Bima Sugam: భారతదేశంలో డిజిటల్ పరివర్తన వేగంగా సాగుతోంది. బ్యాంకింగ్ రంగంలో యూపీఐ డిజిటల్ చెల్లింపులు సులభతరం చేసినట్లే, బీమా రంగంలో మార్పులకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) సిద్ధమైంది. అందులో భాగంగా 'బీమా సుగమ్'పోర్టల్ (bimasugam.co.in)ను 18 సెప్టెంబర్ 2025న స్టార్ట్ చేసింది.  ఈ పోర్టల్ పాలసీదారులకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుండగా, లక్షలాది బీమా ఏజెంట్‌ల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. భారతదేశంలోని 20 లక్షలకుపైగా బీమా ఏజెంట్‌లకు బీమా సుగమ్ సవాలుగా మారుతుందా? లేక కొత్త అవకాశాలు సృష్టిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం.  

Continues below advertisement

ఏజెంట్‌లకు బీమా సుగమ్‌తో కష్టమే: బీమా సుగమ్ పోర్టల్ బీమా కొనుగోలు, సర్వీస్, పునరుద్ధరణ పద్ధతుల్లో ప్రాథమిక మార్పు సూచిస్తుంది. ఇది కస్టమర్‌కు సాధికారత కల్పించి, ఏజెంట్ రహిత మోడల్‌కు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత వ్యవస్థలో బీమా పాలసీలలో ఎక్కువ భాగం ఏజెంట్‌ల ద్వారానే అమ్ముడవుతాయి. వారు కస్టమర్‌లకు అవగాహన కల్పించడం, అమ్మకాలను పెంచడం, డాక్యుమెంటేషన్ నిర్వహించడం, క్లెయిమ్‌లకు సహాయం చేయడం వంటి పనులను చేస్తారు. అయితే, బీమా సుగమ్ నేరుగా వినియోగదారుడితోనే కనెక్ట్ అవుతుంది. అన్ని IRDAI ఆమోదిత బీమా కంపెనీల పాలసీలను పోల్చి చూసి కొనుగోలు చేయవచ్చు.  

ఆధార్ ఆధారిత KYC, డిజిలాకర్ ద్వారా డాక్యుమెంట్‌లు అందజేత, పాలసీ జారీ ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా మారుతుంది. రెన్యువల్‌, క్లెయిమ్‌లు ఆన్‌లైన్‌లో దాఖలు చేయవచ్చు, ఏజెంట్‌లపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల ఏజెంట్‌లు తమ ప్రాధాన్యత కోల్పోనున్నారు.  

Continues below advertisement

పూర్తి పారదర్శకత, తక్కువ ఖర్చు: బీమా సుగమ్‌లో అన్ని పాలసీలు డిస్‌ప్లే చేస్తారు. కమీషన్ స్థాయిలు లేదా బీమా సంస్థ ప్రాధాన్యత ఆధారంగా ఎటువంటి ర్యాంకింగ్ ఉండదు. ఇది పాలసీబజార్ వంటి అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌ల కంటే భిన్నమైనది. అక్కడ కొన్ని పాలసీలను కమర్షియల్ ఒప్పందాల కారణంగా ఎక్కువగా ప్రచారం చేస్తారు. ఇప్పుడు సుగమ్‌ పోర్టల్‌లో కస్టమర్‌లు పాలసీల ప్రీమియంలు, క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో , వెయిటింగ్ పిరియడ్స్‌ వంటి వివరాలు సరిపోల్చి, పూర్తిగా సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏజెంట్‌లు,  మధ్యవర్తులు మొదటి సంవత్సరం ప్రీమియం నుంచి 15-40% కమీషన్‌గా తీసుకుంటారు. ఇది దీర్ఘకాలంలో కస్టమర్ ప్రీమియంలను పెంచుతుంది.బీమా సంస్థలకు కస్టమర్ అక్విజిషన్ ఖర్చులు పెంచుతుంది. బీమా సుగమ్ కమీషన్ లేని వ్యవస్థను సృష్టించాలని చెబుతోంది. ఇది బీమా సంస్థలకు ఖర్చులు తగ్గించి, కస్టమర్‌లను చేరుకోవడానికి సహాయపడుతుంది. దీంతో ఏజెంట్ ఆదాయంపై ప్రభావం పడుతుంది.

