Specialized Investment Fund: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల కోసం, స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) కొన్ని రూల్స్ మార్చింది. ఈ మార్పుల్లో.. స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (SIF), మ్యూచువల్ ఫండ్ లైట్ (Mutual Fund Lite) ఫ్రేమ్‌వర్క్‌లు ఉన్నాయి. MF ఇన్వెస్టర్లకు కొత్త ఆప్షన్లు అందించడం & పెట్టుబడి మార్కెట్‌ను మరింత మెరుగుపరచడం ఈ మార్పుల లక్ష్యం.
స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అంటే ఏమిటి? (What is a Specialized Investment Fund?)
హై రిస్క్ ఇన్వెస్టర్ల కోసం సెబీ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌ను ప్రారంభించింది. SIF కింద, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (AMCs) ఆధునిక పెట్టుబడి వ్యూహాలను అమలు చేస్తాయి. ఫండ్ మేనేజర్లకు మరింత స్వేచ్ఛ లభిస్తుంది. ఈ స్కీమ్‌ల్లో, ఫండ్ మేనేజర్, ఇన్వెస్టర్ల డబ్బును అధిక రిటర్న్ వచ్చేలా తన ఇష్టానుసారం పెట్టుబడి పెట్టగలడు. అధిక రిటర్న్‌కు అవకాశం ఉంటుంది కాబట్టి, అదే టైమ్‌లో, హై రిస్క్‌కు కూడా అవకాశం ఉంటుంది. అంటే, ఈ ఫండ్ అధిక రిస్క్ తీసుకోగల ఇన్వెస్టర్లకు మాత్రమే. SIF కింద, ఓపెన్-ఎండ్ స్కీమ్‌లు (Open-Ended Schemes) & క్లోజ్డ్-ఎండ్ స్కీమ్‌లను (Closed-Ended Schemes) మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తాయి. ఈ పథకాలలో పెట్టుబడిదారుడికి కనీసం రూ. 10 లక్షల పెట్టుబడి తప్పనిసరి. అయితే, ఈ రూల్ గుర్తింపు పొందిన పెట్టుబడిదారులకు (accredited investors) వర్తించదు. ఇది కాకుండా, SIF మ్యూచువల్ ఫండ్ పథకాల ప్రత్యేక బ్రాండింగ్, గుర్తింపును విడిగా నిర్ధారించాల్సి ఉంటుందని సెబీ తెలిపింది. పెట్టుబడిదారుల రక్షణ & పారదర్శకతను ప్రోత్సహించడం దీని లక్ష్యం.
మ్యూచువల్ ఫండ్ లైట్ (What is Mutual Fund Lite)
మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ & ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ETF) పథకాల కోసం సెబీ 'మ్యూచువల్ ఫండ్ లైట్' ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టింది. పెట్టుబడి ప్రక్రియను సులభతరం చేయడం, కొత్త AMCలను ప్రోత్సహించడం, పెట్టుబడి మార్కెట్‌ను విస్తృతం చేయడం దీని లక్ష్యం. MF లైట్ కింద, కొత్త అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల కోసం నియమాలను సరళంగా మారుస్తారు. ప్రారంభంలో, AMC కనీస నికర విలువ రూ. 35 కోట్లు ఉండాలి. వరుసగా 5 ఏళ్లపాటు లాభాలు ఆర్జించే కంపెనీలకు ఈ నికర విలువను రూ. 25 కోట్లకు తగ్గిస్తారు. MF లైట్ మార్కెట్లో లిక్విడిటీని పెంచుతుంది, పెట్టుబడిదారులకు మరిన్ని ఆప్షన్లను అందిస్తుంది.
ఇన్వెస్టర్లకు ఏంటి ప్రయోజనం?
కొత్త పథకాలతో పెట్టుబడిదారులు మంచి రాబడి అవకాశాలను పొందుతారు. ఎంఎఫ్ లైట్ ద్వారా మార్కెట్లోకి ఎక్కువ నగదు వచ్చి పెట్టుబడుల్లో వైవిధ్యం పెరుగుతుంది. ఈ కొత్త ఉత్పత్తులు, అసాధ్యమైన రాబడిని అందిస్తామంటూ వాగ్దానం చేసే అనధికారిక పెట్టుబడి పథకాలకు అడ్డుకట్ట వేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ - పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ మధ్య అంతరాన్ని తగ్గిస్తాయి. పెట్టుబడిదారులకు మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి, రిస్క్‌ను బట్టి పెట్టుబడి పెట్టే ఫెసిలిటీని పొందుతారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: మీ నగరంలో చవకగా మారిన గోల్డ్, సిల్వర్ నగలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