Fraud alert:


అయ్యయ్యో! పొరపాటున మరొకరి బదులు మీకు డబ్బులు పంపించామండీ! మా ఫ్రెండ్‌కు పంపించబోయి మీ మొబైల్ పేమెంట్ అకౌంట్‌కు డబ్బులు వచ్చాయి బ్రో! తిరిగి నాకు ట్రాన్స్‌ఫర్‌ చేయరా ప్లీజ్‌! అంటే కాస్త ఆలోచించాల్సిందే! ఎందుకంటే టెక్నాలజీ మారేకొద్దీ సైబర్‌ నేరగాళ్లు తమ పంథా మారుస్తున్నారు! కొత్త కొత్త మోసాలకు తెరతీస్తున్నారు. ఈ మధ్యే ముంబయిలో 16 రోజుల్లో 81 మంది కోటి రూపాయల వరకు ఇలాగే నష్టపోయారు.


డబ్బు పంపించి!


బ్యాంకు కేవైసీ, పాన్‌ కార్డు, ఆన్‌లైన్‌ లింకులు పంపించి బ్యాంకు మోసాలు చేయడం చూస్తేనే ఉన్నాం. చాలా మంది కోట్ల రూపాయల డబ్బును ఇలాగే మోసపోయారు. ఇప్పుడు మొబైల్ పేమెంట్ యాప్ ల గేట్‌వేలను ఉపయోగించుకొని డబ్బులు కొట్టేస్తున్నారు. బ్యాంకు ఖాతాలను హ్యాక్‌ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో సైబర్‌ నేరగాళ్లు ఉద్దేశపూర్వకంగానే మీకు రూ.10 నుంచి 50 వరకు పంపిస్తారు. తర్వాత ఫోన్‌ చేసి పొరపాటు జరిగిందని దయచేసి వెనక్కి పంపించాలని కోరుతారు. దాంతో మాల్‌వేర్‌తో అటాక్‌ చేసి డబ్బు కొట్టేస్తారు.


మాల్‌వేర్‌ ప్లస్‌ మానవ శ్రమ


మొబైల్ పేమెంట్ అప్లికేషన్ల యూజర్లనే మోసగాళ్లు టార్గెట్‌ చేసుకుంటున్నారని దిల్లీ సైబర్‌ క్రైమ్‌ ఎక్స్‌పర్ట్‌ పవన్ దుగ్గల్‌ అంటున్నారు. 'ఇదో మాల్‌వేర్‌ ప్లస్‌ హ్యూమన్‌ ఇంజినీరింగ్‌ స్కామ్‌. కొందరు కావాలనే ఇతరుల ఖాతాలకు డబ్బులు పంపిస్తారు. ఆ తర్వాత ఫోన్‌ చేసి పొరపాటున పంపించామని, తమ ఫోన్‌ నంబర్‌కు డబ్బులు పంపించాలని రిక్వెస్ట్‌ చేస్తారు. ఒకవేళ మీరు డబ్బులు పంపిస్తే మీ అకౌంట్‌ హ్యాక్‌ అయినట్టే' అని ఆయన తెలిపారు.


ఈ జాగ్రత్తలు కంపల్సరీ!


'ఈ మోసంలో మాల్‌వేర్ (Malware), మనుషుల శ్రమ కలిసి ఉంది. ఇలాంటప్పుడు మొబైల్ పేమెంట్ అప్లికేషన్లను యాంటీ మాల్‌వేర్‌ సాఫ్ట్‌వేర్లు కాపాడలేవు. ఒకవేళ పొరపాటున డబ్బు వచ్చిందని ఎవరైనా కాల్‌ చేస్తే వెంటనే బ్యాంకును సంప్రదించండి. డబ్బు డిపాజిట్‌ అయిందో లేదో కనుక్కోండి. ఏదైనా ప్రమాదం ఉందో తెలుసుకోంది' అని దుగ్గల్‌ పేర్కొన్నారు.


మొబైల్ పేమెంట్ అప్లికేషన్ల నుంచి లావాదేవీల చేయడం వల్ల ఇబ్బందేమీ లేదని, రీపేమెంట్‌ చేసిన లావాదేవీ స్క్రీన్‌ షాట్లు మాత్రం షేర్‌ చేయొద్దన్నారు. అలా చేస్తే మోసగాళ్లకు మీ వ్యక్తిగత వివరాలు తెలుసుకొనేందుకు అవకాశం ఇస్తున్నట్టేనని వివరించారు. తెలియని వాళ్లకు ఇలాంటివి షేర్‌ చేయొద్దన్నారు. ఒకవేళ డబ్బు ఇవ్వాల్సి వస్తే మీ సమీపంలోని పోలిస్‌ స్టేషన్‌కు రావాల్సిందిగా సూచిస్తున్నారు.


Also Read: ఉదయశివకుమార్ ఇన్‌ఫ్రా ఐపీవో ప్రారంభం, బిడ్‌ వేసే ముందు కచ్చితంగా తెలియాల్సిన విషయాలివి!