Interest Rate Hike: కేంద్ర సర్కారు శుభవార్త చెప్పింది! చిన్న మొత్తాల పొదుపు పథకం, పోస్టాఫీసు టర్మ్‌ డిపాజిట్లు, సీనియర్‌ సిటిజన్ల సేవింగ్స్‌ స్కీమ్‌ వడ్డీరేట్లను పెంచుతున్నామని ప్రకటించింది. జనవరి 1 నుంచి పెంచిన రేట్లు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లను పెంచకపోవడం గమనార్హం.


ప్రతి సంవత్సరం మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు, ఇతర పథకాల వడ్డీరేట్లను సమీక్షిస్తుంది. పరిస్థితులను బట్టి మార్పులు చేస్తుంది. ప్రస్తుతం వివిధ పెట్టుబడి సాధనాలపై 20 నుంచి 110 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీరేటు పెంచింది. దాంతో వడ్డీరేట్లు 4.0 నుంచి 7.6 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్ రాబడి ఆధారంగా ప్రభుత్వం వడ్డీరేట్లను సవరిస్తుంటుంది. 0-100 బేసిస్‌ పాయింట్ల మేర స్ప్రెడ్‌ కొనసాగిస్తుంది.


కేంద్ర ప్రభుత్వం వరుసగా రెండు త్రైమాసికాలు వడ్డీరేట్లను పెంచడం ప్రత్యేకం. తొమ్మిది త్రైమాసికాల తర్వాత తొలిసారి అక్టోబర్‌-డిసెంబర్‌ కాల వ్యవధికి  10-30 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీరేట్లను పెంచింది. ఈ మధ్యే మళ్లీ రెపోరేట్లను పెంచడంతో 2023 జనవరి- మార్చి క్వార్టర్‌కూ పెంచక తప్పలేదు.


ఏ పథకానికి ఎంత వడ్డీరేటు



  • సేవింగ్స్‌ డిపాజిట్ల వడ్డీరేటులో మార్పు లేదు. జనవరి-మార్చి త్రైమాసికంలో 4 శాతం వడ్డీయే లభిస్తుంది.

  • ఏడాది టైమ్‌ డిపాజిట్‌ వడ్డీరేటును 5.5 శాతం నుంచి 6.6 శాతానికి పెంచారు.

  • రెండేళ్ల టైమ్‌ డిపాజిట్‌ వడ్డీరేటును 5.7  శాతం నుంచి 6.8 శాతానికి పెంచారు.

  • మూడేళ్ల టైమ్ డిపాజిట్‌ వడ్డీరేటును 5.8 శాతం నుంచి 6.9 శాతానికి పెంచారు.

  • ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌ వడ్డీరేటును 6.7 శాతం నుంచి 7 శాతానికి పెంచారు.

  • ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిట్‌ వడ్డీరేటును 5.8 శాతంగానే ఉంచారు.

  • నెలవారీ ఆదాయం ఖాతా వడ్డీరేటును 6.7 శాతం నుంచి 7.1 శాతానికి పెంచారు.

  • నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ వడ్డీరేటును 6.8 శాతం నుంచి 7 శాతానికి  పెంచారు.

  • పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ను 7.1 శాతంగానే ఉంచారు.

  • 123 నెలల కిసాన్‌ వికాస్‌ పత్రాల వడ్డీరేటును 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంచారు.

  • సుకన్య సమృద్ధి యోజన వడ్డీరేటును 7.6 శాతంగానే ఉంచారు.


సోషల్ మీడియాలో ఏబీపీ దేశం ఫాలో అవ్వండి: