Aadhaar Card Update: భారత పౌరుడి అధికారిక గుర్తింపు పత్రాల్లో ఆధార్ ఒకటి. ఆధార్ అంటే వట్టి సంఖ్య మాత్రమే కాదు, ఆ కార్డులో సదరు వ్యక్తి పేరు, వయస్సు, చిరునామా వంటి సమాచారంతో పాటు అతి కీలకమైన వేలిముద్రలు (బయోమెట్రిక్), కంటిపాపల (ఐరిస్) సమాచారం కూడా ఉంటుంది. కాబట్టి, ఇది చాలా ముఖ్యమైన పత్రం. వ్యక్తిగత గుర్తింపును నిరూపించుకోవాల్సిన ప్రతిచోటా దీని అవసరం ఉంటుంది. ఆధార్ లేకపోతే స్కూల్లో అడ్మిషన్ దొరకదు, బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయలేం, ఉద్యోగంలో చేరలేం, ఏ ప్రభుత్వ పథకం అందదు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆధార్ కార్డ్ వివరాల్లో చిన్న తప్పు దొర్లినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల, ఆధార్‌లో తప్పులు ఉంటే వెంటనే సరి చేసుకోవడం శ్రేయస్కరం.
ఆధార్ కార్డ్‌పై ఉన్న పేరులో తప్పును సవరించుకోవడం దగ్గర నుంచి అడ్రస్ మార్చుకోవడం వరకు చాలా వివరాలను అప్‌డేట్ చేయవచ్చు. ఆధార్ జారీ చేసే సంస్థ 'యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (UIDAI లేదా ఉడాయ్) దీనికి అనుమతిస్తుంది. అయితే, వివరాలు సరి చేసుకోవడంపై 2019లో కొన్ని ఆంక్షలు విధించింది. ఉడాయ్ ఆదేశాల ప్రకారం... ఆధార్ కార్డుపై ఉండే పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలను పరిమిత సంఖ్యలో మాత్రమే మార్చుకోవడానికి వీలవుతుంది.
ఆధార్ కార్డ్‌లో పేరు మార్పు (Name Change in Aadhaar Card)
ఉడాయ్ నిబంధన ప్రకారం... ఆధార్ కార్డ్‌పై ఉండే భారత పౌరుడి పేరును కేవలం రెండుసార్లు మాత్రమే మార్చుకోవడానికి వీలవుతుంది.
ఆధార్ కార్డ్‌లో పుట్టిన తేదీ మార్పు (Change of Date of Birth in Aadhaar Card)
ఆధార్ కార్డ్‌లో పుట్టిన తేదీని ఒకసారి మాత్రమే మార్చుకోవడానికి అనుమతి ఉంది. ఆధార్‌ను తొలిసారి తీసుకున్న సమయంలో నమోదు చేసిన పుట్టిన తేదీకి మూడేళ్లు ఎక్కువ లేదా తక్కువలో ఉన్న కొత్త తేదీని నమోదు చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ 'ప్లస్ ఆర్ మైనస్ మూడేళ్ల రూల్'ను మించి వెళ్లడానికి కుదరదు. ఒకవేళ, తొలిసారి ఆధార్ తీసుకున్నప్పుడు నమోదు సమయంలో పుట్టిన తేదీకి సంబంధించి ఎలాంటి పత్రాలు రుజువుగా సమర్పించకపోతే, దానిని ‘డిక్లేర్డ్’ లేదా ‘అప్రాగ్జిమేట్’గా పేర్కొంటారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఈ తేదీని మార్చుకోవాల్సి వచ్చినప్పుడు, పుట్టిన తేదీకి సంబంధించిన ధ్రువపత్రాన్ని రుజువుగా చూపించాల్సి ఉంటుంది. ఇలాంటి వాళ్లకు 'ప్లస్ ఆర్ మైనస్ మూడేళ్ల రూల్' వర్తించదు. వాళ్లు సమర్పించిన ధ్రువపత్రంలోని తేదీని పుట్టిన తేదీగా నమోదు చేస్తారు.
ఆధార్ కార్డ్‌లో జెండర్ మార్పు (Gender Change in Aadhaar Card)
ఆధార్ కార్డ్‌లో జెండర్ (ఆడ/మగ) తప్పుగా పడితే, దానిని సరి చేయడానికి జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది.
ఆధార్ కార్డ్‌లో ఫొటో మార్పు (Photo Change in Aadhaar Card)
ఆధార్ కార్డ్‌లో మీ ఫొటో తప్పుగా ముద్రితమైనా, మీకు నచ్చకపోయినా దానిని మార్చుకోవచ్చు. ఆధార్ కార్డ్‌లోని మీ ఫొటోని మీరు ఎన్నిసార్లయినా అప్‌డేట్ చేయవచ్చు, దీనిపై ఎలాంటి ఆంక్షలు/పరిమితి లేదు. అయితే, ఆధార్ కార్డ్‌లో ఫొటోను ఆన్‌లైన్‌లో మార్చడం సాధ్యం కాదు. మీకు దగ్గరలో ఉన్న ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి మళ్లీ ఫొటో దిగాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డ్‌లో చిరునామా మార్పు (Change of Address in Aadhaar Card)
ఆధార్ కార్డ్‌లో చిరునామాను మార్చుకోవడంపైనా ఉడాయ్ ఎలాంటి పరిమితిని విధించలేదు. దీనిని ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. చిరునామాను ధ్రువీకరించే పత్రం మీ దగ్గర ఉంటే, ఇంట్లోనే కూర్చుని ఆధార్‌లో అడ్రస్ అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ కార్డ్ వివరాల్ని పరిమితికి మించి అప్‌డేట్ చేయాలంటే..
ఆధార్ కార్డ్‌దారుడి పేరు, పుట్టిన తేదీ, జెండర్ వివరాలను పరిమితికి మించి మార్చుకోవాలంటే మాత్రం ప్రత్యేక అనుమతి తెచ్చుకోవాలి. ఇందుకోసం, దగ్గరలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి. పరిమితి మంచి సవరణ చేస్తున్నామని, కార్డ్ వివరాలను అప్‌డేట్ చేయమని అభ్యర్థిస్తూ ఉడాయ్‌కి ఈ-మెయిల్ లేదా పోస్ట్ పంపాలి. పరిమితికి మించి వివరాలను ఎందుకు మార్చాల్సి వస్తుందో ఆ లేఖలో పేర్కొనాలి. ఈ-మెయిల్ ద్వారా అయితే... help@uidai.gov.in ఐడీకి పంపవచ్చు. మీ విజ్ఞప్తి ఉడాయ్‌కి చేరాక, అక్కడి అధికారులు దానిని పరిశీలిస్తారు. పరిమితికి మించి వివరాలు మార్చడం సమంజసమేనని వాళ్లు భావిస్తే.. మార్పులు చేసేందుకు అనుమతి ఇస్తారు. ఈ ప్రాసెస్ అక్కడితో ముగుస్తుంది, కొత్త వివరాలతో కొత్త ఆధార్ కార్డు మీ ఇంటికి వస్తుంది.