Gold Loan these 10 banks offering best interest rates: బ్యాంకు రుణాల్లో... బంగారం రుణాలపై వసూలు చేసే వడ్డీ తక్కువగా ఉంటుంది. డబ్బు అవసమైనప్పుడు బంగారంపై రుణం తీసుకోవడమే ఇతర రుణాల కంటే చౌకయిన, ఉత్తమమైన మార్గం.
రుణానికి త్వరగా ఆమోదం
చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు సులభంగా గోల్డ్ లోన్ ఇస్తాయి. మీరు తీసుకువెళ్లిన బంగారం పరిమాణం, స్వచ్ఛత ఆధారంగా బ్యాంకులు రుణం మంజూరు చేస్తాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా, బంగారం విలువలో 75% వరకు రుణంగా పొందవచ్చు. ఈ లోన్ ప్రత్యేకత ఏమిటంటే, గోల్డ్ లోన్ పొందడానికి ఆదాయ రుజువు అవసరం లేదు. ఇతర లోన్ల తరహాలో బ్యాంకర్లకు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన పని లేదు, సమాధానాలు చెప్పాల్సిన అవసరం అంతకంటే ఉండదు. మీ బంగారాన్ని తనఖా పెట్టుకుని రుణం ఇస్తాయి కాబట్టి, గోల్డ్ లోన్‌ను సురక్షిత రుణంగా బ్యాంకులు పరిగణిస్తాయి. కాబట్టే ఈ లోన్ మీద తక్కువ వడ్డీ రేటును వసూలు చేస్తాయి. వ్యక్తిగత రుణాలు, వ్యాపార రుణాలు, కార్పొరేట్ రుణాలు మొదలైన రిస్కీ లోన్ల మీద బ్యాంకులు 15 నుంచి 30 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తాయి. సగటున చూసుకుంటే, బంగారు రుణాల మీద 10 శాతం వరకు వడ్డీ రేటును వసూలు చేస్తాయి. వ్యవసాయ అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే ఇంకా తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇస్తాయి.
మీరు బంగారంపై రుణం తీసుకోబోతున్నట్లయితే, బంగారం రుణంపై తక్కువ వడ్డీని వసూలు చేసే 10 బ్యాంకుల సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారు రుణంపై అతి తక్కువ వడ్డీ:
HDFC బ్యాంక్, బంగారు రుణాలపై వడ్డీని 7.20 శాతం నుంచి 11.35 శాతం వరకు వసూలు చేస్తోంది, ప్రాసెసింగ్ ఫీజు 1 శాతం వరకు ఉంటుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ గోల్డ్ లోన్‌పై వడ్డీ 8% నుంచి 17% వరకు ఉంటుంది. 2% ప్రాసెసింగ్ ఫీజు + GSTతో కలిపి ఉంటుంది.
యూనియన్ బ్యాంక్ 8.40 శాతం నుంచి 9.65 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తోంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.45% నుంచి 8.55% వరకు వడ్డీ తీసుకుంటోంది. రుణ మొత్తంలో 0.5% ప్రాసెసింగ్ ఛార్జీ ఉంటుంది.
యూకో బ్యాంక్ 8.50 శాతం వడ్డీ తీసుకుంటోంది. ప్రాసెసింగ్ ఫీజు 250 నుంచి 5000 రూపాయల వరకు ఉంటుంది.
SBI గోల్డ్ లోన్‌పై వడ్డీ 8.55% గా ఉంది. ప్రాసెసింగ్ ఫీజ్ కింద 0.50% + GST.
ఇండస్‌ఇండ్ బ్యాంక్, గోల్డ్ లోన్‌పై 8.75% నుంచి 16% వరకు వడ్డీని వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ ఛార్జీ 1%.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ తీసుకుంటున్న వడ్డీ రేటు 8.85 శాతం. ప్రాసెసింగ్ ఛార్జీ రూ. 500 నుంచి రూ. 10,000 వరకు ఉంటుంది.
ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేటు 8.89 శాతం.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 9 శాతం వడ్డీని & 0.75 శాతం ప్రాసెసింగ్ ఛార్జీని వసూలు చేస్తోంది.
గోల్డ్ లోన్ ఎంతకాలానికి తీసుకోవచ్చు?
గోల్డ్ లోన్‌ను తిరిగి చెల్లించే వ్యవధి కస్టమర్ & బ్యాంకుపై ఆధారపడి ఉంటుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, బంగారంపై కనీసం రూ. 20,000 నుంచి గరిష్టంగా రూ. 1,50,00,000 వరకు రుణం పొందవచ్చు. రూ. 25 లక్షలకు పైబడిన లోన్ మొత్తానికి ITR అవసరం.