NRE FD Rates: NRE అకౌంట్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కొత్త వడ్డీ రేట్లను ప్రకటించాయి. ఏ బ్యాంక్ ఎంత వడ్డీ రేటు ఆఫర్ చేస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం.
NRE ఖాతా అంటే ఏంటి?
ముందుగా, NRE అకౌంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు (NRIలు) తమ బ్యాంక్ ఖాతాలను భారతదేశంలోనే ప్రారంభించవచ్చు. విదేశాల్లో నివశించే వ్యక్తులు, భారతదేశంలోని తమ బ్యాంకు ఖాతాల్లోకి విదేశీ కరెన్సీని డిపాజిట్ చేస్తారు. అలాంటి బ్యాంక్ ఖాతాను నాన్ రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ అకౌంట్ [Non-resident (External) Account] అంటారు. ఈ ఖాతాలోకి విదేశీ కరెన్సీని డిపాజిట్ చేస్తే, భారతీయ రూపాయిల రూపంలో విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ ఖాతాను వ్యక్తిగతంగా, ఉమ్మడిగా తెరవవచ్చు.
NRE అకౌంట్ FD రేట్లు
నాన్ రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ ఖాతాల్లో.. పొదుపు ఖాతా, కరెంట్ ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా ఉంటాయి. NRE ఖాతాకు వడ్డీ రేటు బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. ఈ ఖాతాలపై కనీస కాల పరిమితి (డిపాజిట్ మెచ్యూరిటీ టైమ్) ఒక సంవత్సరం. ఇంతకంటే తక్కువ కాలానికి ఈ ఖాతాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడానికి లేదు.
ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగం వరకు NRE ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఒకటి నుంచి పదేళ్ల కాల గడువుకు, రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్ మీద ఏడాదికి 6.50 శాతం నుంచి 7.10 శాతం వరకు వడ్డీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తోంది. అదే సమయంలో, రూ. 2 కోట్ల కంటే ఎక్కువ మొత్తానికి 6.00 శాతం నుంచి 6.75 శాతం వరకు వడ్డీని ఇస్తోంది. ఫిబ్రవరి 15, 2023 నుంచి కొత్త రేట్లను బ్యాంక్ అమలు చేసింది.
HDFC బ్యాంక్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తరపున, ఎన్‌ఆర్‌ఈ ఖాతాదార్లకు రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ మొత్తానికి 6.60 శాతం నుంచి 7.10 శాతం వరకు వార్షిక వడ్డీని చెల్లిస్తోంది. రెండు కోట్ల కంటే ఎక్కువ మొత్తానికి 7.10 శాతం నుంచి 7.75 శాతం వరకు అందజేస్తోంది. కొత్త రేట్లు ఫిబ్రవరి 21, 2023 నుంచి అమలులోకి వస్తాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ NRE FD రేటును పెంచింది. గతేడాది రేట్లు 5.6 శాతం నుంచి 6.75 శాతం వరకు ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ రేట్లను 6.5 శాతం నుంచి 7.25 శాతానికి పెంచింది. జనవరి 1, 2023 నుంచి ఈ రేట్లను పంజాబ్ నేషనల్ బ్యాంక్ అమలు చేస్తోంది.
ICICI బ్యాంక్
ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్‌ఆర్‌ఈ ఖాతాల ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను 6.70 శాతం నుంచి 7.10 శాతం వరకు ప్రకటించింది. ఈ రేట్లు ఫిబ్రవరి 24, 2023 నుంచి వర్తిస్తాయి.
కెనరా బ్యాంక్
NRE ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద ఏడాది నుంచి పదేళ్ల కాలానికి 6.70 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ రేటును కెనరా బ్యాంక్ నిర్ణయించింది. కెనరా బ్యాంక్ రేట్లు ఏప్రిల్ 5, 2023 నుంచి అమలులోకి వచ్చాయి.