EPFO Passbook Lite: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సభ్యులకు సేవలను అందించడంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఈ వివరాలను కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. ఇకపై కోట్ల మంది పీఎఫ్ చందాదారులు తమ అన్ని సేవలను,ప్రావిడెంట్ ఫండ్ వివరాలను కేవలం ఒకే ఒక్క లాగిన్ ద్వారా పొందవచ్చు. ఈ సంస్కరణలు సేవల్లో సామర్థ్యం, పారదర్శకత, సౌలభ్యాన్ని పెంచే లక్ష్యంతో చేపట్టారు.
'పాస్‌బుక్ లైట్' అంటే ఏమిటి?
పీఎఫ్ సభ్యులు తమ కాంట్రిబ్యూషన్స్, అడ్వాన్స్‌లు లేదా విత్‌డ్రాయల్స్‌కు సంబంధించిన లావాదేవీలను తనిఖీ చేయడానికి ప్రస్తుతం EPFO ప్రత్యేక పాస్‌బుక్ పోర్టల్‌కు లాగిన్ అవ్వవలసి వస్తోంది. ఈ డబుల్ లాగిన్ ప్రక్రియ తరచుగా ఇబ్బందికరంగా ఉంటోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, EPFO తమ మెంబర్ పోర్టల్‌లో (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/) 'పాస్‌బుక్ లైట్' అనే కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.
ఈ 'పాస్‌బుక్ లైట్' ఫీచర్ వల్ల సభ్యులు ఇకపై ప్రత్యేక పాస్‌బుక్ పోర్టల్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే, తమ మెంబర్ పోర్టల్ ద్వారానే తమ పాస్‌బుక్‌ను, కాంట్రిబ్యూషన్స్, విత్‌డ్రాయల్స్, బ్యాలెన్స్ వివరాలను ఈజీగా, నచ్చినట్టుగా చూసుకునే అవకాశం కలుగుతుంది. ఇది వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుందని, ముఖ్యంగా ఒకే లాగిన్ ద్వారా అన్ని కీలక సేవలను అందిస్తుందని మంత్రి మాండవియా పేర్కొన్నారు.
పనిభారం తగ్గి, వేగం పెరిగింది
ఈ సంస్కరణ ముఖ్య ఉద్దేశ్యం సభ్యులకు సేవలను మరింత సులభతరం చేయడమే. 'పాస్‌బుక్ లైట్'విధానం వల్ల సభ్యులకు సులభంగా యాక్సెస్ లభించడమే కాకుండా, ఇప్పటికే ఉన్న పాస్‌బుక్ పోర్టల్‌పై ఉన్న పనిభారాన్ని తగ్గించనున్నారు. ఈ కొత్త ఫీచర్ మెంబర్ పోర్టల్‌లో ఇప్పటికే ఉన్న APIలను ఇంటిగ్రేట్ చేయడం ద్వారా సాంకేతిక నిర్మాణాన్ని కూడా సులభతరం చేసింది.
పాత పద్ధతిలో, పీఎఫ్ బ్యాలెన్స్ చూడాలంటే UAN, పాస్‌వర్డ్ మరియు క్యాప్చా అవసరం ఉండేది, కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. UAN నంబర్ ,OTP ఎంటర్ చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. పీఎఫ్ ఖాతాదారులు తమ EPF బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి UMANG మొబైల్ అప్లికేషన్‌ను కూడా ఉపయోగించవచ్చు, అక్కడ 'EPFO సర్వీసెస్' ఎంచుకుని, వ్యూ పాస్‌బుక్ ద్వారా UAN, OTP ఉపయోగించి వివరాలు చూడవచ్చు.
ఉద్యోగులకు ప్రయోజనం:
ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన నెలవారీ కాంట్రిబ్యూషన్ జమ అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటే, గతంలో లాగిన్ అయ్యేటప్పుడు ఆలస్యం జరిగే అవకాశం ఉండేది. ఇప్పుడు, ఈ 'పాస్‌బుక్ లైట్' ద్వారా, వారు ఒకేసారి లాగిన్ చేసి, తమ పీఎఫ్ వివరాలను తక్షణమే తనిఖీ చేయవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. ముఖ్యంగా, తమ EPF బ్యాలెన్స్‌ను తెలుసుకోవడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం లేదా 'EPFOHO UAN ENG'అని 7738299899 నంబర్‌కు SMS పంపడం ద్వారా కూడా సభ్యులు తెలుసుకోవచ్చు. అయితే, ఈ సేవలకు UAN తప్పనిసరిగా యాక్టివేట్ అయి ఉండాలి. ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతాతో లింక్ చేసి ఉండాలి.
పూర్తిస్థాయి పాస్‌బుక్ వివరాలు, గ్రాఫికల్ డిస్‌ప్లే అవసరమైతే, సభ్యులు ఇప్పటికీ పాత పాస్‌బుక్ పోర్టల్‌ను ఉపయోగించవచ్చు. ఇది ఫిర్యాదులను తగ్గిస్తుందని, పారదర్శకతను మెరుగుపరుస్తుందని, సభ్యుల సంతృప్తి స్థాయిని పెంచుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ డిజిటల్ యుగంలో సౌలభ్యం ఎంత ముఖ్యమో, భద్రత కూడా అంతే ముఖ్యం. EPFO సభ్యులు ఎప్పటికీ తమ UAN/పాస్‌వర్డ్/PAN/ఆధార్/బ్యాంక్ ఖాతా వివరాలు/OTP వంటి వ్యక్తిగత లేదా ఆర్థిక వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదు. EPFO గానీ, వారి సిబ్బంది గానీ ఎప్పుడూ మెసేజ్‌లు, కాల్స్, వాట్సాప్ లేదా సోషల్ మీడియా ద్వారా ఈ వివరాలను అడగరు. అటువంటి నకిలీ కాల్స్ లేదా మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసు/సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేయాలని EPFO హెచ్చరిస్తోంది.