5 Banks Revised FD Interest Rates: ఈ నెల ప్రారంభంలో (December 2024) జరిగిన రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో (RBI MPC Meeting) కూడా భారతీయ కేంద్ర బ్యాంక్‌ కీలక రేట్లను మార్చలేదు. ప్రస్తుతం, రెపో రేట్‌ (Repo Rate) 6.50% వద్ద ఉంది. రెపో రేట్‌లో మార్పు చేయకుండా యథాతథంగా కొనసాగించడం ఇది వరుసగా 11వసారి. కేంద్ర బ్యాంక్‌, చివరిసారిగా 2023 ఫిబ్రవరిలో రెపో రేటును సవరించింది, అప్పటి నుంచి అది 6.50% వద్దే కొనసాగుతోంది. 
 
రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేట్‌లో మార్పు చేయనప్పటికీ, దేశంలోని కొన్ని బ్యాంక్‌లు ఈ నెలలో తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను (Interest rates on FDs) సవరించాయి. మన దేశంలో, అత్యంత ప్రజాదరణ పొందిన పెట్టుబడి ఎంపికల్లో (Most popular investment options 2024) ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఒకటి. భవిష్యత్‌ అవసరాల కోసం, ప్రజలు తమ పొదుపుల్లో (Savings) పెద్ద భాగాన్ని ఎఫ్‌డీ ఖాతాలో (Fixed deposit account) డిపాజిట్‌ చేస్తున్నారు. ఎఫ్‌డీ పెట్టుబడికి నష్టభయం నామమాత్రంగా ఉండడంతో పాటు, ముందుగా హామీ ఇచ్చిన రాబడి కచ్చితంగా చేతికి రావడం వల్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బాగా పాపులర్‌ అయింది.


ఈ నెలలో FD రేట్లను సవరించిన బ్యాంకులు:


ఫెడరల్ బ్యాంక్ (Federal Bank)
ఫెడరల్ బ్యాంక్ రూ. 3 కోట్ల కంటే తక్కువ విలువైన FD డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. డిసెంబర్ 16, 2024 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. సాధారణ పౌరులకు (60 ఏళ్ల వయస్సు కంటే తక్కువున్న ఖాతాదార్లు) 3% నుంచి 7.4% మధ్య; సీనియర్ సిటిజన్‌లకు (60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఖాతాదార్లు) 3.50% నుంచి 7.9% మధ్య వడ్డీ రేట్లను ఈ బ్యాంక్‌ అందిస్తోంది.


ఆర్‌బీఎల్‌ బ్యాంక్ (RBL Bank)
RBL బ్యాంక్ కూడా రూ. 3 కోట్ల కంటే తక్కువ మొత్తంలో ఉన్న FDలపై వడ్డీ రేట్లను మార్చింది. కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 15, 2024 నుంచి అమలులోకి వచ్చాయి. సాధారణ డిపాజిటర్లకు 3.50% నుంచి 8% మధ్య; సీనియర్ సిటిజన్‌లకు గరిష్టంగా 8.50% వరకు; సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 8.75% వరకు వడ్డీ రేట్లను బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తోంది. 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఖాతాదార్లను సూపర్‌ సీనియర్ సిటిజన్‌లుగా వ్యవహరిస్తారు.


కర్ణాటక బ్యాంక్ (Karnataka Bank)
కర్నాటక బ్యాంక్ రూ. 3 కోట్ల కంటే తక్కువ విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఆ మొత్తాలకు FD వడ్డీ రేట్లను సవరించింది, డిసెంబర్ 02, 2024 నుంచి ఇది అమలులోకి వచ్చింది. సాధారణ పౌరులకు 3.50% నుంచి 7.5% వరకు, సీనియర్ సిటిజన్‌లకు 3.5% నుంచి 8% మధ్య వడ్డీ రేట్లను ఈ బ్యాంక్‌ అందిస్తోంది.


బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank of Maharashtra)
రూ. 3 కోట్ల కంటే తక్కువ FD మొత్తాలపై వడ్డీ రేట్లలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మార్పులు చేసింది. డిసెంబర్ 11, 2024 నుంచి ఈ మార్పులు అమలవుతున్నాయి. ఈ బ్యాంక్‌, ఇప్పుడు, సాధారణ పౌరులకు 2.75% నుంచి 7.35% వరకు; సీనియర్ సిటిజన్‌లకు 2.75% నుంచి 7.85% మధ్య వడ్డీ ఆదాయాన్ని జమ చేస్తోంది.


ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Equitas Small Finance Bank)
ఇది స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (SFB). షెడ్యూల్డ్‌ బ్యాంక్‌ చేసే పనులన్నింటినీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లు చేయలేవు. ఎఫ్‌డీల విషయానికి వస్తే, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా రూ. 3 కోట్ల కంటే తక్కువ మొత్తం FD రేట్లలో మార్పులు చేసింది. డిసెంబర్ 2, 2024 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. సాధారణ పౌరులకు 3.50% నుంచి 8.25% వరకు; సీనియర్ సిటిజన్‌లకు 2.75% నుంచి 9% వరకు వడ్డీ రేట్లను ఈ SFB అందిస్తోంది.


ఈ బ్యాంక్‌లో, భారతీయ సీనియర్ సిటిజన్లు, 888 రోజుల స్కీమ్‌ మినహా అన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలపై సాధారణ పౌరుల కంటే అదనంగా 0.50% వార్షిక వడ్డీని అందుకుంటారు. 


888 డేస్‌ ఎఫ్‌డీ స్కీమ్‌లో, సాధారణ పౌరులు అదనంగా 0.50% వార్షిక వడ్డీ పొందితే, సీనియర్‌ సిటిజన్లు దీనికంటే అదనంగా 0.25% అదనపు వడ్డీని పొందుతారు. మొత్తంగా చూస్తే, 888 డేస్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంలో సీనియర్‌ సిటిజన్లు అదనంగా 0.75% (0.50 + 0.25) వడ్డీ ఆదాయం ఆర్జిస్తారు.


మరో ఆసక్తికర కథనం: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య