How To Get An Increase In Credit Card Limit: ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారు. క్రెడిట్‌ కార్డ్‌ను జారీ చేసే బ్యాంక్‌ లేదా ఆర్థిక సంస్థ, కస్టమర్‌ ఆర్థిక పరిస్థితిని బట్టి క్రెడిట్‌ కార్డ్‌ లిమిట్‌ను నిర్ణయిస్తాయి. కాబట్టి, క్రెడిట్‌ కార్డ్‌ పరిమితి కస్టమర్‌ ఆదాయం, ఆర్థిక స్థితిని బట్టి మారుతుంది. క్రెడిట్‌ కార్డ్‌ ఔట్‌స్టాండింగ్‌ను కస్టమర్‌ సక్రమంగా చెల్లిస్తుంటే, అతని ఆర్థిక పరిస్థితిపై బ్యాంక్‌ సంతృప్తి చెందితే, క్రెడిట్‌ కార్డ్‌పై వినియోగంపై ఆ కస్టమర్‌ అధికంగా ఆధారపడకపోతే.. అతని క్రెడిట్‌ కార్డ్‌ పరిమితిని బ్యాంక్‌ ఎప్పటికప్పుడు పెంచుతుంది. దీనికి రివర్స్‌లో... కొన్నిసార్లు క్రెడిట్ కార్డ్ పరిమితిని తగ్గిస్తుంది కూడా. మీ క్రెడిట్‌ కార్డ్‌ పరిమితి తగ్గితే.. ఆ సమాచారం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇ-మెయిల్‌లో మీకు అందితుంది. బ్యాంక్‌ అకస్మాత్తుగా ఇలా ఎందుకు చేసిందో మీకు అర్ధం కాకపోవచ్చు. కానీ, ఏ బ్యాంక్‌ అయినా కారణం లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోదు. 


ఔట్‌స్టాండింగ్‌ను సకాలంలో చెల్లించలేకపోతే...
బ్యాంక్‌ మీకు క్రెడిట్‌ కార్డ్‌ ఇచ్చిందంటే దాని అర్ధం ఆ బ్యాంక్‌ మీకు కొంత డబ్బును అప్పుగా ఇచ్చిందని. మీరు క్రెడిట్‌ కార్డ్‌ను ఉపయోగించి ఏదైనా కొన్నప్పుడు, బ్యాంక్‌ ఇచ్చిన రుణాన్ని ఉపయోగించున్నట్లు అర్ధం. కాబట్టి, కార్డ్ బకాయిని (Credit Card Outstanding) తిరిగి చెల్లించాలి, ముఖ్యంగా ఈ చెల్లింపును ఆలస్యం చేయకూడదు. చెల్లింపుల్లో ఆలస్యం జరిగినప్పుడు వడ్డీ, ఫైన్‌ వంటివి కట్టినప్పటికీ, మీపై పడ్డ బ్లాక్‌ మార్క్‌ మాత్రం చెరిగిపోదు. ఇలా ఎక్కువ సార్లు ఆలస్యం చేసినప్పుడు మాత్రమే సదరు బ్యాంక్‌ మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని తగ్గిస్తుంది. బ్యాంక్‌ మిమ్మల్ని రిస్క్ కస్టమర్‌గా చూస్తుంది. బకాయిలు చెల్లించడానికి మీ దగ్గర తగినంత డబ్బు లేదని బ్యాంక్ భావిస్తుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్ పరిమితిలో కోత పెడుతుంది.


ట్రాన్స్‌యూనియన్ కంపెనీ... సిబిల్ డేటా క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్‌లలో (రుణం చెల్లింపుల్లో ఎగవేతలు) భారీ పెరుగుదల ఉన్నట్లు వెల్లడించింది. ఈ డిఫాల్ట్‌ రేటు 2023 మార్చిలోని 1.6 శాతం నుంచి 2024 జూన్ నాటికి 1.8 శాతానికి పెరిగింది. 'బయ్‌ నౌ పే లేటర్' (BNPL) స్కీమ్‌లు, ఇ-కామర్స్ సైట్‌లలో ఆకర్షణీయమైన EMIల కారణంగా రుణ చెల్లింపుల్లో ఎగవేతలు పెరుగుతున్నట్లు ట్రాన్స్‌యూనియన్ వెల్లడించింది.


