Benifits Of National Pension System: జాతీయ పింఛను పథకం (NPS)తో చక్కటి పన్ను ఆదా అవకాశాలను అందుకోవచ్చు. అయితే, NPS గురించి పెట్టుబడిదారుల్లో కొన్ని అపోహలు ఉన్నాయి.


అపోహ 1: NPS పన్ను ప్రయోజనాలు ఇతర పెట్టుబడుల మాదిరిగానే ఉంటాయి
వాస్తవం: NPS సాంప్రదాయ సెక్షన్ 80Cని మించి పన్ను ప్రయోజనాలను అందిస్తుంది:


సెక్షన్ 80 CCD (1): రూ. 1.50 లక్షల వరకు (80C పరిమితిలో భాగం). పాత పన్ను విధానానికి వర్తిస్తుంది
సెక్షన్ 80CCD(1B): అదనంగా రూ. 50,000. ఇది ప్రత్యేకంగా NPS కోసం. పాత పన్ను విధానానికి వర్తిస్తుంది
సెక్షన్ 80CCD(2): యాజమాన్యం సహకారంపై (పాత పన్ను విధానానికి ప్రాథమిక జీతంలో 10 శాతం వరకు & కొత్త పన్ను విధానానికి ప్రాథమిక జీతంలో 14 శాతం వరకు) పన్ను మినహాయింపు. ఇది ట్రిపుల్ బెనిఫిట్‌.


అపోహ 2: డబ్బు ఉపసంహరణపై పన్ను చెల్లించాలి
వాస్తవం: NPS మినహాయింపు-మినహాయింపు-మినహాయింపు (EEE) మోడల్‌ను అనుసరిస్తుంది: 60 సంవత్సరాల వయస్సు చేరుకున్న తర్వాత లంప్సమ్‌గా తీసుకున్న 60 శాతం మొత్తం లేదా క్రమబద్ధంగా వెనక్కు తీసుకునే డబ్బు పన్ను రహితం. మిగిలిన 40 శాతంతో యాన్యుటీని కొనుగోలు చేయాలి. అయితే, యాన్యుటీ నుంచి వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలి. 


అపోహ 3: ముందుగానే నిష్క్రమిస్తే పన్ను ప్రయోజనాలు కోల్పోతారు
వాస్తవం: NPS నిబంధనల ప్రకారం, ఖాతా నుంచి ఎగ్జిట్‌ అయినప్పుడు పన్ను ప్రయోజనాలను వెనక్కు తీసుకోవడం జరగదు. అయితే, ముందస్తు నిష్క్రమణకు పరిమితులు ఉన్నాయి. మీ పెట్టుబడిని కొనసాగిస్తే, కాంపౌండింగ్ పవర్‌ నుంచి అధిక ప్రయోజనం పొందుతారు


అపోహ 4: అధిక ఆదాయం ఉన్న వ్యక్తులకు మాత్రమే NPSతో ప్రయోజనం
వాస్తవం: ఆదాయంతో సంబంధం లేకుండా పన్ను చెల్లించే ప్రతి ఒక్కరికీ పన్ను ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు, కార్పొరేట్ NPS కింద ప్రయోజనాలు పొందుతున్న కార్పొరేట్ ఉద్యోగులు, సెక్షన్ 80CCD(2)ని ఉపయోగించుకుని, పన్ను విధించదగిన ఆదాయాన్ని మరింత తగ్గించుకోవచ్చు.


అపోహ 5: లాక్-ఇన్ పీరియడ్‌ వల్ల పన్ను ప్రయోజనాలకు విలువ లేదు
వాస్తవం: NPSలోని లాక్-ఇన్ పీరియడ్ గొప్ప పన్ను ప్రయోజనాలను అందిస్తూనే క్రమశిక్షణతో కూడిన పదవీ విరమణ పొదుపులు చేసేలా ముందుకు నడిపిస్తుంది. దీర్ఘకాలంలో సంపదను నిర్మించే సాధనంగా ఇది పని చేస్తుంది.


