Investments In Gold ETFs Are On Rise: మార్కెట్‌లో అందుబాటులో ఉన్న పెట్టుబడి మార్గాల్లో గోల్డ్ ఈటీఎఫ్ ఒకటి. ప్రస్తుతం, పెట్టుబడిదార్లను ఈక్విటీలతో పాటు బంగారం కూడా బాగా ఆకర్షిస్తోంది. గోల్డ్ రేట్లు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు పోటెత్తున్నారు. ఎల్లో మెటల్‌ను నేరుగా కొనడంతో పాటు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకీ డబ్బుల వరద పారిస్తున్నారు.
ఈటీఎఫ్ అంటే ఏంటి?
ఈటీఎఫ్ అంటే ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ (Exchange Traded Fund). మ్యూచవల్ ఫండ్స్‌లో (Mutual Funds) ఇది ఒక రకం. అన్ని మ్యూచువల్ ఫండ్స్‌లాగే ఇవి కూడా ఇన్వెస్టర్ల నుంచి డబ్బు సేకరిస్తాయి. ఈ ఫండ్ కింద సేకరించిన మొత్తాన్ని బంగారంలో (Bullion Market) ఇన్వెస్ట్ చేస్తారు. అయితే.. ఇతర ఫండ్స్‌కు భిన్నంగా ఇవి యూనిట్ల రూపంలోనూ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటాయి. ఈక్విటీల తరహాలోనే ఈటీఎఫ్ యూనిట్లను ట్రేడ్ చేయవచ్చు. అందుకే వీటిని ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని పిలుస్తారు.
మార్కెట్‌లో ఉన్న ప్రముఖ గోల్డ్ ఈటీఎఫ్‌లు
యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్, IDBI గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, ICICI ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్, ఇన్వెస్కో ఇండియా గోల్డ్ ఈటీఎఫ్, కోటక్ గోల్డ్ ఈటీఎఫ్, HDFC గోల్డ్, నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీస్, SBI గోల్డ్ ఈటీఎఫ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ఈటీఎఫ్.
7 రెట్లు పెరిగిన పెట్టుబడులు
'అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా' (AMFI-ఆంఫి), తాజాగా, కొంత సమాచారాన్ని విడుదల చేసింది. ఆ డేటా ప్రకారం.. 2024 జనవరిలో గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లోకి మొత్తం రూ. 657.4 కోట్ల పెట్టుబడి వచ్చింది. 2023 డిసెంబర్‌లో ఈ మొత్తం రూ.88.3 కోట్లుగా ఉంది. అంటే, నెల రోజుల్లోనే పెట్టుబడులు 7 రెట్లు పెరిగాయి. దీంతో గోల్డ్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తి 2024 జనవరి చివరి నాటికి 1.6 శాతం పెరిగి రూ. 27,778 కోట్లకు చేరుకుంది. 2023 డిసెంబర్ చివరి నాటికి ఈ మొత్తం రూ. 27,336 కోట్లుగా ఉంది.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రాంతీయ, రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం రేటు కారణంగా బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఇష్టపడుతున్నారని నిపుణులు భావిస్తున్నారు. బంగారాన్ని సురక్షిత స్వర్గం/ సురక్షిత పెట్టుబడి మార్గంగా (Safe Haven) పరిగణిస్తారు.
రాబోయే రోజుల్లో, యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ (US FED), తన వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. ఇదే జరిగితే సమీప భవిష్యత్‌లో బంగారం ధరలు మరింత పెరిగొచ్చు, గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులపై మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంది. గోల్డ్ ఈటీఎఫ్ కింద, దేశీయ భౌతిక బంగారం ధరను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో పెట్టిన పెట్టుబడి, భౌతిక బంగారం ధరలపై ఆధారపడి ఉంటుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: టాక్స్ ఆదా చేసే ఎఫ్‌డీలు ఇవి, వడ్డీ కూడా భారీగానే సంపాదించొచ్చు!