PF Transfer : భారత్‌లో ఉద్యోగులు నిరంతరం కంపెనీలు మారుతూనే ఉంటారు. కానీ ఈ ప్రక్రియలో అత్యంత కష్టమైన పనుల్లో ఒకటి... పాత ప్రావిడెంట్ ఫండ్‌ను కొత్త ఖాతాకు బదిలీ చేసుకోవడం. నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యకు ముగింపు పలికేందుకు EPFO ఒక సంస్కరణ తీసుకొచ్చింది. 'అనెక్చర్ K' పత్రాన్ని ఆన్‌లైన్‌లో నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని సభ్యులకు కల్పించింది.
పీఎఫ్ బదిలీల సమస్య:
ఉద్యోగాలు మారినప్పుడు, వారి పీఎఫ్ ఖాతాలు ఆన్‌లైన్‌లో ఫారం 13 ద్వారా కొత్త యజమాని పీఎఫ్ కార్యాలయానికి బదిలీ చేయాలి. ఈ బదిలీ తర్వాత, పాత పీఎఫ్ కార్యాలయం ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (అనెక్చర్ K) ను జారీ చేసి, కొత్త పీఎఫ్ కార్యాలయానికి పంపేది. ఇప్పటి వరకు, ఈ అనెక్చర్ K పత్రం కేవలం పీఎఫ్ కార్యాలయాల మధ్య మాత్రమే షేర్ అయ్యేది. సభ్యులు ప్రత్యేకంగా అభ్యర్థించినప్పుడు మాత్రమే వారికి అందుబాటులో ఉండేది. ఈ లోపం వల్ల సభ్యులు తమ ట్రాన్స్‌ఫర్ స్టాటర్ ట్రాక్ చేయలేక గందరగోళం ఏర్పడి తమ పాత యజమానుల HR బృందాలపై ఆధారపడాల్సి వచ్చేది.
డిజిటల్ యాక్సెస్, పర్మనెంట్ రికార్డు
EPFO తీసుకొచ్చిన సంస్కరణతో ఇప్పుడు సభ్యులు తమ మెంబర్ పోర్టల్ నుంచే నేరుగా PDF ఫార్మాట్‌లో అనెక్చర్ K ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ఉద్యోగులకు భారీ ఊరటనిస్తుంది. ఈ డిజిటల్ యాక్సెస్ వల్ల పేపర్‌వర్క్ పీఎఫ్ కార్యాలయాల మధ్య సమయం వృథా తొలగిపోయింది.
ఈ సంస్కరణ ద్వారా సభ్యులకు లభించే ప్రయోజనాలు ఇవి:
1. పూర్తి పారదర్శకత: పీఎఫ్ బదిలీ దరఖాస్తుల స్టాటస్‌ను ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసే సామర్థ్యం లభిస్తుంది, దీని ద్వారా సభ్యులు తమ పీఎఫ్ బదిలీలను సులభంగా నిర్దారించుకోవచ్చు.
2. కచ్చితత్వం ధృవీకరణ: పీఎఫ్ బ్యాలెన్స్, సర్వీస్ పీరియడ్ కొత్త ఖాతాలో సరిగ్గా అప్‌డేట్ చేసుకోవచ్చు.
3. శాశ్వత డిజిటల్ రికార్డు: భవిష్యత్తు సూచన కోసం ఒక శాశ్వత డిజిటల్ రికార్డును నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా EPS (Employees Pension Scheme) బెనిఫిట్ లెక్కల కోసం ఇది చాలా కీలకం.
మొబైల్ వర్క్‌ఫోర్స్‌కు భరోసా:
కొత్త ఉద్యోగంలో చేరే ఒక ఉద్యోగికి తమ పాత పీఎఫ్ బ్యాలెన్స్ సురక్షితంగా కొత్త ఖాతాకు బదిలీ అయ్యిందని నిర్ధారించుకోవడానికి, ఇప్పుడు ఎప్పుడైనా లాగిన్ చేసి, అనెక్చర్ K ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తరచుగా ఉద్యోగాలు మారే యువతకు ఈ మార్పు చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. పీఎఫ్ బదిలీలలో ఆలస్యం కారణంగా అనేక ఖాతాలు ఫ్రీజ్ అవుతున్నాయి. ఈ నిష్క్రియ ఖాతాలు విత్‌డ్రాయల్స్‌ను క్లిష్టతరం చేస్తాయి . అన్‌క్లైమ్డ్ పీఎఫ్ ఖాతాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ సమస్యలకు కొత్త సంస్కరణ పరిష్కారం చూపిస్తోంది.
గ్రీవెన్స్ రిడక్షన్ లక్ష్యం:
EPFO ఈ చొరవ, 'పాస్‌బుక్ లైట్'తో పాటు, సభ్యుల ఫిర్యాదులను తగ్గించడం, పారదర్శకతను మెరుగుపరచడం, సభ్యుల సంతృప్తిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్కరణలు 2.7 కోట్లకుపైగా యాక్టివ్ EPFO వినియోగదారులకు మరింత నియంత్రణ పారదర్శక సేవలు అందిస్తాయి.
UMANG యాప్‌లో ఫిర్యాదుల పరిష్కారం:
EPFO గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అయిన EPFiGMS కూడా ఫిర్యాదుల పరిష్కారం కోసం అనుకూలించే పోర్టల్. పీఎఫ్ సభ్యులు, ఈపీఎస్ పెన్షనర్లు, యజమానులు, ఇతరులు ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు. ఈ ఫిర్యాదులు న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి లేదా దేశవ్యాప్తంగా ఉన్న 135 ఫీల్డ్ కార్యాలయాలకు పంపవచ్చు. ముఖ్యంగా, EPFiGMS UMANG మొబైల్ అప్లికేషన్‌లో కూడా అందుబాటులో ఉంది. ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత, సిస్టమ్ ఒక ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఇస్తుంది. SMS, ఇమెయిల్ ద్వారా ఆటో జనరేటెడ్ అక్నాలెడ్జ్‌మెంట్ పంపుతుంది.