PF Interest Rate : దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 2025-26 ఆర్థిక సంవత్సరపు వడ్డీ రేటుపై స్పష్టత వచ్చింది. గత ఫిబ్రవరి నెలలో జరిగిన సమావేశంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిఫార్సు చేసిన 8.25 శాతం వడ్డీ రేటును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేయనుంది. 

Continues below advertisement

ఈ నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే EPFO తన పరిధిలోని సబ్‌స్క్రైబర్‌ల ఖాతాల్లోకి వడ్డీని క్రెడిట్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తుంది. వరుసగా రెండో ఏడాది కూడా ప్రభుత్వం 8.25 శాతం వడ్డీని యథాతథంగా కొనసాగిస్తోంది.              

వడ్డీ రేటు ఖరారు ఎలా చేస్తారు?

పీఎఫ్‌వడ్డీ రేటు ప్రకటన అనేది ఒక ఆర్గనైజ్డ్‌ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. ఫిబ్రవరి 2న జరిగిన సమావేశంలో ఈపీఎఫ్‌వో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్‌ ట్రస్టీస్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.25 శాతంగా ఉంచాలని ప్రతిపాదించింది. సీబీటీ ఆమోదం తెలిపిన తర్వాత కార్మిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ రేటును పరిశీలించి అధికారికంగా నోటిఫై చేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ చివరి దశలో ఉంది. ప్రభుత్వం నుంచి అధికారిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఈపీఎఫ్‌వో సాంకేతిక ప్రక్రియను పూర్తి చేసి చందాదారుల ఖాతాల్లోకి వడ్డీని జమ చేస్తుంది. 

Continues below advertisement

Also Read: పీఎఫ్‌ విత్‌డ్రా చేయడానికి రెండు ప్రధాన ఆప్షన్లు, ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం

8.25 వడ్డీ రేటు కంటిన్యూ

మారిన ఆర్థిక పరిస్థితుల్లో ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే ఈపీఎఫ్‌ ఇప్పటికే ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తోంది. గత కొన్నేళ్లుగా ఈపీఎఫ్‌ 8 శాతానికి పైగా వడ్డీని స్థిరంగా కొనసాగిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా 8.25 శాతం వడ్డీని అందించారు. ఇప్పుడు 2025-26కు కూడా అదే రేటును నిర్ణయించడం ద్వారా చందాదారులకు తమ పొదుపుపై భరోసా లభిస్తుంది. 

ఎదురు చూస్తున్న  కోట్లమంది ఉద్యోగులు 

ఈపీఎఫ్‌వో అనేది కేవలం ఒక పొదుపు పథకం మాత్రమే కాదు. ఇది కోట్లాది మంది ఉద్యోగుల పదవీ విరమణ కాలపు ఆర్థిక భద్రత. గత పదేళ్లుగా పరిశీలిస్తే ఈపీఎఫ్‌వో తన చందాదారులకు మెరుగైన రిటర్న్ అందించటానికి ప్రయత్నిస్తోంది. గతంలో చాలా ఏళ్ల పాటు 8 శాతం కంటే తక్కువ వడ్డీని ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ 8.25 శాతం వడ్డీని నిలుపుకోవడం అనేది ఉద్యోగులకు ఊరటనిచ్చే అంశం. 

వడ్డీ జమ అయ్యిందని ఎలా చెక్ చేయాలి?

మీ యూఏఎన్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. పాస్‌బుక్ చెక్ చేయాలి. మొబైల్ యాప్ ద్వారా సులభంగా బ్యాలెన్స్ చూడవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్‌ కాల్, ఎస్‌ఎంఎస్ పంపించడం ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. 

Also Read: పీఎఫ్‌ విత్‌డ్రా ఇప్పుడు ఇంకా ఈజీ, ఆ కీలక రూల్‌ రద్దు