ITR Filing: ఆదాయ పన్ను రిటర్న్ ఫైలింగ్ ప్రారంభమైంది. 2023-24 మదింపు సంవత్సరంలో ఫైలింగ్‌ను ఆదాయపు పన్ను విభాగం ప్రారంభించింది. మీరు కూడా ఇన్‌కం టాక్స్‌ రిటర్న్ దాఖలు చేయడానికి (Income Tax Return Filing) సిద్ధమవుతున్నట్లయితే, లెక్కలు తేడాగా ఉన్నాయని ఆదాయ పన్ను విభాగం నుంచి మీకు నోటీసు రాకుండా ఉండాలంటే, ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే ముందే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


ITR నింపడం ఇప్పుడు సులభం
ఆదాయ పన్ను విభాగం ప్రతి పన్ను చెల్లింపుదారు కోసం AIS (Annual Information Statement), TIS ‍‌(Taxpayer Information Summary) అనే రెండు డాక్యుమెంట్లను సృష్టించి, యాక్సెస్‌ చేయడానికి అనుమతి ఇస్తుంది. ఈ రెండు చాలా ముఖ్యమైన పత్రాలు. ITR ఫైలింగ్‌లో పారదర్శకత తీసుకురావడానికి, పన్ను చెల్లింపుదార్లు సొంతంగా ఫైలింగ్‌ చేసుకునేలా ప్రక్రియను సులభంగా ఉంచడానికి  ఐటీ డిపార్ట్‌మెంట్ ఈ రెండింటినీ ప్రవేశపెట్టింది. ఈ రెండు డాక్యుమెంట్ల సాయంతో, మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను సులభంగా పూరించవచ్చు. దీని కోసం మీకు CA (Chartered Accountant) అవసరం లేదు.


AIS & TIS అంటే ఏంటి?
ముందుగా, AIS & TIS అంటే ఏమిటో తెలుసుకుందాం. AIS అంటే వార్షిక సమాచార ప్రకటన. TIS అంటే పన్ను చెల్లింపుదారు సమాచార సారాంశం. ఒక పన్ను చెల్లింపుదారు ఒక ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన మొత్తం ఆదాయ వివరాలు AIS, TISలో కనిపిస్తాయి. మీరు సేవింగ్స్ ఖాతా (Saving Account Interest Income) లేదా రికరింగ్, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలపై ఆదాయం, సెక్యూరిటీల లావాదేవీలు, డివిడెండ్ డబ్బు (Income From Dividend), మ్యూచువల్ ఫండ్ నుంచి ఆదాయం రూపంలో డబ్బు సంపాదించారనుకోండి. ఆ వివరాలన్నీ ఈ డాక్యుమెంట్‌లలో ఉంటాయి. ఒకవేళ మీరు ఏదైనా ఆదాయాన్ని మర్చిపోయినా, ఈ రెండు డాక్యుమెంట్లు మీకు గుర్తు చేస్తాయి.


AIS & TISలో మొత్తం సమాచారం
సరళంగా చెప్పాలంటే, పన్ను చెల్లింపుదార్లు పన్ను విధించదగిన మొత్తం ఆదాయానికి సంబంధించిన సమాచారాన్ని AIS ద్వారా పొందుతారు. AISలో, ఆదాయపు పన్ను చట్టం 1961 కింద పేర్కొన్న జీతం కాకుండా ఇతర మూలాల నుంచి వచ్చిన ప్రతి ఆదాయ వివరాలు ఆటోమేటిక్‌గా యాడ్‌ అవుతాయి. దీని అర్థం, పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి ఆదాయం గురించిన సమాచారం ఇందులో అందుబాటులో ఉంటుంది. AIS సారాంశం TISలో ఉంటుంది.


AIS/TIS ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Download AIS/TIS) 


ఆదాయ పన్ను ఫైలింగ్ పోర్టల్ (www.incometax.gov.in) ఓపెన్‌ చేయండి.
పాన్ నంబర్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వండి.
అప్పర్‌ మెనులో సర్వీసెస్‌ ట్యాబ్‌కు వెళ్లండి.
డ్రాప్‌డౌన్ నుండి 'Annual Information Statement (AIS)' ఎంచుకోండి.
ప్రొసీడ్ పై క్లిక్ చేయగానే ప్రత్యేక విండో ఓపెన్ అవుతుంది.
కొత్త విండోలో AIS ఆప్షన్‌ ఎంచుకోండి.
ఇప్పుడు మీరు AIS, TIS రెండింటినీ డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్‌ కనిపిస్తుంది.
మీరు AIS, TISను PDF లేదా JSON ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  


ఇది కూడా చదవండి: EMIల భారం నుంచి ఇకపై ఉపశమనం, మీ జేబులో డబ్బులు మిగలొచ్చు!