ద ఐదో స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌. త్వరలోనే స్టాక్‌ మార్కెట్‌ నుంచి డీలిస్టింగ్‌ అవ్వబోతోంది. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంకుకు పూర్తి స్థాయి సబ్సిడరీగా మారుతుందని కంపెనీ గురువారం ప్రకటించింది.


విలీనంలో భాగంగా 100 ఐసీఐసీఐ సెక్యూరిటీ షేర్లు కలిగివున్న ఇన్వెస్టర్లకు 67 ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు కేటాయిస్తామని వెల్లడించింది. డీలిస్టింగ్‌ ప్రక్రియను బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదించారని కంపెనీ తెలిపింది.


సెబీ ఆమోదం తర్వాత ఐసీఐసీఐ బ్యాంకు (ICICI Bank), ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ (ICICI Securities) విలీనానికి 12-15 నెలల సమయం పడుతుందని తెలిసింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ వ్యాపారం నిర్వహణకు తక్కువ పెట్టుబడి సరిపోతుంది. కాబట్టి ఐసీఐసీఐ బ్యాంకు అదనపు మూలధనం అవసరం లేదని సమాచారం. అంతర్గత ఆదాయమే సరిపోతుందని విశ్లేషకులు అంటున్నారు. దాంతో బ్యాంకు క్యాపిటల్‌ అడెక్వసీ రేషియోపై ప్రభావం ఉండదన్నారు.


ప్రస్తుతం స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. జెరోదా, గ్రో, అప్‌స్టాక్స్‌ వంటి కంపెనీలు డిస్కౌంట్‌ బ్రోకింగ్‌ సేవలను అందిస్తున్నాయి. అందుకే కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు 6.8 శాతం మార్కెట్‌ వాటా ఉన్న ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ డీలిస్ట్ అవుతోంది. 2023 మే నాటికి కంపెనీకి 21 లక్షల మంది క్లయింట్లు ఉన్నారు. బ్యాంకు, సెక్యూరిటీస్‌ సినర్జీ అవ్వడం ద్వారా కస్టమర్‌కు 360 డిగ్రీల్లో సేవలు అందించొచ్చని, దృష్టి సారించొచ్చని భావిస్తోంది. కొత్త వినియోగదారులను ఆకర్షించొచ్చని అనుకుంటోంది.


2023, జూన్‌ 23న నాటి ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ షేర్ల మార్కెట్‌ ధరలపై ప్రీమియాన్ని బట్టి షేర్ల కేటాయింపు నిష్పత్తిని రూపొందించారు. 2023, మార్చి 31 నాటికి ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లో ఐసీఐసీఐ బ్యాంకుకు 74.85 శాతం ఈక్విటీ షేర్లు ఉన్నాయి. మిగిలిన 25.15 శాతం ప్రజల వద్ద ఉన్నాయి. ఎంప్లాయి స్టాక్‌ ఆప్షన్స్‌ ఉన్న ఉద్యోగులకూ ఇదే రేషియోలో షేర్లను కేటాయిస్తారని తెలిసింది.


ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ 2018, మార్చిలో రూ.4000 కోట్లతో ఐపీవోకు వచ్చింది. ఒక్కో షేరును రూ.520కి కేటాయించింది. అయితే భారీ డిస్కౌంట్‌తో రూ.431 వద్దే షేర్లు లిస్టయ్యాయి. బుధవారం కంపెనీ షేర్లు 1.5 శాతం పెరిగి రూ.614 వద్ద ముగిశాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు రూ.837 వద్ద స్థిరపడ్డాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.