UAN Number: ఉద్యోగుల భవిష్య నిధి (Employees' Provident Fund Organisation - EPFO) చందాదార్లకు యూఏఎన్‌ చాలా కీలకం. ఇది, 12 అంకెలు ఉండే ఒక సంఖ్య. చందాదార్లకు ఈపీఎఫ్‌లో ఈ సంఖ్యను కేటాయిస్తుంది. స్మార్ట్‌ ఫోన్లలో ప్రతీదీ ఫీడ్‌ చేసుకుని స్వయంగా మతిమరుపు పెంచుకుంటున్న ఈ రోజుల్లో ఒక 12 అంకెల సంఖ్యను గుర్తు పెట్టుకోవడం కొంత కష్టమైన విషయమే.


UAN (Universal Account Number) ద్వారా చందాదార్లు తమ EPF ఖాతాకు లాగిన్‌ అయ్యి.. ప్రావిడెంట్‌ ఫండ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోడం; ఆన్‌లైన్‌ ద్వారా వ్యక్తిగత వివరాలు, KYC, బ్యాంకు ఖాతా వివరాలను మార్చుకోవడం; రెండు EPF అకౌంట్లను విలీనం చేయడం; ఆన్‌లైన్‌ ద్వారానే ఫండ్స్‌ క్లెయిం చేసుకోవడం; పాస్‌బుక్‌ డౌన్‌లోడ్‌ లేదా ప్రింట్‌ చేసుకోడం, యూఏఎన్‌ కార్డ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం వంటి చాలా పనులు చేయవచ్చు. వీటన్నింటికీ మూలమైన UAN మీరు మర్చిపోతే కంగారు పడాల్సిన పని లేదు. దానిని సులభంగా తిరిగి పొందవచ్చు. అయితే, ఆ యూఏఎన్‌ నంబర్‌ యాక్టివ్‌గా ఉండాలి, మీ దగ్గర ఉన్న మొబైల్‌ నంబరుతో అనుసంధానమై ఉండాలి. ఇలాగైతేనే మీరు UAN సులువుగా పొందవచ్చు. 


ఆన్‌లైన్‌ ద్వారా, ఆఫ్‌లైన్‌ ద్వారా రెండు పద్ధతుల్లోనూ మీరు మీ UAN సులభంగా తిరిగి పొందవచ్చు. 


ఆన్‌లైన్‌ UAN తిరిగి పొందడం..
ముందుగా, epfindia.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి
హోమ్‌ పేజీలో కనిపించే ‘సర్వీసెస్‌’ ట్యాబ్‌ మీద క్లిక్‌ చేయండి
ఇక్కడ ‘ఫర్‌ ఎంప్లాయీస్‌’ను ఎంచుకుని, ‘యూఏఎన్‌ మెంబర్‌/ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ (OCS/OTCP)’ మీద క్లిక్‌ చేయండి
ఇక్కడ నుంచి మీరు unifiedportal-mem.epfindia.gov.in పోర్టల్‌కు రీడైరెక్ట్‌ అవుతారు. 
ఇక్కడ ‘ఇంపార్టెంట్‌ లింక్స్‌’ కనిపిస్తాయి. వాటిలో.. ‘నో యువర్‌ యూఏఎన్‌’ లింక్‌ మీద క్లిక్‌ చేయండి 
ఇక్కడ మీ మొబైల్‌ నంబర్‌, క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత 'రిక్వెస్ట్‌ ఓటీపీ' మీద క్లిక్‌ చేయండి
మీ యూఏఎన్‌కు లింక్‌ అయిన మొబైల్‌ నంబరుకు OTP (వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌) వస్తుంది. 
ఇప్పుడు, సంబంధిత బాక్స్‌లో OPT ఎంటర్‌ చేస్తే, మీ మొబైల్‌ నంబర్‌కు మెసేజ్‌ రూపంలో మీ యూఏఎన్‌ వస్తుంది. 


ఆఫ్‌లైన్‌ UAN తిరిగి పొందడం..
మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబరు నుంచి ఒక SMS పంపితే చాలు.. మీ ఖాతా వివరాలు మీకు తిరిగి మెసేజ్‌ రూపంలో అందుతాయి. ఆ వివరాల్లో మీ UAN నంబర్‌ కూడా ఉంటుంది. మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి EPFOHO UAN అని టైప్‌ చేసి 77382 99899 నంబర్‌కు మెసేజ్‌ చేయండి. తెలుగులోనూ ఈ సేవను పొందవచ్చు. EPFOHO UAN TEL అని టైప్‌ చేసి 77382 99899 నంబర్‌కు SMS చేస్తే, మీ ఖాతా వివరాలన్నీ తెలుగులో తిరిగి మీకు మెసేజ్‌ రూపంలో వస్తాయి.


SMS ద్వారానే కాదు, ఒక మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా కూడా ఈ వివరాలు పొందవచ్చు. మీరు EPFO చందాదారు అయితే, మీ రిజిస్టర్‌ మొబైల్‌ నంబరు నుంచి 99660 44425 నంబరుకు మిస్డ్‌ కాల్‌ ఇవ్వండి. మీ ఖాతా వివరాలు SMS రూపంలో తిరిగి మీ మొబైల్‌కు వస్తాయి.