ITR File: పన్ను చెల్లింపుదారులకు, ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ (Income Tax Return Filing) తప్పనిసరి. ఒకవేళ ఎవరైనా పన్ను పరిధిలోకి రాకపోయినా, సున్నా ఆదాయ పన్నుతో మీ ఆదాయాన్ని ప్రకటించడం చాలా మంచిది. దీనివల్ల లాభాలే గానీ, నష్టాలు ఉండవు.
ఇక.. పన్ను చెల్లించదగిన ఆదాయం ఉన్న వ్యక్తి ITR (ITR Filing Online) ఫైల్ చేయకపోతే, జరిమానా చెల్లించవలసి ఉంటుంది. జరిమానాతో పాటు ఒక్కోసారి కేసు విచారణలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది.
మీరు, ITR ఫైల్ చేయడానికి అవసరమైన పత్రాలను కలిగి ఉండడంతో పాటు, ప్రక్రియ గురించి పూర్తి అవగాహనతో ఉండడం కూడా అవసరం. అవసరమైన పత్రాలు, అవగాహన ఉంటే.. మీరు మీ ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో ITR ఫైల్ చేయవచ్చు.
ఆదాయపు పన్ను రిటర్న్‌లో... అసెసీ లేదా పన్ను చెల్లింపుదారు ఆదాయం, వ్యయం, పన్ను మినహాయింపు, పెట్టుబడి, పన్ను మొదలైన అంశాల గురించి సమాచారం ఇవ్వాలి. ఇందులో ఏదైనా పొరపాటు జరిగితే, మీకు ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసు రావచ్చు. ముందే చెప్పుకున్నట్లు.. పన్ను చెల్లించదగిన ఆదాయం లేకపోయినా, అనేక కారణాల వల్ల చాలా మంది ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేస్తారు. మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఎలా ఫైల్ చేయవచ్చో దశలవారీగా తెలుసుకోండి.
ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి సులభమైన మార్గం
మీరు ITR నింపబోతున్నట్లయితే... మొదట మీరు మీ ఆదాయం, దాని మీద పన్నును లెక్కించాలి, తద్వారా ప్రక్రియ సులభం అవుతుంది. అలాగే, పన్ను మినహాయింపు, TDSను (Tax Deducted at Source) కూడా గుర్తుంచుకోవాలి. ఫారమ్ 26AS కింద మీ TDS కనిపిస్తుంది. ఈ ప్రకారం... మీరు మీ ఆదాయం, డిడక్షన్‌ల గురించి సమాచారాన్ని పూరించాలి. ఇన్‌కంటాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లి, ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయాలి.
దశల వారీ ప్రక్రియ ఇది:
మీరు, మీ పన్ను ఆదాయం & TDSని లెక్కించిన తర్వాత, సరైన ఫామ్‌ను ఎంచుకోండి.
ఫామ్‌ను ఎంచుకున్న తర్వాత, రిటర్న్ ఫైల్ చేయడానికి అందుబాటులో ఉన్న 2 పద్ధతుల్లో ఒకదానిని ఎంచుకోండి. అవి.. ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్.
లాగిన్ అయిన తర్వాత, ఆన్‌లైన్ మోడ్ కోసం అందుబాటులో ఉన్న ITR 1, ITR 4ని ఎంచుకోవచ్చు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు అదర్ కేటగిరీని ఎంచుకోవాలి.
ఇప్పుడు www.incometax.gov.inకి వెళ్లి, ఎగువ మెనూ బార్ నుంచి 'డౌన్‌లోడ్' మీద క్లిక్ చేయండి. మీరు ITR యుటిలిటీని ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి.
ఇప్పుడు డౌన్‌లోడ్ చేసిన ఫైల్‌లో అన్ని వివరాలను పూరించండి.
నింపిన మొత్తం సమాచారాన్ని మరొకసారి చెక్ చేసుకుని సరిగ్గా ధృవీకరించుకోండి.
వివరాల ధ్రువీకరణ పూర్తయిన తర్వాత, మీరు 'XML' ఫార్మాట్‌లోకి దానిని మార్చాలి.
ఇప్పుడు ఆ XML ఫైల్‌ను అప్‌లోడ్ చేయాలి.
ఇవే వివరాలను మీరు ఆన్‌లైన్‌లో పూరించడం ద్వారా కూడా అప్‌లోడ్ చేయవచ్చు.
మొత్తం సమాచారాన్ని అప్‌లోడ్ చేసిన తర్వాత, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి.