EPFO News:వేతన, ఉద్యోగుల సంఖ్యపై పరిమితిని సవరించాలని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) ప్రతిపాదిస్తోంది. ఉద్యోగ విరమణ ప్రయోజనాలను ఎక్కువ మందికి అందించాలని భావిస్తోంది. అలాగే స్వయం ఉపాధి పొందుతున్న వారూ ఈపీఎఫ్‌లో చేరేందుకు అనుమతించాలని అనుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను కలిసిందని, స్టేక్‌ హోల్డర్లతో చర్చిస్తోందని తెలిసింది.


ప్రస్తుతం ఈపీఎఫ్‌లో రూ.15,000కు మించి కంట్రిబ్యూట్‌ చేసేందుకు అనుమతి లేదు. ఎక్కువ జీతం పొందుతున్నా పరిమితి మేరకే జమ చేయాల్సి వస్తోంది. ఏదైనా కంపెనీ, కర్మాగారం ఇతర పని ప్రాంతాల్లో 20 లేదా అంతకు మించి కార్మికులు ఉంటేనే ఈపీఎఫ్‌లో చేరొచ్చు. అంతకన్నా తక్కువ మంది ఉంటే ఈ పథకంలో చేరేందుకు వీల్లేదు. ఏ కంపెనీలోనూ పనిచేయకుండా స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈపీఎఫ్‌లో చేరేందుకు అనుమతి లేదు. కొన్నాళ్లుగా ఈ నిబంధనలు మార్చాలని ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.


పీఎఫ్‌లో ఎక్కువ డబ్బు కంట్రిబ్యూట్‌ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో 55 మిలియన్ల చందాదారులు ఉన్న సంగతి తెలిసిందే. ఈపీఎఫ్‌ చట్టంలో సవరణ చేస్తేనే ఇందుకు వీలవుతుందని ఓ అధికారి మీడియాకు తెలిపారు. 'ఉద్యోగుల సంఖ్య, వేతన పరిమితిని సవరించడమే అతిపెద్ద సవాల్‌. ఆమోదం లభిస్తే వేతనం, ఉద్యోగుల సంఖ్యతో సంబంధం లేకుండా అందరూ ఈపీఎఫ్ పరిధిలోకి వస్తారు' అని ఆ అధికారి వెల్లడించారు.


ప్రభుత్వం ఈ నిబంధనలను సవరిస్తే ఉద్యోగులకు మరింత మేలు జరుగుతుంది. వారికి ఎక్కువ రిటైర్మెంట్‌ ప్రయోజనాలు దక్కుతాయి. ప్రస్తుతం రూ.15,000 వరకు మాత్రమే ఉద్యోగి కంట్రిబ్యూట్‌ చేయొచ్చు. యాజమాన్యం సైతం అంతే మేరకు కంట్రిబ్యూట్‌ చేస్తుంది. ఒకవేళ ప్రభుత్వం వేతన పరిమితి తొలగిస్తే ఉద్యోగి ఎక్కువ డబ్బును కంట్రిబ్యూట్‌ చేసుకోవచ్చు. యాజమాన్యాల కంట్రిబ్యూషన్‌ పెంపునకు ఒత్తిడి తేకపోవచ్చని తెలుస్తోంది.


ప్రస్తుతం ఈపీఎఫ్‌వో చందాదారులకు ఈపీఎఫ్, పింఛను, బీమా ప్రయోజనాలను అందిస్తోంది. ఇప్పుడు ఈపీఎఫ్‌వో నిధుల్లో 15 శాతం వరకు ఈటీఎఫ్‌ల రూపంలో స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెడుతోంది. సబ్‌స్క్రైబర్లకు ఎక్కువ వడ్డీ, రాబడి అందించేందుకు 25 శాతం వరకు స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది.