Mistakes To Avoid In Emergency Fund: జీవితం ఎప్పుడూ మన ప్లానింగ్ ప్రకారం సాగదు. కానీ, ఆపద సమయాల్లో అత్యవసర నిధి (Emergency Fund) పెన్నిధి అవుతుంది. మీ డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడకు పోతోందో తెలుసుకోవడం ఆర్థిక భద్రతలో కీలకమైన భాగం. మీరు మీ ఆర్థిక పరిస్థితులను ఎంతగా బాగా అర్థం చేసుకుంటే, ఆకస్మిక ఆపదలను ఎదుర్కోవడానికి అంత సిద్ధంగా ఉంటారు. అత్యవసర నిధిని నిర్మించడం ఎంత ముఖ్యమో, తప్పులు చేయకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం.
తగినంత పొదుపు చేయకపోవడం
పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి అత్యవసర నిధి సరిపోవాలి. 6-9 నెలల ఖర్చులను భరించేలా ఫండ్‌ను నిర్మించడం తెలివైన వ్యక్తుల లక్షణం. ఇంటి అద్దె, బిల్లులు, EMIలు, ఆరోగ్య సంరక్షణ, పిల్లల ఫీజ్‌లు వంటి తప్పనిసరి ఖర్చులన్నింటినీ భరించేలా మీ ఫండ్ నిండుగా ఉండాలి. కాబట్టి, మంచి ఫండ్ నిర్మించడానికి మీ నెలవారీ ఖర్చులను సమీక్షించండి.
ద్రవ్యోల్బణం ప్రభావాన్ని విస్మరించడం
పెరుగుతున్న ధరలు మీ కొనుగోలు శక్తిని, పొదుపులను ప్రభావితం చేస్తాయి. 2015లో సరిపోయిన ఎమర్జెన్సీ ఫండ్ 2025లో సరిపోకపోవచ్చు. అందుకే, మీ ఫండ్‌ను కాలానుగుణంగా సమీక్షించడం, ధరలకు అనుగుణంగా సర్దుబాటు చేయడం చాలా ముఖ్యం.
ఖర్చు చేసిన తర్వాత తిరిగి జమ చేయకపోవడం
తింటూ కూర్చుంటే కొండలైనా కరుగుతాయి, అత్యవసర నిధి ఎంత?. డబ్బు ఉంది కదాని ఎమర్జెన్సీ ఫండ్ నుంచి తీస్తూ పోతే అది ఐస్‌లా కరిగిపోతుంది. డబ్బు తీసినప్పుడల్లా తిరిగి దానిని నింపుతుండాలి. ఖర్చు చేసిన దానికంటే ఎక్కువ మొత్తం జమ చేయాలి. తద్వారా, భవిష్యత్తులో ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు.
తప్పుడు పొదుపు మార్గాన్ని ఎంచుకోవడం
ఎమర్జెన్సీ ఫండ్ ముఖ్య లక్షణం ఏంటంటే, మీకు అవసరమైన తక్షణం చేతిలోకి డబ్బు రావాలి. ఇలా జరగనప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ నిర్మించడం ఎందుకు?. మీకు అవసమైన వెంటనే డబ్బు తీసుకునేలా - షేర్లు, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, అధిక వడ్డీ పొదుపు ఖాతాలు లేదా సౌకర్యవంతమైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి సాధనాల్లో డబ్బును ఇన్వెస్ట్ చేయాలి. భూములు, భవనాల వంటి వాటిలో అవి వెంటనే అమ్ముడుపోవు, మీ అవసరానికి డబ్బు పుట్టదు.
అత్యవసరం కాని వాటి కోసం ఉపయోగించడం
మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిత్యావసరాలకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సూత్రం ఎమర్జెన్సీ ఫండ్‌కు కూడా వర్తిస్తుంది. సినిమాలు, షికార్లు, సబ్‌స్క్రిప్షన్‌లు, గ్యాడ్జెట్స్ కొనడం వంటి వాటికి ఉపయోగిస్తే ఎమర్జెన్సీ ఫండ్ కరిగిపోతుంది. భవిష్యత్తులో అవసరమైనప్పుడు అందులోని డబ్బు సరిపోకపోవచ్చు. కాబట్టి, మీ ఫండ్‌ను దేని కోసం ఖర్చు చేయాలన్న విషయంలో మీరు తెలివిగా ఆలోచించాలి.
ఫండ్ అవసరం లేదని ఆలోచించడం
మీకు మంచి ఆదాయం వస్తుండవచ్చు, ఆర్థికంగా స్థిరపడి ఉండవచ్చు లేదా మీ పెట్టుబడులను బ్రహ్మాండంగా ప్లాన్ చేసి ఉండవచ్చు. కానీ, జీవితం ఊహించలేనిది. ఎంతటి వ్యక్తికైనా ఎదురుదెబ్బ తగలవచ్చు. అలాంటి ఎదురుదెబ్బ మీ వరకు రాకుండా ఎమర్జెన్సీ ఫండ్ లాంటి భద్రత వలయం అవసరం. సంక్షోభ సమయంలో అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకునే దుస్థితి నుంచి ఫండ్ మిమ్మల్ని కాపాడుతుంది.
ఎమర్జెన్సీ ఫండ్ మీకు, మీ కుటుంబానికి ఆర్థిక భద్రత ఇవ్వడంతో పాటు మీ కెరీర్‌కు కూడా వారధిగా నిలుస్తుంది, మీలో విశ్వాసం పెంచుతుంది.