అపోహ 6: సెక్షన్ 80C పరిమితిని అయిపోతే NPSలో పెట్టుబడి పెట్టలేరు
వాస్తవం: పాత పన్ను విధానంలో... సెక్షన్ 80C గరిష్ట పరిమితి రూ. 1.50 లక్షలకు మించిపోయినప్పటికీ, సెక్షన్ 80CCD(1B) కింద అదనంగా రూ. 50,000 తగ్గింపును, సెక్షన్ 80CCD(2) కింద ప్రాథమిక జీతంలో 10 శాతం వరకు మినహాయింపు పొందవచ్చు. కొత్త పన్ను విధానంలో.. ప్రాథమిక జీతంలో 14 శాతం పన్ను మినహాయింపు లభిస్తుంది.


అపోహ 7: పన్ను ప్రయోజనాలను పొందడానికి అధిక నెలవారీ సహకారం అవసరం
వాస్తవం: కనీసం రూ. 500 ఉన్నా NPS ఖాతాను ప్రారంభించవచ్చు, పన్ను మినహాయింపులను ఆస్వాదించవచ్చు. NPS టైర్ 1 అకౌంట్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి సంవత్సరానికి రూ. 1000 పెట్టుబడి మాత్రమే అవసరం.


అపోహ 8: జీతం పొందే ఉద్యోగులకు మాత్రమే NPS పన్ను ప్రయోజనాలు లభిస్తాయి
వాస్తవం: జీతం పొందేవాళ్లే కాదు, స్వయం ఉపాధి పొందే వ్యక్తులు కూడా సెక్షన్‌ 80CCD(1), సెక్షన్‌ 80CCD(1B) కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. కార్పొరేట్‌ NPS కింద సెక్షన్ 80CCD(2) నుంచి కూడా ప్రయోజనం పొందవచ్చు. 


అపోహ 9: యజమాని చెల్లించే డబ్బు పన్ను పరిధిలోకి వస్తుంది
వాస్తవం: యజమాని చెల్లించే డబ్బుకు (పాత పన్ను విధానంలో ప్రాథమిక జీతంలో 10 శాతం వరకు మరియు కొత్త పన్ను విధానంలో 14 శాతం వరకు) సెక్షన్ 80CCD(2) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇది సెక్షన్‌ 80C, సెక్షన్‌ 80CCD(1B) పరిమితులకు అదనం.


అపోహ 10: లాక్-ఇన్ పిరియడ్‌ కారణంగా NPS వ్యవస్థ కఠినం
వాస్తవం: విద్య, వివాహం, ఇల్లు కొనుగోలు లేదా వైద్య అత్యవసర పరిస్థితుల వంటి నిర్దిష్ట ప్రయోజనాల కోసం NPS నుంచి పాక్షిక మొత్తాలను ఉపసంహరించుకోవచ్చు. అదే సమయంలో పన్ను ప్రయోజనాలను అందిస్తుంది.


అపోహ 11: NPS పన్ను ప్రయోజనాలు సంక్లిష్టంగా ఉంటాయి
వాస్తవం: NPS పన్ను ప్రయోజనాలు సాంకేతికంగా సంక్లిష్టంగా అనిపించవచ్చు. కానీ, విడివిడిగా చూస్తే అవి స్పష్టంగా అర్ధమవుతాయి. 
మీ కంట్రిబ్యూషన్: రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపులు (80CCD(1) + 80CCD(1B)).
యాజమాన్యం కంట్రిబ్యూషన్: 80CCD(2) కింద వ్యక్తిగత కంట్రిబ్యూషన్‌కు మించి.


అపోహ 12: యువ పెట్టుబడిదారులకు NPS ప్రయోజనాలు పనికిరావు
వాస్తవం: ఎంత త్వరగా NPS ఖాతాను ప్రారంభిస్తే, అంత ఎక్కువగా కాంపౌండింగ్ పవర్‌ లభిస్తుంది, దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో సంపద పోగుపడుతుంది. ప్రారంభం నుంచే పన్ను ఆదాను ఆస్వాదించవచ్చు. అంటే, పొదుపు + పెట్టుబడి రెండు ప్రయోజనాలనూ పొందవచ్చు.


పొదుపును ప్రోత్సహించడానికి, పన్ను ప్రయోజనాలను అందించడానికి, పదవీ విరమణ సమయానికి ఆర్థిక మద్దతు కోసం NPSను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.


మరో ఆసక్తికర కథనం: మీ కుమార్తెకు కలలకు రెక్కలు ఇవ్వండి, సంపదను గిఫ్ట్‌గా అందించండి - సూపర్‌ స్కీమ్‌ ఇది