PF Withdrawal Online And Offline Rules: మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా లేదా ప్రైవేట్ రంగంలో పని చేస్తున్నా, మీకు 'ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' (EPFO)లో అకౌంట్‌ ఉంటుంది. మీరు కూడబెట్టిన PF డబ్బును ఉపసంహరించుకోవాలనుకుంటే, ఈ ఏడాది, EPFO రెండు ఎంపికలు మీ ముందుకు తీసుకొచ్చింది. 

పీఎఫ్ డబ్బును ఉపసంహరించుకునే పద్ధతులు:

EPF అకౌంట్‌ నుంచి డబ్బును విత్‌డ్రా చేయడానికి, ప్రస్తుతం, రెండు మార్గాలు ఉన్నాయి. అవి - 1. ఆఫ్‌లైన్ మార్గం (పూర్తి చేసిన ఫారాన్ని భౌతికంగా సమర్పించడం), 2. ఆన్‌లైన్ మార్గం (UAN పోర్టల్ ద్వారా సమర్పించడం). 

1. ఆఫ్‌లైన్ పద్ధతి - మీ UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్), ఆధార్, బ్యాంక్ వివరాలు EPFO పోర్టల్‌లో లింక్ చేయకపోతే, మీరు కాంపోజిట్ క్లెయిమ్ ఫారాన్ని పూరించి, సంబంధిత అధికారికి సమర్పించాలి.

ఎవరు ఏ ఫారం నింపాలి? కాంపోజిట్ క్లెయిమ్ ఫారం (ఆధార్‌) – మీ ఆధార్, బ్యాంక్ ఖాతా, UAN EPFO పోర్టల్‌లో వెరిఫై అయితే, మీ కంపెనీ నుంచి ధృవీకరణ అవసరం లేకుండానే మీరు ఈ ఫారాన్ని సమర్పించవచ్చు.

కాంపోజిట్ క్లెయిమ్ ఫారం (నాన్‌-ఆధార్‌) – ఆధార్ లేదా బ్యాంక్ వివరాలు లింక్‌ కాకపోతే మీరు ఈ ఫారాన్ని కంపెనీ ధృవీకరణ ద్వారా సమర్పించాలి. ఈ ఫారాన్ని EPFO అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

2. ఆన్‌లైన్ పద్ధతి - మీ UAN యాక్టివ్‌గా ఉండి, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాల వెరిఫికేషన్ జరిగి ఉంటే, మీరు ఆన్‌లైన్‌లో PF డబ్బును ఉపసంహరించుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో పీఎఫ్ ఉపసంహరించుకునే విధానం

UAN పోర్టల్‌ https://unifiedportal-mem.epfindia.gov.in లోకి కి లాగిన్ అవ్వండి.

KYC చెక్‌ చేయండి - Manage > KYC లోకి వెళ్లి ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు వెరిఫై అయ్యాయో, లేదో చెక్‌ చేయండి.

క్లెయిమ్ ఫారం నింపండి – Online Services > Claim (Form 31, 19, 10C & 10D) పై క్లిక్ చేయండి.

బ్యాంక్ ఖాతాను ధృవీకరించండి – మీ బ్యాంక్‌ ఖాతా నంబర్‌ను నమోదు చేసి, 'Verify' బటన్‌ మీద క్లిక్ చేయండి.

క్లెయిమ్ టైప్‌ ఎంచుకోండి –

పూర్తి PF ఉపసంహరణ (Full Settlement) కొంత మొత్తం ఉపసంహరణ (Partial Withdrawal)

పెన్షన్ ఉపసంహరణ (Pension Withdrawal)

వివరాలను పూరించి సమర్పించండి, స్కాన్ చేసిన పత్రాలను అప్‌లోడ్ చేయండి (అవసరమైతే).

గమనిక: మీరు ఉద్యోగం మానేస్తే, మీరే Exit Date ను నమోదు చేయవచ్చు. దీనికోసం Manage > Mark Exit లోకి వెళ్లాలి.

PF విత్‌డ్రా స్టేటస్‌ను ఎలా చెక్‌ చేయాలి?

UAN పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.

Online Services > Track Claim Status పై క్లిక్ చేయండి.

రిఫరెన్స్ నంబర్ ఎంటర్ చేసి స్టేటస్ తనిఖీ చేయండి.

ఏటీఎం నుంచి కూడా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చుభారత ప్రభుత్వం 2025 నాటికి EPF 3.0 ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనిలో, మీరు కార్డ్‌ సాయంతో మీ PF ఖాతా నుంచి డబ్బు ఉపసంహరించుకోవచ్చు. ఈ ఫీచర్ త్వరలో ప్రారంభం అవుతుంది. ఈ కార్డ్‌ పొందడానికి UAN నంబర్, ఆధార్ కార్డ్, PAN కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు (IFSC కోడ్), రద్దు చేసిన చెక్‌ వంటివి అవసరం. మీరు ఆఫ్‌లైన్‌లో PF డబ్బు విత్‌డ్రా చేసే సమయంలో కూడా ఇవే పత్రాలు అవసరం.