UPI Will Stop Working On These Mobile Numbers: యూపీఐ (Unified Payments Interface) లేకపోతే రోజు గడవని రోజులు వచ్చేశాయి. యూపీఐ లేని దైనందిన జీవితాన్ని ఊహించుకోవడం కష్టమే. అయితే, కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి, అంటే ఏప్రిల్ 01, 2025 నుంచి కొన్ని ఫోన్‌ నంబర్లపై యూపీఐ సేవలు పని చేయవు. అంటే, ఆ ఫోన్‌ నంబర్‌ నుంచి డబ్బులు పంపడం లేదా స్వీకరించడం వీలుకాదు. 


ఈ నంబర్లలో యూపీఐ సేవలు రద్దు
నిష్క్రియంగా ఉన్న (Inactive Mobile Numbers) లేదా తిరిగి కేటాయింపు జరిగిన మొబైల్ నంబర్‌లలో (Reassigned Mobile Numbers) యూపీఐ సేవలు ఇకపై పని చేయవు. నిష్క్రియంగా ఉన్న లేదా తిరిగి కేటాయింపు జరిగిన నంబర్‌లు UPIకి లింక్ చేయకుండా చూడాలని బ్యాంకులు, PSPలను 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (NPCI) ఆదేశించింది. MNRL (Mobile Number Revocation List)ను ఉపయోగించి కనీసం వారానికి ఒకసారి మొబైల్ నంబర్ రికార్డులను అప్‌డేట్ చేయాలని సూచించింది. NPCI నిర్ణయం వల్ల మీరు ఇబ్బంది పడకూడదు అనుకుంటే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. UPI కోసం కనీసం అప్పుడప్పుడైనా ఆ నంబర్‌ను ఉపయోగించాలి.


ఎందుకు ఈ మార్పు?
UPIకి లింక్ చేసిన ఇన్‌యాక్టివ్‌ మొబైల్ నంబర్‌ల వల్ల భద్రత లోపిస్తుంది. సాధారణంగా, ప్రజలు తమ మొబైల్‌ నంబర్‌లను మార్చినప్పుడు లేదా పాత నంబర్‌ను ఉపయోగించకుండా వదిలేస్తుంటారు & కానీ ఆ నంబర్‌లు లింక్‌ చేసిన UPI ఖాతాలు యాక్టివ్‌గానే ఉంటాయి. అలాంటి నంబర్‌లు దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉంది. మీరు ఉపయోగించని మొబైల్ నంబర్‌ను సదరు టెలికాం కంపెనీ వేరే కొత్త వినియోగదారుకు కేటాయించినట్లయితే, UPI లావాదేవీలు ఆ నంబర్‌ ద్వారా జరుగుతాయి. అంటే, యూపీఐ లావాదేవీ డబ్బులు కొత్త వ్యక్తి ఖాతాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇలాంటి నంబర్‌ల వల్ల మోసాలు పెరుగుతాయి. ఇన్‌యాక్టివ్‌ మొబైల్ నంబర్‌లు అసాంఘిక శక్తుల చేతుల్లో పడితే ప్రమాద తీవ్రత ఇంకా పెరుగుతుంది. ఇలాంటి రిస్క్‌లకు అడ్డుకట్ట వేయడానికి, బ్యాంకులు & చెల్లింపు సేవా ప్రదాతలు (PSPలు) MNRLను ఉపయోగించి వారి డేటాబేస్‌ రికార్డులను అప్‌డేట్‌ చేస్తుంటాయి. దీనివల్ల, నిష్క్రియాత్మక నంబర్‌లను గుర్తించి డేటాబేస్‌ రికార్డుల నుంచి తొలగించడానికి వీలవుతుంది.


ఎలాంటి నంబర్లను ఇన్‌యాక్టివ్‌గా గుర్తిస్తారు?
సాధారణంగా, గత 90 రోజులుగా ఎలాంటి కాల్స్, మెసేజ్‌లూ రాని ఫోన్‌ నంబర్లను ఇన్‌యాక్టివ్‌ మొబైల్‌ నంబర్‌గా పరిగణిస్తారు. అలాంటి నంబర్‌లతో లింక్‌ అయిన యూపీఐ సేవలు ఏప్రిల్‌ 01 నుంచి ఆగిపోతాయి.


బ్యాంకులు కొత్త నియమాన్ని ఎలా అమలు చేస్తాయి?
బ్యాంకులు, PSPలు ఎప్పటికప్పుడు ఇన్‌యాక్టివ్‌ & తిరిగి కేటాయింపు జరిగిన మొబైల్ నంబర్‌లను గుర్తించి తొలగిస్తాయి.
దీనివల్ల ప్రభావితమయ్యే వినియోగదారులు, ఆ నంబర్‌పై UPI సేవలను నిలిపివేయడానికి ముందు అలెర్ట్‌ నోటిఫికేషన్‌లు అందుకుంటారు.
గడువుకు ముందు మొబైల్ నంబర్‌ను అప్‌డేట్‌ చేయడం ద్వారా UPI యాక్సెస్‌ను పునరుద్ధరించవచ్చు.


ఎవరిపై ఎఫెక్ట్‌ ఉంటుంది?
గత 90 రోజులుగా ఒక్క ఫోన్‌ కాల్‌ లేదా మెసేజ్‌ రాని ఫోన్‌ నంబర్‌ కలిగి ఉన్న వ్యక్తులు.
చాలా కాలంగా కాల్స్‌, SMS, బ్యాంకింగ్ అలెర్ట్‌ కోసం ఉపయోగించని ఫోన్‌ నంబర్‌ కలిగి ఉన్న వ్యక్తులు.
బ్యాంక్ వివరాలల్లో కొత్త నంబర్‌ను అప్‌డేట్‌ చేయకుండా పాత నంబర్‌ను ఉంచిన వ్యక్తులు.
పాత నంబర్‌ను వేరొకరికి కేటాయించినా, అదే నంబర్‌ను యూపీఐలో రిజిస్టర్‌ చేసిన వ్యక్తులు.


UPIని ఎలా యాక్టివ్‌గా ఉంచుకోవాలి?
ఎవరికైనా కాల్ చేయడం, SMS పంపి మీ మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉందో, లేదో చెక్‌ చేసుకోండి.
మీ బ్యాంక్ నుంచి SMS అలెర్ట్‌లు, OTPలు అందుకునేలా చూసుకోండి.
నెట్ బ్యాంకింగ్, UPI యాప్‌, ATM లేదా మీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి మీ UPI-లింక్‌డ్‌ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయండి.


మీ మొబైల్ నంబర్ ఇన్‌యాక్టివ్‌గా మారినా లేదా ఎక్కువ కాలంగా ఉపయోగించకపోయినా.. UPI యాక్సెస్ కోల్పోకుండా ఉండటానికి ఏప్రిల్ 01, 2025కి ముందు దానిని అప్‌డేట్ చేయండి.