PAN-Aadhaar Details For Gold Purchases: నేరుగా డబ్బు ఇచ్చి బంగారం కొంటుంటే, దానికి సంబంధించిన నియమాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే గాలికి పోయే కంపను ఒంటికి తగిలించుకున్నట్లు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం బంగారం & రత్నాభరణాలను మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) [Money Laundering Act] కిందకు తీసుకువచ్చింది, క్యాష్ రూపంలో పసిడి కొనుగోళ్లకు ముకుతాడు వేసింది. ఈ చట్టం ప్రకారం, బంగారం & రత్నాభరణాలను కొనేవాళ్లు, అమ్మేవాళ్లు ఇద్దరూ రూల్స్ పాటించాలి. ముఖ్యంగా, బంగారం షాపుల్లో నిర్దిష్ట పరిమితికి మించి నగదు తీసుకోకూడదు. రూ. 10 లక్షలు లేదా అంతకు మించిన లావాదేవీలను కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలి.
ఆదాయ పన్ను చట్టం (Income Tax Act) కూడా నగదు లావాదేవీలను ఓ కంట కనిపెడుతోంది. ఈ చట్టం ప్రకారం, పరిమితిని మించి నగదు ఉపసంహరణపై TDS వర్తిస్తుంది, ఒక రోజులో గరిష్ట నగదు లావాదేవీలపైనా పరిమితులు ఉన్నాయి.
ఆదాయ పన్ను చట్టం ప్రకారం నగదు లావాదేవీల గరిష్ట పరిమితి ఎంత?
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ST ప్రకారం, ఒక వ్యక్తి నగదు రూపంలో చేసే చెల్లింపులు లేదా ఒక ఈవెంట్‌కు సంబంధించిన నగదు చెల్లింపులు ఒక రోజులో రూ. 2 లక్షలకు మించకూడదు. ఈ సెక్షన్ ప్రకారం, ఒక రోజులో రూ. 2 లక్షల కంటే ఎక్కువ డబ్బుతో ఆభరణాలు కొనుగోలు చేస్తే ఆదాయ పన్ను చట్టాన్ని ఉల్లంఘించినట్లే. రూ.2 లక్షలు దాటిన నగదును తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ రూపంలోనే చెల్లించాలి. లేకపోతే, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 271D ప్రకారం, నగదు రూపంలో లావాదేవీ జరిపిన మొత్తానికి సమానమైన జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఈ జరిమానా రిసీవర్ లేదా నగల వ్యాపారిపై పడుతుంది. కాబట్టి, నగదు రూపంలో రూ.2 లక్షలకు మించి తీసుకోవడానికి నగల వ్యాపారులు జంకుతున్నారు.
బంగారం కొనుగోళ్లకు పాన్, ఆధార్ అవసరమా?
ఆదాయ పన్ను నిబంధనల్లోని రూల్ 114B ప్రకారం, రూ. 2 లక్షలు లేదా అంతకుమించి విలువైన బంగారం కొనుగోళ్లకు పాన్ వివరాలను అందించడం తప్పనిసరి. మనీలాండరింగ్ చట్టం ప్రకారం, నిర్దిష్ట పరిమితి దాటిన లావాదేవీలపై కస్టమర్ నుంచి పాన్ లేదా ఆధార్ తీసుకోవాలి. రూల్స్ కఠినంగా ఉండడంతో, సేఫ్ సైడ్‌లో ఉండడానికి కొంతమంది నగల వ్యాపారస్తులు సొంత రూల్స్ పెట్టుకున్నారు. రూ. 1 లక్ష దాటిన లావాదేవీలకు సైతం పాన్, ఆధార్ వివరాలు అడుగుతున్నారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం రూల్స్ ప్రకారం, KYC రూల్స్ పాటించిన వ్యక్తి ఎంత విలువైన ఆభరణాలనైనా కొనొచ్చు. రూ. 2 లక్షల లోపు లావాదేవీలకు (నగదు రూపంలోనైనా లేదా ఎలక్ట్రానిక్ రూపంలోనైనా) KYC పాటించాల్సిన అవసరం లేదు. అంటే, పాన్ లేదా ఆధార్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
మరో ఆసక్తికర కథనం: మళ్లీ కంగారు పెడుతున్న పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి