Paytm To Acquire An e-Commerce Startup: ఆర్‌బీఐ కఠిన ఆంక్షలు విధించినా, ఆర్‌బీఐ గవర్నర్‌ సీరియస్‌ కామెంట్లు చేసినా ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం ఏమాత్రం వెనక్కు తగ్గేది లేదంటోంది. ఊపిరాడనివ్వని ఇబ్బందుల మధ్యే కొత్త కంపెనీని కొనుగోలు చేయబోతోంది. బెంగుళూరు కేంద్రంగా పని చేసే ఇ-కామర్స్ స్టార్టప్ కంపెనీ 'బిట్సిలా'తో (Bitsila) ఒప్పందం కుదుర్చుకోవచ్చు. నేషనల్‌ మీడియా రిపోర్ట్‌లను బట్టి చూస్తే ఈ అక్విజిషన్‌ డీల్‌ దాదాపుగా ఖరారైంది.


వచ్చే వారంలో డీల్ పూర్తయ్యే అవకాశం
పేటీఎం త్వరలోనే బిట్సిలాను కొనుగోలు చేయవచ్చని మనీకంట్రోల్ ఒక వార్తను పబ్లిష్‌ చేసింది. ONDCలో పనిచేస్తున్న ఇంటర్‌ఆపరబుల్ ఇ-కామర్స్ స్టార్టప్ కంపెనీ బిట్సిలా. లావాదేవీల పరంగా చూస్తే, ఓఎన్‌డీసీలో సెల్లర్స్‌ తరపున వ్యవహరిస్తున్న మూడో అతి పెద్ద కంపెనీ ఇది. ఈ పర్చేజ్‌ డీల్‌ ఫైనల్‌ స్టేజ్‌లో ఉందని, వచ్చే వారంలో డీల్‌ పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.


బిట్సిలా వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, 2020లో ఈ కంపెనీ ప్రారంభమైంది. దాశరథం బిట్ల, సూర్య పోకల్లి కలిసి ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు. అంట్లర్ ఇండియా, రెడ్‌బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర సామా నుంచి ప్రీ-సీడ్ రౌండ్‌లో ఈ కంపెనీ నిధులు సేకరించింది. సెల్లర్‌ సైడ్‌ యాప్‌ను బిట్సిలా నడుపుతోంది. బిజినెస్-టు-బిజినెస్ (B2B) విభాగంలో పని చేసే ఈ కంపెనీ, ONDCలో చిన్న వ్యాపారులకు సాయం చేస్తుంది.


వ్యాపార విస్తరణలో పేటీఎంకు మద్దతు
తన ఇ-కామర్స్ వ్యాపారాన్ని విస్తరించేందుకు, పేటీఎంకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. పేటీఎం కూడా ONDCలో సేవలను అందిస్తోంది. పేటీఎం 2022 నుంచి ONDCలో యాక్టివ్‌గా ఉంది. ప్రభుత్వ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో యాప్‌ను ఇంటిగ్రేట్ చేసిన మొదటి పెద్ద కంపెనీల్లో ఇది ఒకటి. ప్రస్తుతం, పేటీఎం సేవలు బయ్యర్‌ యాప్ రూపంలో ONDCలో అందుబాటులో ఉన్నాయి.


తన బ్యాంకింగ్ యూనిట్ 'పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌' (Paytm Payments Bank) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో పేటీఎం ఈ డీల్‌ కుదుర్చుకోవడం విశేషం. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ మీద రిజర్వ్ బ్యాంక్ ఇటీవల చర్యలు తీసుకుంది. ఈ నెల 29 తర్వాత, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ కొత్త కస్టమర్‌లను యాడ్‌ చేయకుండా & కొత్త క్రెడిట్ బిజినెస్‌ చేయకుండా RBI ఆంక్షలు విధించింది. 


ఆర్‌బీఐ కఠిన చర్యల తర్వాత, గత కొన్ని రోజుల్లో పేటీఎం షేర్లు 50 శాతానికి పైగా పడిపోయాయి. ఈ రోజు (శుక్రవారం, 09 ఫిబ్రవరి 2024) ట్రేడింగ్‌లో, ఉదయం 10.32 గంటల సమయానికి పేటీఎం షేర్‌ ధర రూ.34.05 లేదా 7.62% తగ్గి రూ.412.60 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: కాస్త తెరిపినిచ్చిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే