TDS Rule Changes In Budget 2025: 2025-26 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), ఇంటి అద్దెపై వర్తించే TDS (Tax Deducted at Source) నియమాలను కూడా మార్చారు. వార్షిక ఇంటి అద్దెపై టీడీఎస్ మినహాయింపు పరిమితిని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న రూ. 2.4 లక్షల నుంచి నేరుగా రూ. 6 లక్షలకు పెంచింది.
ఇప్పటి వరకు, రూ. 2.4 లక్షలు దాటితే, అంటే నెలకు రూ. 20,000 అద్దె దాటితే టీడీఎస్ కట్ చేసిన తర్వాత రెంట్ చెల్లించాలి. ఇకపై, రూ. 6 లక్షల వార్షిక అద్దె వరకు, అంటే నెలకు రూ. 50,000 వరకు అద్దె చెల్లింపుపైనా టీడీఎస్ కట్ చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల టీడీఎస్ పరిధిలోకి వచ్చే లావాదేవీల సంఖ్య తగ్గుతుందని బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. ఈ కొత్త రూల్స్ వల్ల, అద్దెదారు (Tenant) లేదా ఇంటి యజమాని (House Owner)లో ఎవరు ఎక్కువ ప్రయోజనం పొందుతారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇంటి యజమానికి ప్రయోజనం
ఉదాహరణకు.. మీరు, మీ ఇంటిని సంవత్సరానికి రూ. 2.40 లక్షలకు అద్దెకు ఇచ్చారని అనుకుందాం. ఇప్పటివరకు అద్దెదారు TDS తగ్గించిన తర్వాత మీకు అద్దె చెల్లించేవారు. కానీ, 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి, అంటే 01 ఏప్రిల్ 2025 నుంచి అలా ఉండదు. TDS తగ్గించకుండానే అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా, అద్దె రూపంలో ఇంటి యజమాని పొందే మొత్తం పెరుగుతుంది. TDSపై మినహాయింపు పరిమితిని రూ. 2.4 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంచడం వల్ల ఈ ప్రయోజనం చేకూరుతుంది.
అద్దెకు ఉండే వాళ్లకు పెద్ద ఉపశమనం
నిజానికి, మెట్రో & నాన్-మెట్రో నగరాల్లో గత కొన్ని సంవత్సరాలుగా ఇంటి అద్దెలు చాలా వేగంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో, అద్దె ఇంటి కోసం వెతికిన చాలా మందికి ఇది అనుభవమే. అద్దెకు ఇల్లు తీసుకుంటే, ఇప్పుటి వరకు, అద్దెదారు నెలకు రూ. 20,000 లేదా అంతకంటే మొత్తం అద్దెపై TDS కట్ చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు రూ. 50,000 వరకు అద్దెకు కూడా TDS కట్ చేయవలసిన అవసరం లేదు. ముఖ్యంగా మెట్రోపాలిటన్ నగరాల్లో అద్దెకు నివసించే ప్రజలకు ఇది గొప్ప ఉపశమనం కలిగిస్తుంది.
కాబట్టి, ఇంటి అద్దెకు సంబంధించి కొత్త టీడీఎస్ రూల్స్ వల్ల ఇంటి యజమాని & అద్దెదారు ఇద్దరికీ ప్రయోజనం లభిస్తుంది.
అద్దెపై ఎంత TDS మినహాయింపు ఉంటుంది?
బడ్జెట్‌లో చేసిన కొత్త మార్పుల తర్వాత, ఇంటి వార్షిక అద్దె రూ. 6 లక్షల కంటే ఎక్కువగా ఉంటేనే TDS తగ్గింపు తర్వాత అద్దెదారు తన ఇంటి యజమానికి రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి యజమానికి పాన్ కార్డ్ (PAN Card) ఉంటే, అద్దెదారు తాను చెల్లించాల్సిన అద్దెపై 10% TDS తగ్గించి మిగిలిన డబ్బును చెల్లించాలి. ఇంటి యజమాని దగ్గర పాన్ కార్డ్ లేకపోతే, టీడీఎస్ రేటు 20 శాతానికి పెరుగుతుంది.
మరో ఆసక్తికర కథనం: మీ భార్యకు ఇంటి ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చినా ఐటీ నోటీస్ రావచ్చు!