General Provident Fund Interest Rate For June 2024: ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం, ఎన్నికల కోడ్‌ కారణంగా ఆగిపోయిన అంశాలపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా, జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌ (GPF) విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి (ఏప్రిల్‌-జూన్‌ కాలం) GPF వడ్డీ రేటును ప్రకటించింది. అయితే, ఈ యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశకు గురి చేసింది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది.


జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ మీద 7.10 శాతం వడ్డీ
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం... 'జీపీఎఫ్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 7.10 శాతం వడ్డీ పొందుతారు. 01 ఏప్రిల్ 2024 నుంచి 30 జూన్ 2024 వరకు, FY25 మొదటి త్రైమాసికంలో GPF సహా ఫండ్స్‌కు జమ చేసే విరాళాలపై 7.10 శాతం వడ్డీ లభిస్తుంది'.


దాదాపు మూడేళ్లుగా పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF) వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం మార్చలేదు. ప్రస్తుతం PPF వడ్డీ రేటు 7.10 శాతం వద్ద ఉంది. ఈ నేపథ్యంలో, 2024-25 తొలి త్రైమాసికానికి GPFపైనా వడ్డీ మారదని ముందు నుంచీ భావిస్తూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వం దానిని నిజం చేసింది.


ప్రభుత్వ విభాగాలను బట్టి, వివిధ రకాల ప్రావిడెంట్ ఫండ్స్ పథకాలు అమల్లో ఉన్నాయి. అవి... 
-- జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (సెంట్రల్ సర్వీసెస్)
-- కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ (ఇండియా)
-- ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రావిడెంట్ ఫండ్
-- స్టేట్ రైల్వే ప్రావిడెంట్ ఫండ్
-- జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (డిఫెన్స్ సర్వీసెస్)
-- ఇండియన్ ఆర్డినెన్స్ డిపార్ట్‌మెంట్ ప్రావిడెంట్ ఫండ్
-- ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ వర్క్‌మెన్స్ ప్రావిడెంట్ ఫండ్
-- ఇండియన్ నేవల్ డాక్‌యార్డ్ వర్క్‌మెన్స్ ప్రావిడెంట్ ఫండ్       
-- డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్స్ ప్రావిడెంట్ ఫండ్      
-- ఆర్మ్‌డ్ ఫోర్సెస్ పర్సనల్ ప్రావిడెంట్ ఫండ్        


ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి తన జీతంలో కొంత భాగాన్ని జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌లో జమ చేయవచ్చు. పదవీ విరమణ చేసినప్పుడు, అతని జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేసిన డబ్బును వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తారు. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను సమీక్షించినట్లే, ప్రతి త్రైమాసికంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది.


GPF - EPF మధ్య తేడా
జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. దీనిని EPFO నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుతం జీపీఎఫ్‌పై 7.10 శాతం వడ్డీ ఇస్తుండగా, 2023-24 మధ్యకాలం కోసం ఈపీఎఫ్‌పై 8.25 శాతం వడ్డీని ప్రకటించింది.


మరో ఆసక్తికర కథనం: ధనలక్ష్మిని మీ ఇంటికి తెచ్చే బెస్ట్‌ మ్యూచవల్‌ ఫండ్స్‌ ఇవి, ఈ నెల వరకే ఛాన్స్‌