డిజిటల్ క్లెయిమ్ మేనేజ్‌మెంట్, సులభమైన రెన్యువల్‌: కస్టమర్‌లు ఏజెంట్‌లపై ఆధారపడటానికి అతి పెద్ద కారణాలలో ఒకటి క్లెయిమ్ సెటిల్‌మెంట్ సమయంలో సహాయం పొందడం. బీమా సుగమ్ పూర్తిగా డిజిటల్ క్లెయిమ్ ప్రక్రియను పరిచయం చేస్తుంది. కస్టమర్‌లు ఆన్‌లైన్‌లో క్లెయిమ్‌ను దాఖలు చేయవచ్చు, డిజిలాకర్ ద్వారా డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయవచ్చు, రియల్ టైంలో అప్‌డేట్‌ను ట్రాక్ చేయవచ్చు. బీమా సంస్థతో నేరుగా కమ్యూనికేట్ చేయవచ్చు. దీనివల్ల క్లెయిమ్‌ల సమయంలో ఏజెంట్‌లపై ఆధారపడే పరిస్థితిరాదు. రెన్యువల్‌, పోర్టిబిలిటీ కూడా బీమా సుగమ్‌తో సులభతరం అవుతాయి. అన్ని పాలసీలు ఒకే 'బీమా ఖాతా' కింద ఏకీకృతం అవుతాయి, ఆటోమేటిక్ పునరుద్ధరణ రిమైండర్‌లు లభిస్తాయి, ఒకే క్లిక్‌తో చెల్లింపులు చేయవచ్చు. ఇది ఏజెంట్‌ల వార్షిక పునరుద్ధరణ కాల్స్,సర్వీసింగ్ టచ్‌పాయింట్‌లకు పని లేకుండా చేస్తుంది. ఈ ఆన్‌లైన్ పాలసీ పునరుద్ధరణ, సౌలభ్యం బీమా ఉత్పాదకతను పెంచుతుంది.

ఏజెంట్ పాత్ర మార్పు : బీమా సుగమ్ ఏజెంట్‌లను పూర్తిగా తొలగించాలని లక్ష్యంగా పెట్టుకోనప్పటికీ, ఏజెంట్‌లు తమ పాత్ర మార్చుకుంటే ప్రమాదం ఉండదు. ఏజెంట్‌లు తమను తాము ఆర్థిక సలహాదారులుగా , ప్రత్యేక ప్రణాళిక నిపుణులుగా మారాలి. వారు కేవలం పాలసీలను అమ్మడం కాకుండా, కస్టమర్‌లకు సరైన ఆర్థిక ప్రణాళికలో సహాయపడాలి. IRDAI 'బీమా ట్రినిటీ'లో భాగంగా, 'బీమా వాహక్' (Bima Vahak) అనే మరో కార్యక్రమం ఉంది. ఇది గ్రామీణ, మహిళా నేతృత్వంలోని ఏజెంట్‌లకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లైన బీమా సుగమ్‌ను ఉపయోగించి తమ కస్టమర్‌లకు సహాయం చేయడానికి శిక్షణ, సాధనాలను అందిస్తుంది. 

బీమా వాహక్‌లు గ్రామ పంచాయతీలు, గ్రామీణ సమూహాలలో కమ్యూనిటీ-స్థాయి బీమా మార్గదర్శకులుగా పని చేస్తారు. వారు డిజిటల్‌గా శిక్షణ పొంది, బీమా సుగమ్‌కు కనెక్ట్ అయి, అమ్మకాల ఆధారంగా కాకుండా సేవ, ఆన్‌బోర్డింగ్ ఆధారంగా ప్రోత్సాహకాలు పొందుతారు. ఇది ఏజెంట్‌లు, ముఖ్యంగా సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాలలో, డిజిటల్ ఎనేబులర్‌లుగా తమను తాము మార్చుకోవడానికి, నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఒక అవకాశాన్ని ఉపయోగపడనుంది. 

బీమా సుగమ్‌ను ఎలా ఉపయోగించాలో, వివిధ బీమా సంస్థల పాలసీలపై ఎలా సలహా ఇవ్వాలో, డిజిటల్ కమ్యూనికేషన్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఈ కొత్త పాత్ర భవిష్యత్ బీమా ఏజెంట్‌లకు  మార్గం సుగమం చేస్తుంది. ఇది IRDAI రెగ్యులేషన్స్ కి అనుగుణంగా ఉంటుంది.

భారతదేశంలో డిజిటల్ విభజన ఇప్పటికీ ఉంది, కాబట్టి ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ స్వయం-సేవకు సిద్ధంగా లేరు. గ్రామీణ, టైర్-2, టైర్-3 నగరాల్లోని ప్రజలు, వృద్ధులు, తక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు ఆన్‌లైన్ పోర్టల్‌లను ఉపయోగించడానికి ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి విభాగాలలో, బీమా ఏజెంట్‌లు కీలక పాత్ర పోషిస్తారు. ULIPలు, ఎండోమెంట్,  రిటైర్‌మెంట్ ప్లాన్‌లు, వ్యాపార బీమా వంటి వాటికి లోతైన ఆర్థిక అవగాహన, దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. క్లెయిమ్‌ల వంటి భావోద్వేగ పరిస్థితుల్లో, మానవ మద్దతు చాలా విలువైనది.

బీమా సుగమ్ ఏజెంట్‌లకు ఒక 'వేక్-అప్ కాల్'. అత్యుత్తమ ఏజెంట్‌లు సలహాదారులుగా, విద్యావేత్తలుగా, డిజిటల్ PIONEERSగా మారగల కొత్త శకానికి నాందిపలుకుతుంది. డిజిటల్ పరిజ్ఞానం, విశ్వసనీయత, కస్టమర్-కేంద్రీకరణ వంటి లక్షణాలు ఉన్న ఏజెంట్‌లు మాత్రమే భవిష్యత్తులో నిలబడగలరు.