Personal Loans With Lowest Interest Rates: ప్రతి ఒక్కరి ఏదోక సమయంలో ఆర్థిక అవసరం ఏర్పడుతుంది. వ్యాపారం, ఇల్లు కట్టుకోవడం, చదువులు, వివాహం, విహార యాత్రలు, అనారోగ్య పరిస్థితి.. ఇలా ఏదోక సందర్భంలో డబ్బు కావలసి వస్తుంది. అవసరానికి సరిపడా సేవింగ్స్‌ మన దగ్గర లేకపోతే, బంధువులనో, స్నేహితులనో అప్పుగా అడుగుతాం. వారి దగ్గర కూడా దొరక్కపోతే లోన్‌ కోసం బ్యాంక్‌ వైపు చూస్తాం. 


బ్యాంక్‌ రుణాలు రెండు రకాలుగా దొరుకుతాయి. ఒకటి తాకట్టు రుణం, రెండోది తాకట్టు లేని రుణం. తాకట్టుగా బంగారం, భూమి, ఇల్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, సెక్యూరిటీలు వంటివి పెట్టి బ్యాంక్‌ నుంచి లోన్‌ తీసుకోవచ్చు. ఇవేమీ లేకపోతే పర్సనల్‌ లోన్‌ తీసుకోవచ్చు, దీనికి ఎలాంటి ఆస్తిని తనఖా పెట్టాల్సిన అవసరం ఉండదు. కాకపోతే, తాకట్టు రుణం కంటే తాకట్టు లేని రుణంపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. 


పర్సనల్‌ లోన్‌ మంజూరు కావడానికి ఎక్కువ సమయం పట్టదు. ప్రి-అప్రూవ్డ్‌ పర్సనల్‌ లోన్‌ ఆఫర్‌ మీకు ఉంటే, కేవలం 5 నిమిషాల్లో రుణం పొందొచ్చు. ఇలాంటి ఆఫర్‌ లేకపోతే, మీ ఆదాయానికి సంబంధించిన ప్రూఫ్‌ డాక్యుమెంట్లను బ్యాంక్‌కు సమర్పించాలి. ఇలాంటి సందర్భంలో లోన్‌ రావడానికి 2 రోజులు పట్టొచ్చు.


సాధారణంగా, వ్యక్తిగత రుణాల మీద బ్యాంక్‌లు ఎక్కువ వడ్డీని వసూలు చేస్తాయి. దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోర్, బ్యాంక్‌తో అనుబంధం, ఎక్కడ పని చేస్తున్నారు, నెలకు ఎంత ఆదాయం సంపాదిస్తున్నారు, నెలకు ఎంత మిగులుతుంది వంటి కొన్ని అంశాలపై ఆధారపడి.. లోన్‌ మొత్తం, వడ్డీ రేటును బ్యాంక్‌లు నిర్ణయిస్తాయి.


వ్యక్తిగత రుణాలపై అతి తక్కువ వడ్డీ వసూలు చేస్తున్న బ్యాంక్‌లు (Lowest interest rates for personal loans):


ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank): సంవత్సరానికి 10.65% నుంచి 16% వరకు వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ ఛార్జీలు 2.50% + GST కూడా ఉంటుంది.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank): ఏడాదికి 10.5% నుంచి 24% వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ ఛార్జీలు ₹4,999 + GST కట్టాలి.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): 12.30% నుంచి 14.30% వసూలు చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు అయితే 11.30% నుంచి 13.80% వరకు; రక్షణ శాఖ ఉద్యోగులకు 11.15% నుంచి 12.65% వరకు తీసుకుంటోంది.


బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB): బ్యాంకుతో సంబంధం ఉన్న ప్రైవేట్ రంగ ఉద్యోగులకు 13.15% నుంచి 16.75% వరకు; ప్రభుత్వ రంగ ఉద్యోగులకు 12.40% నుంచి 16.75% రేటుతో పర్సనల్‌ లోన్‌ ఇస్తోంది. బ్యాంకుతో ఎలాంటి సంబంధం లేని ప్రైవేట్ రంగ ఉద్యోగులకు 15.15% నుంచి 18.75% రేట్‌ పెడుతోంది.


పంజాబ్ నేషనల్ బ్యాంక్ ‍‌(PNB): క్రెడిట్ స్కోర్‌పై ఆధారంగా ఏడాదికి 13.75% నుంచి 17.25% వరకు వడ్డీని వసూలు చేస్తోంది. ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల నుంచి 12.75% నుంచి 15.25% మధ్య తీసుకుంటోంది.


కోటక్ మహీంద్ర బ్యాంక్ ‍‌(Kotak Mahindra Bank): సంవత్సరానికి కనిష్టంగా 10.99% వసూలు చేస్తోంది. లోన్ ప్రాసెసింగ్ ఛార్జీ లోన్ మొత్తంలో 3% + GST కూడా ఉంటుంది.


యాక్సిస్ బ్యాంక్ (Axis Bank): పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వారి నుంచి 10.65% నుంచి 22% వరకు వడ్డీ రేటును యాక్సిస్ బ్యాంక్ వసూలు చేస్తోంది.


ఇండస్‌ఇండ్ బ్యాంక్ (IndusInd Bank): ఈ బ్యాంక్‌లో పర్సనల్‌ లోన్‌ రేట్‌ 10.49% నుంచి ప్రారంభమవుతుంది. ప్రాసెసింగ్ ఛార్జీలు 3% వరకు ఉంటాయి. లోన్ మొత్తం ₹30,000 నుంచి ₹50 లక్షల మధ్య ఇస్తుంది.


కరూర్ వైశ్య బ్యాంక్ (Karur Vsya Bank): పర్సనల్‌ లోన్‌ మీద ఏడాదికి 13% వడ్డీ రేటును వసూలు చేస్తోంది.


యెస్ బ్యాంక్ (Yes Bank): యెస్ బ్యాంక్‌లో పర్సనల్‌ లోన్‌ రేటు 10.49% నుంచి ప్రారంభమవుతుంది. 72 నెలల (6 సంవత్సరాల) కాలానికి లోన్‌ తీసుకోవచ్చు. ₹50 లక్షల వరకు లోన్‌ మంజూరు చేస్తుంది.


మరో ఆసక్తికర కథనం: మీ పాప భవిష్యత్‌ కోసం 10 ఉత్తమ పెట్టుబడి మార్గాలు, మీ ప్రేమను ఈ రూపంలో చూపండి