EMI On Rs 50 lakhs Home Loan: మన దేశంలో ఇల్లు కొనడానికి లేదా కట్టుకోవడానికి ఎక్కువ మంది గృహ రుణం మీద ఆధారపడతారు. సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకునే ప్రజలకు హోమ్ లోన్ ఒక సాధారణ విషయంగా మారింది. కొంతమంది వద్ద ఇల్లు కొనడం లేదా కట్టుకోవడానికి సరిపడా డబ్బు ఉన్నప్పటికీ, EMI రూపంలో రుణం చెల్లించేందుకు సులభమైన & సౌలభ్యవంతమైన ఆప్షన్ ఉండడంతో, డబ్బు ఉన్న వ్యక్తులు కూడా హోమ్ లోన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆదాయ పన్ను భారం నుంచి తప్పించుకోవడానికి ఇంకొందరు హోమ్ లోన్ తీసుకుంటున్నారు.
మీరు రూ. 50 లక్షల గృహ రుణం తీసుకోవాలనుకుంటే, మీ ఇంటి బడ్జెట్‌ను సక్రమంగా నిర్వహించుకోవడానికి వీలుగా, ప్రతి నెలా ఎంత EMI (Equated Monthly Installment) చెల్లించాల్సి ఉంటుందో ముందుగానే తెలుసుకోవాలి. వివిధ వడ్డీ రేట్లు & వివిధ రుణ కాల పరిమితి ఆప్షన్ల వద్ద EMI మొత్తం ఎంత మారుతుందో అర్ధం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.
గృహ రుణం - ముఖ్యమైన విషయాలు
గృహ రుణాన్ని బ్యాంక్‌లు సురక్షిత రుణం (Secured Loan)గా పరిగణిస్తాయి. దీనిలో, మీరు నిర్ణీత కాలంలో తిరిగి చెల్లించేలా రుణం పొందుతారు. ఆ రుణం+వడ్డీని ప్రతి నెలా సమాన మొత్తంలో EMI రూపంలో తిరిగి చెల్లించాలి. గృహ రుణ EMI గణన ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అసలు (P), వడ్డీ రేటు (R), రుణ కాల పరిమితి (N).
హోమ్ లోన్ EMI మొత్తాన్ని ఎలా నిర్ణయిస్తారు?
EMI లెక్కించడానికి సూత్రం: EMI = [P x R x (1+R)^N] / [(1+R)^N-1]
ఈ సూత్రంలో... P = అసలు మొత్తం (50 లక్షలు); R = నెలవారీ వడ్డీ రేటు (వార్షిక వడ్డీ రేటును 12తో భాగించాలి); N = నెలల్లో రుణ కాల పరిమితి (సంవత్సరాల సంఖ్యను 12తో గుణించాలి)
వడ్డీ రేటు & రుణ కాలపరిమితి
భారతదేశంలో గృహ రుణ వడ్డీ రేట్లు ప్రస్తుతం 8.10 శాతం నుంచి ఉన్నాయి. కొన్ని బ్యాంక్‌లు దాదాపు 14 శాతం వరకు వసూలు చేస్తున్నాయి. రుణం కాల వ్యవధి 10 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది, 20 సంవత్సరాలు సర్వసాధారణం.
రూ. 50 లక్షల రుణానికి EMI లెక్కింపు:
వడ్డీ రేటు సంవత్సరానికి 9 శాతం & రుణ కాల పరిమితి 20 సంవత్సరాలు (240 నెలలు) అనుకుందాం.
ఇప్పుడు... అసలు మొత్తం (P) = రూ. 50,00,000; వార్షిక వడ్డీ రేటు = 9 శాతం & నెలవారీ వడ్డీ రేటు (R) = 9/12 = 0.75% లేదా 0.0075; రుణ కాల పరిమితి (N) = 20 సంవత్సరాలు x 12 = 240 నెలలు
EMI సూత్రం ప్రకారం...
EMI = [50,00,000 x 0.0075 x (1+0.0075)^240] / [(1+0.0075)^240-1]
దీని ప్రకారం, EMI నెలకు దాదాపు రూ. 44,986 వస్తుంది.
లోన్ కాల పరిమితిని 30 సంవత్సరాలకు పెంచితే, EMI నెలకు రూ. 38,046కి తగ్గుతుంది, కానీ చెల్లించాల్సిన మొత్తం వడ్డీ మొత్తం గణనీయంగా పెరుగుతుంది. అదే సమయంలో, రుణ కాలాన్ని 10 సంవత్సరాలకు తగ్గిస్తే, EMI నెలకు రూ. 63,336కి పెరుగుతుంది, కానీ చెల్లించాల్సిన వడ్డీ భారీగా తగ్గిపోతుంది.
ఒకవేళ.. వడ్డీ రేటు 8.50 శాతానికి తగ్గితే EMI నెలకు రూ. 43,391 (20 సంవత్సరాలకు) అవుతుంది. వడ్డీ రేటు 12 శాతానికి పెరిగితే (20 సంవత్సరాలకు) EMI నెలకు రూ. 55,043 కు పెరుగుతుంది.
వడ్డీ మొత్తం ఎంత?
20 సంవత్సరాల రుణంపై 9% వడ్డీ రేటు ప్రకారం, 20 సంవత్సరాలలో మొత్తం EMI = 44,986 x 240 = రూ. 1,07,96,640
ఇప్పుడు, మొత్తం వడ్డీ = 1,07,96,640 - 50,00,000 = రూ. 57,96,640
అంటే, మీరు 20 సంవత్సరాలకు రూ. 50 లక్షల రుణం తీసుకుంటే, మీ అసలు రుణ మొత్తానికి అదనంగా వడ్డీ రూపంలో రూ. 57,96,640 చెల్లించాలి.