Paytm SBI RuPay Credit Card: నెక్ట్‌ జెనరేషన్‌ 'పేటీఎం ఎస్‌బీఐ రూపే క్రెడిట్‌ కార్డ్‌'ను లాంచ్‌ చేయబోతోంది పేటీఎం. ఇందుకోసం, ఎస్‌బీఐ కార్డ్‌ (SBI Card)తో, రూపే నెట్‌వర్క్‌ సృష్టికర్త 'నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా'తో (NPCI) ఈ పేమెంట్స్‌ సర్వీసెస్‌ కంపెనీ జట్టు కట్టింది. వాటి సహకారంతో నెక్ట్స్‌ జనరేషన్ కో-బ్రాండెడ్ రూపే క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించబోతోంది. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌ను పెంచే ఉద్దేశ్యంతో ఈ మూడు కంపెనీలు చేతులు కలిపాయి. 


ఇది రూపే కార్డ్‌ కాబట్టి, UPI చెల్లింపుల కోసం ఈ క్రెడిట్‌ కార్డ్‌ను ఉపయోగించుకోవచ్చు. అంటే, UPI QR కోడ్‌లను స్కాన్‌ చేసి క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా చెల్లింపు చేయవచ్చు, మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ ద్వారా చెల్లింపు పూర్తి  చేయవచ్చు. లావాదేవీల సంఖ్య పెరిగేందుకు ఇది తోడ్పడుతుంది. ప్రజలకు క్రెడిట్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు, క్రెడిట్ తీసుకునేవాళ్లను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం ఈ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించడం వెనుకున్న లక్ష్యం.


పేటీఎం ఎస్‌బీఐ రూపే క్రెడిట్‌ కార్డ్‌ ప్రయోజనాలు:            


పేటీఎం ఎస్‌బీఐ రూపే క్రెడిట్‌ కార్డ్‌ తీసుకున్న వినియోగదార్లకు స్వాగత ప్రయోజనాలు, క్రెడిట్‌ కార్డ్‌తో చేసే వ్యయాలపై క్యాష్‌బ్యాక్ పాయింట్లు, మరికొన్ని ఇతర బెనిఫిట్స్‌ను పేటీఎం అందిస్తుంది.           


వెల్‌కమ్ బెనిఫిట్ ద్వారా వినియోగదార్లు రూ. 75,000 ప్రత్యేక ప్రయోజనం పొందుతారు. పేటీఎం ప్రైమరీ మెంబర్‌షిప్‌, OTT ప్లాట్‌ఫామ్ సభ్యత్వం, విమానాల టిక్కెట్‌లపై తగ్గింపు, Paytm యాప్ ద్వారా చేసే బుకింగ్స్‌పై ప్రయోజనాలు వంటివి అందుతాయి. ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ స్టోర్‌లతో పాటు Paytm యాప్‌లో కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా రివార్డ్స్‌ లభిస్తాయి. పేటీఎం ఎస్‌బీఐ రూపే క్రెడిట్‌ కార్డును ఉపయోగించి పేటీఎం ఫ్లాట్‌ఫామ్‌లో చేసే ప్రతి చెల్లింపుపై 2 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌లో చేసే చెల్లింపులకు 1% క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది. వాలెట్‌లోకి నగదు ఫిల్‌ చేయడం, పెట్రోల్‌/డీజిల్‌ కొనుగోళ్లకు బెనిఫిట్స్‌ ఉండవు. అయితే 1% మేర ఇంధన సర్‌ఛార్జీ మినహాయింపు పొందవచ్చు.          


పేటీఎం ఎస్‌బీఐ రూపే ప్లాటినమ్‌ క్రెడిట్‌ కార్డ్‌ తీసుకున్నవాళ్లు సైబర్‌ మోసాల బారినపడితే, వాళ్లకు లక్ష రూపాయల వరకు బీమా కవరేజీ లభిస్తుంది. పేటీఎం యాప్‌ ద్వారా, ఈ కార్డ్‌ను ఉపయోగించి సినిమా టిక్కెట్లు కొన్నా, ప్రయాణ టిక్కెట్‌లు బుక్ చేసుకున్నా 3% క్యాష్‌బ్యాక్ పొందుతారు. ప్లాటినమ్‌ కార్డ్‌తో ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌లో చేసే కొనుగోళ్లకు 2 శాతం క్యాష్‌ బ్యాక్‌ పొందవచ్చు.


వాస్తవానికి, మూడేళ్ల క్రితం నుంచి, అంటే 2020 నుంచే పేటీఎం-ఎస్‌బీఐ కార్డ్‌ మధ్య పార్ట్‌నర్‌షిప్‌ ఉంది. తాజాగా, NPCIని కూడా కలుపుకుని రూపే నెట్‌వర్క్‌కు తమ భాగస్వామ్యాన్ని విస్తరించాయి. ఫలితంగా, ఈ మూడు సంస్థల కాంబినేషన్‌లో నెక్ట్‌ జెనరేషన్‌ 'పేటీఎం ఎస్‌బీఐ రూపే క్రెడిట్‌ కార్డ్‌' వస్తోంది.


ఇది కూడా చదవండి: పాత-కొత్త పన్ను పద్ధతుల్లో దేన్ని ఫాలో అవుతున్నారు, ఇప్పటికీ తేల్చుకోలేదా?