SBI, HDFC FD Interest Rates: చూస్తుంటే బ్యాంకు కస్టమర్లకు మంచిరోజులు వచ్చినట్టున్నాయి! ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని అతిపెద్ద బ్యాంకులు పోటీపడి మరీ వడ్డీరేట్లు పెంచుతున్నాయి. గురువారం ఉదయమే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు సవరిస్తున్నామని హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించింది. మరికాసేపటికే తామూ పెంచుతున్నామని ఎస్‌బీఐ వెల్లడించింది. వడ్డీరేట్లపై భారతీయ రిజర్వు బ్యాంకు యథాతథ స్థితిని అనుసరిస్తున్నా ఈ రెండు బ్యాంకులూ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుండటం గమనార్హం.


HDFC Bank । హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌


కొన్ని రకాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వడ్డీరేట్లను పెంచింది. రూ.2 కోట్ల కన్నా తక్కువ డిపాజిట్లపై వడ్డీరేట్లను 5-10 బేసిస్‌ పాయింట్ల మేర సవరిస్తున్నట్టు తెలిపింది. ఫిబ్రవరి 14 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయని వెల్లడించింది. ఏడాది కాల పరిమితితో కూడిన డిపాజిట్లపై వడ్డీరేటును 10 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో 4.9 శాతంగా ఉన్న వడ్డీ 5 శాతానికి పెరిగింది. ఇక రెండేళ్ల కాల పరిమితి ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లనూ 5 శాతానికి పెంచారు. 2-3 ఏళ్ల కాల పరిమితి డిపాజిట్ల వడ్డీరేటును 5.20 శాతంగానే ఉంచారు. 3-5 ఏళ్ల కాల వ్యవధితో కూడిన డిపాజిట్లపై వడ్డీరేటును 5 బేసిన్‌ పాయింట్లు సవరించి 5.45 శాతానికి పెంచారు. 5-10 ఏళ్ల ఎఫ్‌డీలపై వడ్డీరేటు 5.60 శాతంగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు జనవరిలోనే వడ్డీరేట్లను సవరించిన సంగతి తెలిసిందే.


SBH- State Bank of India । ఎస్‌బీఐ


ప్రభుత్వ రంగ భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ సైతం దీర్ఘకాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లను 15 బేసిస్‌ పాయింట్ల మేర సవరించింది. పెంచిన వడ్డీరేట్లు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. 3-5 ఏళ్ల ఎఫ్‌డీలపై వడ్డీరేటును 5.30 నుంచి 5.45 శాతానికి పెంచింది. సీనియర్‌ సిటిజన్లకు 5.80 నుంచి 5.95 శాతానికి పెంచారు. ఇక 2-3 ఏళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు సవరించారు. గతంలో 5.10 శాతం వడ్డీ ఇస్తుండగా ఇప్పుడది 5.45కు పెరిగింది. సీనియర్‌ సిటిజన్లకు 5.80 నుంచి 5.95కు పెంచారు.


రెండు నుంచి మూడేళ్లలోపు ఎఫ్‌డీలపై 10 బేసిస్‌ పాయింట్లు పెంచారు. గతంలో 5.10 శాతం వడ్డీ ఇస్తుండగా ఇప్పుడది 5.20 శాతానికి పెరిగింది. సీనియర్‌ సిటిజన్లకు ఇది 5.60 నుంచి 5.70కు పెరిగింది. 5 నుంచి 10 ఏళ్ల ఎఫ్‌డీల వడ్డీ రేటు 5.40 నుంచి 5.50కు పెంచారు. సీనియర్‌ సిటిజన్లకు 6.20 నుంచి 6.30 శాతానికి పెంచారు. పెంచిన వడ్డీరేట్లు రూ.2 కోట్ల కన్నా తక్కువ విలువైన ఎఫ్‌డీలకే వర్తిస్తాయి.