EPFO Messages To Subscribers: మన దేశంలో దాదాపు ఆరు కోట్లకు పైగా ఉన్న EPFO చందాదార్లకు (subscribers), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక మెసేజ్ పంపింది. మీరు కూడా సబ్‌స్క్రైబర్ అయితే, ఇప్పటికే ఆ మెసేజ్ మీకూ వచ్చి ఉంటుంది, మీ మొబైల్ ఫోన్ మెసేజ్ బాక్స్‌ను ఒకసారి చెక్ చేసుకోండి.
PF వడ్డీ డబ్బులు మీ అకౌంట్‌లో జమ అయ్యాయా, లేదా అనే విషయాన్ని పాస్‌బుక్ ద్వారా తెలుసుకోవచ్చని ఆ మెసేజ్‌లో ఈపీఎఫ్‌వో వెల్లడించింది. పాస్‌బుక్‌లో వడ్డీని ఆలస్యంగా అప్‌డేట్ చేయడం వల్ల ఖాతాదారుకు ఎలాంటి ఆర్థిక నష్టం ఉండదని స్పష్టం చేసింది.
మీరు ఆన్‌లైన్‌లో PF ఖాతాను తనిఖీ చేయవచ్చు. దీనికోసం తప్పనిసరిగా UAN (Universal Account Number), పాస్‌వర్డ్‌ను ఉండాలి.
వడ్డీ అప్‌డేషన్‌కు ముందే డబ్బును విత్‌డ్రా చేస్తే?
ఒక సభ్యుడు, తన పాస్‌బుక్‌లో వడ్డీని అప్‌డేట్ చేయడానికి ముందే తన EPF బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకుంటే వడ్డీ యాడ్ అవుతుందా, లేదా?. ఈ ప్రశ్నకు EPFO సమాధానం చెప్పింది. PF ఇంట్రస్ట్‌ను పాస్‌బుక్‌లో అప్‌డేట్ చేయడానికి ముందే డబ్బును వెనక్కు తీసుకున్న సందర్భంలోనూ చందాదారుకు నష్టం ఉండదని వెల్లడించింది. చెల్లించాల్సిన మొత్తం వడ్డీని క్లెయిమ్ సెటిల్‌మెంట్ సమయంలో చెల్లిస్తారు. ఇది, కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా ఆటోమేటిక్‌గా జరుగుతుంది. కాబట్టి, లెక్కల్లో తేడా రాదని, ఏ ఒక్క సభ్యుడికి ఆర్థిక నష్టం ఉండదని స్పష్టం చేసింది.
EPF వడ్డీ రేటు
2023 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేటును భారత ప్రభుత్వం 8.15 శాతానికి పెంచింది. దీనివల్ల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఉన్న ఆరు కోట్ల మందికి పైగా సభ్యులకు ప్రయోజనం చేకూరుతుంది.
ఆన్‌లైన్‌లో పాస్‌బుక్‌ను ఎలా తనిఖీ చేయాలి?
మీరు EPFO అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా EPFO పాస్‌బుక్‌ని ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయవచ్చు. ఇందుకు, మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పాస్‌వర్డ్ కచ్చితంగా తెలిసి ఉండాలి.
అధిక పెన్షన్ కింద దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీని EPFO 26 జూన్ 2023 వరకు పొడిగించింది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS - 95) కింద హైయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు రూ. 15 వేలకు మించిన వేతనంపై 1.16% అదనంగా కాంట్రిబ్యూట్ చెయ్యాలన్న నిబంధనపై EPFO వెనక్కి తగ్గింది. ఆ మొత్తాన్ని యజమాన్య వాటా నుంచే తీసుకోవడానికి నిర్ణయించింది. గత నెలలో, కార్మిక మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: వన్నె తగ్గిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి