EPF interest: ఈపీఎఫ్‌వో వడ్డీలో ఎలాంటి కోత లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కొందరు ఈపీఎఫ్‌వో చందాదారుల ఖాతాల్లో 2022 ఏడాది వడ్డీ ఆలస్యం లేదా కనిపించకపోవడానికి సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడేషన్‌ కారణమని వెల్లడించింది. గతేడాది పన్ను మార్పులు చేపట్టడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని పేర్కొంది. 2021-22 ఏడాదికి గాను 8.1 శాతం వడ్డీరేటును కేంద్ర ప్రభుత్వం జూన్‌లో ఆమోదించింది. అంతకు ముందు 8.5 శాతం వడ్డీ ఇచ్చిన సంగతి తెలిసిందే.




'ఈపీఎఫ్‌వో చందాదారుల్లో ఎవ్వరూ వడ్డీ నష్టపోలేదు. అందరి ఖాతాల్లోనూ వడ్డీ జమ చేశాం. పన్ను మార్పుల వల్ల సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ చేస్తుండటం వల్ల కొందరి ఈపీఎఫ్‌వో స్టేట్‌మెంట్లలో వడ్డీ కనిపించడం లేదు. ఈపీఎఫ్‌వో నుంచి వైదొలగేవారు, విత్‌డ్రావల్‌ చేసుకుంటున్న వారి ఖాతాల్లోనూ వడ్డీ జమ చేశాం' అని ఫైనాన్స్‌ మినిస్ట్రీ తెలిపింది.


ఇలా తెలుసుకోండి


ఎస్‌ఎంఎస్‌: మీ ఈపీఎఫ్‌వో ఖాతాలో ఎంత డబ్బుందో తెలుసుకొనేందుకు సులభ మార్గం సందేశం పంపించడం. మీ ఫోన్లో EPFOHO UAN ENG అని 7738299899 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయాలి.


మిస్డ్‌ కాల్‌: నమోదిత సభ్యులు 011-22901406 నంబర్‌కు మిస్‌డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా ఖాతాలోని మొత్తం తెలుసుకోవచ్చు. ఒకసారి మిస్‌డ్‌ కాల్‌ ఇవ్వగానే మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఎంతుందో ఒక సందేశం వస్తుంది.




వెబ్‌సైట్‌: నేరుగా ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కు వెళ్లి ఖాతాలో బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు.


ఉమాంగ్‌ యాప్‌: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఉమాంగ్‌ యాప్‌ ద్వారా మీ పీఎఫ్‌ పాస్‌బుక్‌ చూడొచ్చు. ఓటీపీ ద్వారా ఈ యాప్‌లో లాగిన్‌ అవ్వొచ్చు. యాప్‌లోకి వెళ్లాక ఈపీఎఫ్‌వోపై క్లిక్‌ చేస్తే చాలు. ఉద్యోగి సేవలకు తీసుకెళ్తుంది. అక్కడ వ్యూ పాస్‌బుక్‌పై క్లిక్‌ చేస్తే ఓటీపీ అడుగుతుంది. దానిని ఎంటర్‌ చేస్తే ఖాతాలోని మొత్తం వివరాలు కనిపిస్తాయి.