HDFC Bank FD Interest Rates: మన దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ రంగ లెండర్‌ అయిన HDFC బ్యాంక్, రూ.2 కోట్ల కంటే తక్కువ విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FDలు) వడ్డీ రేట్లను సవరించింది. ఈ బ్యాంక్‌, ఈ ఏడాది మే 29న 0.05% అధిక వడ్డీ రేటు బెనిఫిట్‌తో 35 నెలలు & 55 నెలల గడువుతో రెండు ప్రత్యేక ఎఫ్‌డీలను స్టార్ట్‌ చేసింది. ఈ నెల ప్రారంభం ‍(అక్టోబర్ 1, 2023‌) నుంచి ఆ రెండు స్కీమ్‌లను నిలిపివేసింది. దీనివల్ల, ఇప్పుడు ఆ రెండు టెన్యూర్స్‌పై 0.05% తక్కువ వడ్డీని కస్టమర్లు పొందుతారు.


HDFC బ్యాంక్ FD రేట్లు
7 నుంచి 29 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3% వడ్డీ రేటును హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చెల్లిస్తోంది. 30 - 45 రోజుల టెన్యూర్‌ కోసం 3.50% వడ్డీ ఆదాయాన్ని అందిస్తోంది. 46 రోజుల నుంచి 6 నెలల వరకు డిపాజిట్ కాలవ్యవధిపై 4.50%; 6 నెలల 1 రోజు నుంచి 9 నెలల కాలవ్యవధిపై 5.75% వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తోంది. 9 నెలల 1 రోజు నుంచి 1 సంవత్సరం వరకు మెచ్యూరిటీ గడువు ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటు 6.00%; 1 సంవత్సరం నుంచి 15 నెలల వరకు మెచ్యూరిటీ గడువు ఉన్న వాటికి 6.60% వడ్డీ రేటు లభిస్తుంది.


15 నెలల నుంచి 18 నెలల కాల పరిమితి FDలపై HDFC బ్యాంక్‌ 7.10% వడ్డీ రేటును ఇస్తోంది. 18 నెలల నుంచి 2 సంవత్సరాల 11 నెలల వరకు టైమ్‌ ఉండే FDలపై 7.00% వడ్డీ రేటును చెల్లిస్తోంది. 2 సంవత్సరాల 11 నెలల నుంచి 35 నెలల వరకు డిపాజిట్ వ్యవధిపై 7.15% వడ్డీ రేటును అందిస్తోంది. 2 సంవత్సరాల 11 నెలల 1 రోజు నుంచి 4 సంవత్సరాల 7 నెలల డిపాజిట్ కాలవ్యవధిపై వడ్డీ రేటు 7%గా ఉంది. 4 సంవత్సరాల 7 నెలల నుంచి 55 నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ 7.20%; 4 సంవత్సరాల 7 నెలల నుంచి 10 సంవత్సరాల్లో మెచ్యూర్ అయ్యే వాటికి 7% వడ్డీ లభిస్తుంది.


మీ ఆర్థిక లక్ష్యాలకు తగినట్లుగా ఒక మెచ్యూరిటీ రేంజ్‌ను ఎంచుకోవచ్చు, కేవలం రూ. 5,000తో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ అకౌంట్‌ స్టార్ట్‌ చేయవచ్చు. HDFC బ్యాంక్ అందించే ఆకర్షణీయమైన FD వడ్డీ రేట్ల ప్రయోజనంతో పాటు... స్వీప్-ఇన్ ఆప్షన్స్‌, ఓవర్‌డ్రాఫ్ట్ ఫీచర్స్‌ వంటి ఎక్స్‌ట్రా బెనిఫిట్స్‌ ఉంటాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై హామీ ఇచ్చిన రాబడిని పొందవచ్చు. 


HDFC బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో వడ్డీ చెల్లింపుల కోసం మూడు ఆప్షన్స్‌ ఉన్నాయి: నెలకు ఒకసారి, మూడు నెలలకు ఒకసారి (త్రైమాసికం), మెచ్యూరిటీ సమయంలో వడ్డీ చెల్లిస్తారు. చక్రవడ్డీ బెనిఫిట్‌ తీసుకోవాలంటే, HDFC బ్యాంక్‌లో రీ-ఇన్వెస్ట్‌మెంట్ FDని ఎంచుకోవచ్చు.


HDFC బ్యాంక్‌ సీనియర్ సిటిజన్ కేర్ FD
HDFC బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీని (HDFC Bank Senior Citizen Care FD) ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం డిజైన్‌ చేశారు. 7 రోజుల నుంచి 5 సంవత్సరాల కాలానికి రూ.5 కోట్ల కంటే తక్కువ విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను బుక్ చేసుకుంటే, సాధారణ ప్రజలకు ఇచ్చే రేట్ల కంటే 0.50% (అర శాతం) ఎక్కువ వడ్డీని పొందుతారు. 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధిపై సాధారణ రేట్ల కంటే 0.75% (ముప్పావు శాతం) అదనపు వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు.


ఎక్కువ వడ్డీ దక్కే టైమ్‌ పిరియడ్‌
వడ్డీ రేట్లలో రీసెంట్‌ రివిజన్‌ తర్వాత, సాధారణ ప్రజలకు 4 సంవత్సరాల 7 నెలలు - 55 నెలల కాలానికి గరిష్టంగా 7.20%; సీనియర్‌ సిటిజన్లకు 5 సంవత్సరాల 1 రోజు - 10 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి కోసం గరిష్టంగా 7.75% రాబడిని HDFC బ్యాంక్‌ అందిస్తోంది.