DA Hike: 


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు శుభవార్త! అతిత్వరలోనే డియర్‌నెస్‌ అలవెన్స్‌ (DA) పెరుగుతుందని సమాచారం. కనీసం నాలుగు పర్సంటేజీ పాయింట్లు పెంచుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఇప్పుడున్న 38 నుంచి 42 శాతానికి డీఏ చేరుకుంటుంది.


ప్రస్తుత వినియోగదారుల ధరల సూచీ (CPI-IW) ఆధారంగా ఉద్యోగులు, పింఛన్‌దారులకు ప్రభుత్వం కరవుభత్యం (DA) పెంచుతుంది. కార్మిక శాఖ ప్రతి నెలా దీనిని మదింపు చేస్తుంది. 'గతేడాది డిసెంబర్‌ నెల వినియోగదారుల ధరల సూచీ 2023, జనవరి 1న విడుదల చేశారు. ఈ లెక్కన 4.3 శాతం వరకు డీఏ పెంచాలి. కానీ ప్రభుత్వం నాలుగు శాతమే పెంచే సూచనలు ఉన్నాయి. అలాంటప్పుడు మొత్తం డీఏ 42 శాతానికి చేరుకుంటుంది' అని అఖిల భారత రైల్వేమెన్‌ సమాఖ్య జనరల్‌ సెక్రటరీ శివ గోపాల్‌ మిశ్రా అన్నారు.


తమ రాబడిని పరిగణనలోకి తీసుకొని డీఏ పెంపు ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖా పరిధిలోని ఖర్చుల శాఖ కేంద్ర మంత్రి వర్గానికి పంపిస్తుందని ఆయన తెలిపారు.


పెంచిన డీఏ 2023, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం కోటికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు 38 శాతం కరవుభత్యం పొందుతున్నారు. 2022, సెప్టెంబర్ 28న చివరిసారిగా డీఏను సవరించారు. 2022, జులై‌ 1 నుంచి అది అమల్లోకి వచ్చింది. చివరి 12 నెలల వినియోగదారుల ధరల సూచీ సగటు ఆధారంగా నాలుగు శాతం డీఏ పెంచడంతో అది 38కి చేరుకుంది.


DA ఎందుకిస్తారంటే?


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై ద్రవ్యోల్బణం (Inflation) ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం డీఏను చెల్లిస్తుంది. ఇది ఉద్యోగులు, పింఛన్‌దారులకు వర్తిస్తుంది. ఏడో వేతన కమిషన్‌ (7th Pay Commission) ప్రకారం డీఏను ఏటా రెండుసార్లు పెంచుతారు. జనవరి, జులైలో వీటిని అమలు చేస్తారు. ఉద్యోగి పనిచేస్తున్న ప్రాంతాన్ని బట్టీ డీఏ పెరుగుదలలో తేడాలు ఉంటాయి. రూరల్‌, సెమీ అర్బన్‌తో పోలిస్తే అర్బన్‌ ఉద్యోగులకు ఎక్కువ డీఏ వస్తుంది.


డీఏ ఎలా లెక్కిస్తారంటే?


బేసిక్‌ సాలరీని బట్టి డియర్‌నెస్‌ అలవెన్స్‌ను గణిస్తారు. ఇందుకోసం అఖిల భారత వినియోగ ధరల సూచీ (AICPI)ని ప్రామాణికంగా తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే (చివరి 12 నెలల ఏఐసీపీఐ (బేస్‌ ఇయర్‌ 2001-100) సగటు - 115.76)/115.76)*100 ప్రకారం ఇస్తారు. పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగులకు (చివరి మూడు నెలల ఏఐసీపీఐ (బేస్‌ ఇయర్‌ 2016=100) సగటు - 126.33)/126.33)*100 ప్రకారం లెక్కిస్తారు.