భారతదేశంలో క్రెడిట్ కార్డ్ బకాయిల మొత్తం జూన్ 2024 నాటికి రూ. 2.7 లక్షల కోట్లకు పెరిగింది. ఇది మార్చి 2024లో రూ. 2.6 లక్షల కోట్లుగా, దీనికి ఏడాది క్రితం మార్చి 2023లో రూ. 2 లక్షల కోట్లుగా ఉందని ట్రాన్స్‌యూనియన్ నివేదిక వెల్లడించింది. క్రెడిట్ కార్డ్‌ల ద్వారా షాపింగ్‌ అలవాటు కాలక్రమేణా పెరిగిందని, ఈ కారణంగా ప్రజలు సకాలంలో చెల్లించడంలో విఫలమవుతున్నారని స్పష్టంగా చెప్పింది.


మీ క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉన్నప్పుడు మాత్రమే బ్యాంక్ మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని కొనసాగిస్తుంది. వాడుకున్న డబ్బును తిరిగి ఇవ్వడంలో పదేపదే విఫలమైతే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది, బ్యాంక్ మీ కార్డ్ పరిమితిని తగ్గిస్తుంది.


మీరు ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లను ఏకకాలంలో ఉపయోగిస్తుంటే, బ్యాంక్ మిమ్మల్ని ప్రమాదకర వినియోగదారుగా పరిగణించడం ప్రారంభిస్తుంది. మీరు రుణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారన్న నిర్ధరణకు వస్తుంది. ఈ పరిస్థితిలో కూడా బ్యాంక్‌ మీ కార్డ్‌ పరిమితిని తగ్గించవచ్చు.


కార్డ్ పరిమితి తగ్గినప్పుడు ఈ పని చేయండి
కార్డ్ పరిమితి తగ్గినా కంగారు పడాల్సిన పని లేదు. ముందుగా, మీ బ్యాంక్‌ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి, మీ రీపేమెంట్‌ను ఎందుకు మిస్‌ అయ్యారో ఖచ్చితమైన కారణాన్ని వివరించండి. మీ కార్డ్ పరిమితిని పెంచమని అభ్యర్థించండి. మీ అభ్యర్థనతో బ్యాంక్‌ సంతృప్తి చెందితే, వెంటనే మీ క్రెడిట్‌ లిమిట్‌ పెంచుతుంది. అప్పటికప్పుడు పెంచకపోయినా, మీరు ఏ ఒక్క పేమెంట్‌ను మిస్‌ చేయకుండా కడుతూ వెళ్తే, మీరు అడగాల్సిన అవసరం లేకుండానే భవిష్యత్‌లో మీ క్రెడిట్‌ లిమిట్‌ పెంచవచ్చు. 



క్రెడిట్‌ కార్డ్‌ పరిమితిని పెంచుకునే చిట్కాలు
మీ క్రెడిట్‌ కార్డ్‌ పరిమితి ఎంతో మీకు ఎప్పుడూ గుర్తుండాలి. ఒక క్రెడిట్‌ కార్డ్‌ బిల్లింగ్‌ సైకిల్‌లో, మీ క్రెడిట్ కార్డ్ పరిమితిలో గరిష్టంగా 30 శాతాన్ని మాత్రమే ఉపయోగించడానికి ప్రయత్నించండి. మీరు కార్డ్ పరిమితిలో 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉపయోగించినప్పుడు, మీరు రిస్క్‌ జోన్‌లోకి వస్తారు. క్రెడిట్‌ కార్డ్‌ వినియోగ పరిమితిని యుటిలైజేషన్ రేషియో అంటారు, ఇది కనిష్టంగా ఉంటేనే మంచిది. యుటిలైజేషన్ రేషియో స్థిరంగా తక్కువగా ఉంటే, బ్యాంక్‌ ఎప్పటికప్పుడు మీ క్రెడిట్‌ లిమిట్‌ను పెంచుతూనే ఉంటుంది. ఈ సమాచారం కూడా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇ-మెయిల్‌లో మీకు అందితుంది. 


మరో ఆసక్తికర కథనం: నగలు కొనేవాళ్లకు పండగ, భారీగా తగ్గిన గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు - ఈ రోజు కొత్త ధరలు ఇవీ