How To Spot Fake Requests: డిజిటల్ బ్యాంకింగ్ వచ్చిన తర్వాత ఆర్థిక లావాదేవీలు చాలా సౌకర్యవంతంగా మారాయి. దీంతోపాటే ఆన్‌లైన్ మోసాలు, ముఖ్యంగా OTP (One-Time Password) స్కామ్‌లు కూడా పెరిగాయి. స్కామర్లు, ఖాతాదారు నుంచి OTPని తెలుసుకోవడానికి వివిధ పన్నాగాలు ఉపయోగిస్తున్నారు. ఈ మోసాలను అర్థం చేసుకుంటేనే మీ డబ్బుకు రక్షణ ఉంటుంది.
బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే 4 లేదా 6 అంకెల సంఖ్యే OTP. దీని కాలపరిమితి సాధారణంగా 10 లేదా 15 నిమిషాలు ఉంటుంది. డబ్బు బదిలీ, ఆన్‌లైన్ షాపింగ్, బిల్లుల చెల్లింపులు వంటి లావాదేవీల సమయంలో OTP అవసరం అవుతుంది. భద్రతను పెంచడానికి రూపొందించిన రెండు అంచెల రక్షణ (two-factor authentication) ఇది. OTP రూపంలో అదనపు రక్షణ కవచం ఉన్నప్పటికీ, సైబర్ నేరస్థులు ప్రజలను మోసగించి OTPని తెలుసుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. వాళ్ల మోసాలకు అడ్డుకట్ట వేయడానికి మనం అప్రమత్తంగా ఉండడమే ఏకైక మార్గం.
OTP స్కామ్‌పై FAQs
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జనరల్ ఇన్సూరెన్స్, OTP స్కామ్‌లను ఎలా ఎదుర్కోవాలో వివరిస్తూ, 'తరచుగా అడిగే ప్రశ్నలు' (FAQs), చిట్కాలను విడుదల చేసింది.
ప్రశ్న: మోసపూరిత OTP రిక్వెస్ట్‌ను ఎలా గుర్తించాలి?
జవాబు: మీరు అడగకుండానే మీ ఫోన్‌కు ఏదైనా OTP వస్తే, బ్యాంక్ అధికారిక కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి విషయం తెలుసుకోండి. మోసపూరిత OTP రిక్వెస్ట్‌లో అసాధారణ శుభాకాంక్షలు, అక్షర దోషాలు లేదా వ్యాకరణ దోషాలు, అయాచిత అభ్యర్థనలు కనిపించవచ్చు. అలాంటి ఉంటే అది కచ్చితంగా మోసగాళ్ల పన్నాగమే అని గుర్తించండి.
ప్ర: ఎక్కువ లావాదేవీల కోసం ఒకే OTPని తిరిగి ఉపయోగించవచ్చా?
జ: లేదు, OTP ప్రతి లావాదేవీకి ప్రత్యేకం, దానిని మరొక లావాదేవీ కోసం ఉపయోగించలేము. సాధారణంగా, OTP గడువు 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు ఉంటుంది. ఆ గడువులోగా OTPని వాడకపోతే మరొక OTP కోసం రిక్వెస్ట్ చేయాలి.
ప్ర: ఊహించని OTP రిక్వెస్ట్ వస్తే నేను ఏమి చేయాలి?
జ: మీరు రిక్వెస్ట్ చేయకుండానే మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తే దానిని ఎవరికీ షేర్ చేయవద్దు. వెంటనే మీ బ్యాంకుకు ఈ విషయం తెలియజేయండి. అవసరమైతే OTP పంపిన నంబర్‌ను బ్లాక్ చేయండి.
ప్ర: OTP తెలుసుకోవడం ద్వారా స్కామర్లు నా ఖాతాను యాక్సెస్ చేయగలరా?
జ: పూర్తి ఖాతాను యాక్సెస్ చేయడానికి లేదా హ్యాక్ చేయడానికి OTP ఒక్కటే సరిపోదు. అయితే, ఇంతకుముందే దొంగిలించిన సమాచారంతో OTPని కలిపి మోసం చేయవచ్చు. కాబట్టి, అనుమానితులకు సున్నితమైన వివరాలు చెప్పకూడదు, మీకు తెలీని & అనుమానాస్పద లింక్‌లపై అస్సలు క్లిక్ చేయకూడదు.
తాయిలాలకు తలొగ్గొద్దు
బ్యాంక్ ఖాతాలోని సమస్యను పరిష్కరిస్తామనో, క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామనో, KYC అప్‌డేషన్ అనో లేదా మరో ప్రయోజనం పేరిటో స్కామర్లు మీ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని చెప్పమని అడుగుతారు. అలాంటి తాయిలాలకు తలొగ్గితే బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది. మీరు సొంతంగా ఏదైనా లావాదేవీని ప్రారంభించే వరకు, బ్యాంక్ లేదా చట్టబద్ధమైన సంస్థలు ఎప్పుడూ OTPని అడగవు.
మరో ఆసక్తికర కథనం: మార్చి నుంచి కొత్త ఫైనాన్షియల్ రూల్స్- తెలుసుకోకపోతే నష్టపోతారు!