EPFO Interest credit soon Here is how to check EPF balance: ఉద్యోగ భవిష్య నిధి (EPFO) వడ్డీరేటును 8.1 శాతంగా ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే నిర్ణయం తీసుకుంది. 2021-22 ఏడాదికి గాను ఉద్యోగులు జమ చేసిన మొత్తంపై ఈ వడ్డీరేటును అమలు చేయనున్నారు. గత నాలుగు దశాబ్దాల్లో ఇదే అతి తక్కువ వడ్డీరేటు కావడం గమనార్హం.


ఉద్యోగ భవిష్య నిధి (EPFO) వడ్డీరేటు 8.1 శాతానికి తగ్గించాలన్న ఈపీఎఫ్‌ ట్రస్టు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 2021-22 ఏడాదికి ఇదే వడ్డీ రేటు అమలు చేయనుంది. ట్రస్టు ధర్మకర్తలు చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఈపీఎఫ్‌వో అధికారికి తాజాగా వెల్లడించారు.


గత నాలుగు దశాబ్దాల్లో ఈపీఎఫ్‌పై అతి తక్కువ వడ్డీరేటు ఇదే కావడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండటం, ప్రభుత్వ ఆదాయం తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గతంలో తెలిపారు. కాగా గతంలో ఈపీఎఫ్‌ ఖాతాల్లో ఎంత మొత్తం జమైందో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. ఖాతాలన్నీ డిజిటలైజ్‌ చేయడంతో పరిస్థితి మారిపోయింది. ఆన్‌లైన్‌, మొబైల్‌ ద్వారా ఖాతాలో ఎంత డబ్బుందో తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్‌ లేనివారు ఎస్‌ఎంఎస్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.


ఎస్‌ఎంఎస్‌: మీ ఈపీఎఫ్‌వో ఖాతాలో ఎంత డబ్బుందో తెలుసుకొనేందుకు సులభ మార్గం సందేశం పంపించడం. మీ ఫోన్లో EPFOHO UAN ENG అని 7738299899 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయాలి.


మిస్డ్‌ కాల్‌: నమోదిత సభ్యులు 011-22901406 నంబర్‌కు మిస్‌డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా ఖాతాలోని మొత్తం తెలుసుకోవచ్చు. ఒకసారి మిస్‌డ్‌ కాల్‌ ఇవ్వగానే మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఎంతుందో ఒక సందేశం వస్తుంది.


వెబ్‌సైట్‌: నేరుగా ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కు వెళ్లి ఖాతాలో బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు.


ఉమాంగ్‌ యాప్‌: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఉమాంగ్‌ యాప్‌ ద్వారా మీ పీఎఫ్‌ పాస్‌బుక్‌ చూడొచ్చు. ఓటీపీ ద్వారా ఈ యాప్‌లో లాగిన్‌ అవ్వొచ్చు. యాప్‌లోకి వెళ్లాక ఈపీఎఫ్‌వోపై క్లిక్‌ చేస్తే చాలు. ఉద్యోగి సేవలకు తీసుకెళ్తుంది. అక్కడ వ్యూ పాస్‌బుక్‌పై క్లిక్‌ చేస్తే ఓటీపీ అడుగుతుంది. దానిని ఎంటర్‌ చేస్తే ఖాతాలోని మొత్తం వివరాలు కనిపిస్తాయి.