Investment Options In Gold: ఇటీవలి కాలంలో బంగారం ధర భయంకరంగా పెరుగుతూ వస్తోంది. ఒక నెల రోజుల క్రితం గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు ఇప్పుడు భారీ లాభాలను కళ్లజూస్తున్నారు. ప్రస్తుతం, మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం (24 క్యారెట్లు) ధర ₹71,620 దగ్గర ఉంది. 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం (22 కేరెట్లు) ధర ₹65,650 పలికింది.
ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,361 డాలర్ల వద్ద ఉంది. యూఎస్ ఫెడ్ నిర్ణయాల ఆధారంగా విదేశీ మార్కెట్‌లో పుత్తడి రేటు ఇంకా పెరగొచ్చని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
పసిడిలో పెట్టుబడి పెట్టాలని మీరు ఆలోచిస్తుంటే, అందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఎక్కడికీ వెళ్లక్కర్లేకుండా ఇంట్లో కూర్చునే ఈ పని పూర్తి చేయొచ్చు.
బంగారంలో పెట్టుబడి మార్గాలు:
గోల్డ్ బాండ్స్
బంగారంలో పెట్టుబడికి.. సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) ఒక పాపులర్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రన్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వీటిని జారీ చేస్తుంది. కనిష్టంగా ఒక గ్రాము నుంచి గరిష్ఠంగా 4 కిలోల వరకు గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. ఒక బాండ్ ఒక గ్రాము బంగారానికి సమానం. సావరిన్ గోల్డ్ బాండ్ గ్రాము బంగారం ధరను RBI నిర్ణయిస్తుంది. ఏ బ్యాంక్ నుంచైనా సావరిన్ గోల్డ్ బాండ్లు కొనుగోలు చేయవచ్చు. వీటి మెచ్యూరిటీ పిరియడ్ 8 సంవత్సరాలు. పెట్టుబడి పెట్టిన నాటి నుంచి 5 సంవత్సరాల తర్వాత విత్‌డ్రా చేసుకోవచ్చు. రిడీమ్ చేసుకునే సమయంలో ఉన్న గోల్డ్ రేటు ప్రకారం డబ్బు చెల్లిస్తారు. దీనికి అదనంగా ఏడాదికి 2.50 శాతం వడ్డీ కూడా ఇస్తారు. ఈ బాండ్లను బ్యాంకులో తనఖా పెట్టి లోన్ కూడా తీసుకోవచ్చు. ఇవి డిజిటల్ ఫార్మాట్‌లో ఉంటాయి కాబట్టి దొంగల భయం ఉండదు.
డిజిటల్ గోల్డ్
ఇది వర్చువల్ గోల్డ్. ఆన్‌లైన్‌లో మీడియేటింగ్ కంపెనీ ద్వారా కొనుగోలు చేయాలి. మీరు డబ్బు కట్టిన ప్రతిసారీ, ఆ డబ్బుకు సమానమైన బంగారాన్ని మీడియేటింగ్ కంపెనీ కొని, మీ పేరిట తన వద్ద దాస్తుంది. కనిష్టంగా ఒక గ్రాము కూడా కొనుగోలు చేయొచ్చు. మీ బంగారం తిరిగి కావాలని అనుకున్నప్పుడు భౌతిక లోహం రూపంలో తిరిగి మీకు అప్పగిస్తుంది. ఇప్పుడు.. స్టాక్ బ్రోకింగ్ కంపెనీలతో పాటు పేటీఎం, ఫోన్‌పే వంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థల ద్వారా కూడా డిజిటల్ గోల్డ్ కొనవచ్చు.
గోల్డ్ ETFs
దీనిని గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లేదా గోల్డ్ ETFs గా పిలుస్తారు. ఇది కూడా ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే బంగారమే. ఎలక్ట్రానిక్ రూపంలో సులభంగా వీటిని కొనవచ్చు, అమ్మవచ్చు. స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా వీటిని ట్రేడ్ చేయొచ్చు. ETFs ద్వారా కొన్న పసిడి డీమ్యాట్ రూపంలో ఉంటుంది. కాబట్టి, బంగారం భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.
గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లోనూ దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టవచ్చు. దీని కోసం వివిధ మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు నుంచి వివిధ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు జమ చేసే డబ్బును గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ పేరుతో మ్యూచువల్ ఫండ్స్ ETFల్లో పెట్టుబడి పెడతాయి. మీకు డీమ్యాట్ అకౌంట్ లేకపోయినా వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: చుక్కలు దాటిన పసిడి, వెండి - నగలు ఇక కొనలేమా?