Gold Loan: డబ్బు అవసరం లేని మనిషి ఈ భూమ్మీద ఉండడు. కాకపోతే, 'ఎంత అవసరం' అన్నది పరిస్థితులను బట్టి మారుతుంది. ఒక్కోసారి అకస్మాత్తుగా డబ్బు అవసరం పడవచ్చు. మన చేతిలో డబ్బు, బ్యాంక్‌లో బ్యాలెన్స్‌ రెండూ లేక అల్లాడిపోతాం. అటువంటి పరిస్థితిలో, బయటి నుంచి రుణం తీసుకోవడమే ఏకైక మార్గం. ఈ సమయంలో, మీ ఇంట్లో ఉన్న బంగారమే మీకు అత్యంత ఉపయోగపడుతుంది. బంగారం మీద రుణాన్ని సులభంగా పొందవచ్చు. బంగారం మీద పెట్టుబడి చాలా ప్రయోజనకరం అని భారతదేశ ప్రజలు భావిస్తారు.


బ్యాంకింగ్‌ సదుపాయాలు సరిగా అందుబాటులో లేని సమయంలో, అకస్మాత్తుగా డబ్బు అవసరం వచ్చినప్పుడు, ప్రజలు తమ డబ్బు అవసరాలు తీర్చుకోవడానికి బంగారాన్ని అమ్మేవారు. బ్యాంకింగ్‌ వ్యవస్థ సామాన్యుడికి చేరువయ్యాక పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు బ్యాంకులు బంగారానికి బదులుగా రుణాలను సులభంగా ఇస్తున్నాయి. గోల్డ్ లోన్‌లో, బంగారాన్ని పూచీకత్తుగా పెట్టుకుని బ్యాంకులు అప్పులు ఇస్తాయన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ రకమైన రుణాన్ని పొందడంలో ఇబ్బందులు చాలా తక్కువగా ఉంటాయి.


రుణానికి త్వరగా ఆమోదం
చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు సులభంగా కొలేటరల్ లోన్ (తనఖా లోన్‌) ఇస్తాయి. మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా, మీ బంగారం విలువలో 75% వరకు రుణంగా పొందవచ్చు. ఈ లోన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, గోల్డ్‌ లోన్‌ పొందడానికి మీకు ఆదాయ రుజువు అవసరం లేదు. కేవలం బంగారం మాత్రం ఇస్తే చాలు, బ్యాంకులు వెంటనే రుణాన్ని మంజూరు చేస్తాయి. ఇతర లోన్ల తరహాలో బ్యాంకర్లకు ఎలాంటి పత్రాలు ఇవ్వాల్సిన పని లేదు, సమాధానాలు చెప్పాల్సిన అవసరం అంతకంటే ఉండదు.


వడ్డీ రేటు తక్కువ
బంగారం మీద ఇచ్చే రుణాన్ని సురక్షిత రుణంగా పరిగణిస్తారు. ఇవి సురక్షిత రుణాలు కాబట్టే బ్యాంకులు ఈ లోన్‌ మీద తక్కువ వడ్డీ రేటును వసూలు చేస్తాయి. వ్యక్తిగత రుణాలు, వ్యాపార రుణాలు, కార్పొరేట్ రుణాలు మొదలైన చాలా రిస్కీ లోన్ల మీద బ్యాంకులు 15 నుండి 30 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తాయి. కానీ, సాధారణంగా బంగారు రుణం మీద 7 నుంచి 10 శాతం వడ్డీ రేటును మాత్రం వసూలు చేస్తాయి. వ్యవసాయ అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్‌ తీసుకుంటే, ఇంకా తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇస్తాయి.


అధిక రుణ విలువ
వినియోగదారులు సాధారణంగా బంగారు రుణాల మీద గరిష్ట రుణ విలువను పొందుతారు. బ్యాంక్‌ వద్ద తనఖా పెట్టిన బంగారం విలువలో 75 శాతం వరకు సులభంగా పొందవచ్చు, ఇతర రుణాలతో పోల్చితే చాలా ఎక్కువ. దీంతో పాటు, ఈ లోన్‌ మీద సులభమైన రీ పేమెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా, మీరు మీ అవసరానికి అనుగుణంగా లోన్‌ రీ పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. బంగారం మీద రుణాన్ని ఏడాది కాలానికి బ్యాంకులు ఇస్తాయి. ఈ ఏడాదిలో మీరు అప్పు చెల్లించలేకపోతే, అదే లోన్‌ను పునరుద్ధరించునే వెసులుబాటు ఉంది.